జనరిక్‌లో తక్కువ ధరకే నాణ్యమైన మందులు

డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌.నరసింహరాజు

ప్రజాశక్తి – ఉండి

రోజురోజుకీ మందుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, పేదలకు నాణ్యమైన మందులను తక్కువ ధరకు అందించడంలో జనరిక్‌ మందుల షాపులు ఎంతో కీలకమని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ ఛైర్మన్‌ పివిఎల్‌.నరసింహరాజు అన్నారు. ఆదివారం యండగండి కోఆపరేటివ్‌ రూరల్‌ బ్యాంక్‌లో జనరిక్‌ మందుల షాపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా మందులు గ్రామస్తులకు అందించి జనరిక్‌ మందులు వాడాలని సూచించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ ఆధ్వర్యంలో ఐదు చోట్ల జనరిక్‌ మందుల షాపులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు ఇప్పటికే మూడుచోట్ల ఏర్పాటు చేశామని, మరో రెండు ప్రాంతాల్లో త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. సహకార సంఘాలు రైతు సంక్షేమంతోపాటు రైతు ఆరోగ్యానికి కూడా పెద్దపీట వేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వ సహకారంతో జనరిక్‌ మందుల షాపులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. మార్కెట్లో ఎక్కువ ధరకు పలికే మందులు కూడా అతి తక్కువ ధరకే నాణ్యమైన మందులు ఇక్కడ లభ్యమవుతాయన్నారు. ప్రజలు వీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే మరింతగా విస్తరించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ప్రత్యేకంగా ఫార్మాసిస్ట్‌ పర్యవేక్షణలో మందుల షాపు ఉండటం వల్ల రోగులకు ఇబ్బంది లేకుండా వారి రోగానికి అవసరమైన మందులు అందించేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. డిసిసిబి బ్రాంచ్‌ ఆధ్వర్యంలో బ్యాంకు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎటిఎంను ఆయన ప్రారంభించారు. ఖాతాదారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, దీనిని వినియోగించుకోవాలని ఆయన రైతులకు సూచించారు. ఈ సందర్భంగా బ్యాంకు కార్యదర్శి సిహెచ్‌.రవికుమార్‌ మాట్లాడుతూ గతంలో మొబైల్‌ ఎటిఎంగా దీన్ని వాడే వారమని, ప్రస్తుతం రైతులకు నిరంతరం అందుబాటులో ఉంచేందుకు బ్యాంకు ప్రాంగణంలో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉణుదుర్రు గ్రామ సర్పంచి పిన్నంరాజు నాగలక్ష్మి, ఎంపిటిసి అల్లూరి మాధవి, బ్యాంకు పాలకవర్గ సభ్యులు దాట్ల కామరాజు, పైడి రామారావు, ఖాతాదారులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️