క్రీడలపై మక్కువ పెంచేందుకే ‘ఆడుదాం ఆంధ్రా’

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌

క్రీడల పట్ల యువతకు మక్కువ పెంచేందుకే రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమాన్ని చేపట్టిందని శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేనురాజు తెలిపారు. మంగళవారం స్థానిక అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి అంబేద్కర్‌ చౌక్‌ వరకూ ఏర్పాటు చేసిన ‘ఆడుదాం ఆంధ్రా’ మారథాన్‌ ర్యాలీని రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజ్‌ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి, జిల్లా ఎస్‌పి యు.రవిప్రకాష్‌, జెసి ఎస్‌.రామ్‌సుందర్‌ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొయ్యే మోషేను రాజ్‌ మాట్లాడారు. ఈ నెల 26 నుంచి 47 రోజులపాటు సచివాలయాల పరిధిలో, మండల, నియోజకవర్గ పరిధిలో, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున వినూత్న రీతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. ప్రతి విద్యార్థీ ఏదో ఒక ప్రతిభ కలిగి ఉంటారని, ప్రతిభను గుర్తించి, ప్రదర్శించి, ప్రోత్సహించే దిశగా అనేక నూతన కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికిందని తెలిపారు. కలెక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఆడుదాం ఆంధ్రా మారథాన్‌ను చేపట్టినట్లు తెలిపారు. మారథాన్‌ అంబేద్కర్‌ చౌక్‌కు చేరుకున్న తరువాత గాలిలోకి బెలూన్ల జిల్లా కలెక్టర్‌ ఎగరవేశారు. అనంతరం జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో సత్తా చాటిన విజేతలకు మెడల్స్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్‌పి యు.రవిప్రకాష్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామ్‌ సుందర్‌ రెడ్డి, డిఆర్‌ఒ శివనారాయణరెడ్డి, ‘ఆడుదాం ఆంధ్రా’ జిల్లా అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న ఇంటర్నేషనల్‌ అథ్లెటిక్‌ సత్తి గీతారెడ్డి, నేషనల్‌ అథ్లెటిక్‌ స్పోర్ట్స్‌ పోల్‌వాల్‌ కోచ్‌ పి.సత్యనారాయణరాజు, శ్రీవిజ్ఞాన వేదిక కన్వీనర్‌ శ్రీరంగసాయి, ఆర్‌డిఒ కె.శ్రీనివాసులు రాజు, డిఎస్‌పి బి.శ్రీనాథ్‌, జిల్లా స్పోర్ట్స్‌ అధికారి దుర్గారావు పాల్గొన్నారు.జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలి : కలెక్టర్‌ భీమవరం రూరల్‌:ఎందరో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు నెలవైన పశ్చిమగోదావరి జిల్లా ఖ్యాతిని నేటితరం యువత ఇనుమడింపజేయాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి పిలుపు నిచ్చారు. స్థానిక లూథరన్‌ ఉన్నత పాఠశాల మైదానంలో ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలను మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఘనంగా ప్రారంభించారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆమె జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జిల్లా కలెక్టరు, జిల్లా జాయింటు కలెక్టరు స్వయంగా క్రికెట్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసి క్రీడలను ప్రాంభించారు. జిల్లాలో క్రీడలకు ప్రాతినిధ్యం వహించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని, జిల్లాలో 47 రోజులపాటు జరిగే పోటీల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ పోటీలకు నాణ్యత గల కిట్లు అందుబాటులో ఉంచామన్నారు. ఆరోగ్యానికి క్రీడలు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జెసి ఎస్‌.రామ్‌ సుందర్‌ రెడ్డి, ఆర్‌డిఒ కె.శ్రీనివాసులు రాజు, జిల్లా వార్డు, గ్రామ సచివాలయాల అధికారి కెసిహెచ్‌.అప్పారావు, వివిధ శాఖల అధికారులు, పురపాలక సంఘ కమీషనర్‌ ఎం.శ్యామల, తహశీల్దార్‌ వై.రవికుమార్‌, రాష్ట్ర గౌడ సంక్షేమ కార్పొరేషన్‌ డైరెక్టరు కామన నాగేశ్వరరావు, వాలంటీర్లు పాల్గొన్నారు.

➡️