ఘనంగా గెలీలియో జయంతి

Feb 15,2024 23:00

ప్రజాశక్తి – ఉంగుటూరు
మండలంలోని నారాయణపురం ఉషోదయ పబ్లిక్‌ స్కూల్లో గెలీలియో జయంతి సందర్భంగా మహనీయుల ఆశయాల ప్రచార కమిటీ ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన మహనీయుల ఆశయ ప్రచార కమిటీ మండలాధ్యక్షులు డాక్టర్‌ కొండ రవి మాట్లాడుతూ సమాజాభివృద్ధికి కృషి చేసిన మహనీయులు, శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకుని ప్రతి విద్యార్థి సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. మూఢ నమ్మకాలను విడిచిపెట్టి విజ్ఞాన సముపార్జన చేసి సమాజాన్ని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉందన్నారు. ఆధునిక భౌతిక, గణిత, తత్వశాస్త్రాలలో ప్రావీణ్యం సంపాదించిన మేధావి, టెలిస్కోప్‌ను కనుగొని సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని, భూమి గుండ్రంగా ఉందని నిరూపించిన గెలీలియోకు ఆనాటి సమాజం తిరస్కరించి మరణశిక్ష విధించిందన్నారు. ఏలూరు ఎవిఆర్‌ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహరావు మాట్లాడుతూ మన ప్రాంతంలోనే జన్మించి స్వాతంత్రోద్యమంలో పాల్గొని దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులు అల్లూరి సీతారామరాజు శత జయంతి సందర్భంగా వారి జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను వివరించారు. త్యాగ మూర్తుల గొప్పతనాన్ని తెలియజేసే పుస్తకాన్ని, క్యాలెండర్‌ను ఉషోదయ హైస్కూల్‌ ఉపాధ్యాయులకు అందించారు. గెలీలియోకు నివాళి అర్పించారు. మహనీయుల ఆశయాల ప్రచార కమిటీ ఉంగుటూరు మండల సభ్యులు కొర్ని అప్పారావు, ఎస్‌.అప్పారావు, ఉషోదయ హై స్కూల్‌ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️