గ్రూప్‌-2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ

ప్రజాశక్తి – భీమవరం

ఎపిపిఎస్‌సి గ్రూప్‌-2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణపై చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, రూట్‌ ఆఫీసర్లు, లైజాన్‌ ఆఫీసర్లు, అబ్జర్వర్లతో నిర్వహించిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుంచి జిల్లాలో గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. 37 సెంటర్లను ఏర్పాటు చేశారని, భీమవరం డివిజన్‌లో 21, నరసాపురం డివిజన్‌లో 3, తాడేపల్లిగూడెం డివిజన్‌లో 13 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆబ్జెక్టివ్‌ విధానంలో ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్న పరీక్షలకు 14,546 మంది హాజరు కానున్నారన్నారు. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. జిల్లాలో పరీక్షల నిర్వహణకు సమన్వయ అధికారిగా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డిని నియమించినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు 37 మంది చొప్పున లైజాన్‌ ఆఫీసర్స్‌, చీఫ్‌ సూపరింటెండెంట్స్‌, జిల్లా అధికారులను 17 మందిని రూట్‌ఆఫీసర్లుగా నియమించారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు, తిరిగి గమ్యాలకు చేరేందుకు అభ్యర్థులకు అనువుగా ఆర్‌టిసి బస్సులు, రూట్‌మ్యాప్‌లు సిద్ధం చేసుకోవాలని ఆర్‌టిసి అధికారులను ఆదేశించారు. అభ్యర్థుల హాల్‌ టికెట్‌, ఒరిజినల్‌ ఫొటో ఐడితోపాటు నిర్దేశించిన గుర్తింపు కార్డుతో పరీక్షా కేంద్రానికి ముందుగా హాజరు కావాలన్నారు. సమావేశంలో భీమవరం, తాడేపల్లిగూడెం ఆర్‌డిఒలు కె.శ్రీనివాసులురాజు, కె.చెన్నయ్య, ఎపిపిఎస్‌సి సెక్షన్‌ అధికారి జె.జయంతి, ఎఎస్‌ఒ ఎ.నాగలక్ష్మి, డిఇఒ ఆర్‌.వెంకటరమణ, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ డి.మహేశ్వరరావు, జిల్లా రవాణాధికారి టి.ఉమామహేశ్వరరావు, జిల్లా పశుసంవర్థక శాఖాధికారి డాక్టర్‌ కె.మురళీకృష్ణ, హౌసింగ్‌ ఇఇ బి.వెంకటరమణ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారి ఎ.రామస్వామి, బిసి సంక్షేమ శాఖ జిల్లా అధికారి జి.గణపతిరావు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి కె.శోభారాణి, ఐసిడిఎస్‌ జిల్లా అధికారి బి.సుజాతరాణి, జిల్లా ట్రైబల్‌ అధికారి డి.పుష్పరాణి, డిఎల్‌డిఒ ఎవి.అప్పారావు, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి పిహెచ్‌జిఆర్‌.పాపారావు, తహాశీల్దార్లు, ఎంపిడిఒలు, ప్రయివేటు కళాశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️