జర్నలిస్టులపై దాడికి ఖండన

ప్రజాశక్తి – నరసాపురం

రాప్తాడులో సిఎం జగన్‌ సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై జరిగిన దాడిని ఖండిస్తూ నరసాపురం ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎఒ రామకృష్ణకు, డిఎస్‌పి కార్యాలయంలో డిఎస్‌పి రవి మనోహరాచారికి ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్‌ సభ్యులు ఎం.మురళీధర్‌, ఎ.చిన్నారావు, టి.ఇజ్రాయేల్‌, సిహెచ్‌.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.తప్పులు ఎత్తిచూపితే మీడియాపై దాడులు చేస్తారా అని మాజీ ఎంఎల్‌ఎ బండారు మాధవ నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో పాత్రికేయ మిత్రులపై, మీడియా కార్యాలయాలపై వైసిపి శ్రేణులు చేస్తున్న దాడిని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా మాజీ ఎంఎల్‌ఎ బండారు మాధవనాయుడు మాట్లాడుతూ మీడియాపై వైసిపి మూకలు చేస్తున్న దాడులు హేయమైనవని విమర్శించారు. ప్రభుత్వం మీడియా గొంతు నొక్కేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. మీడియాపై వైసిపి ప్రభుత్వం చేస్తున్న దాడిని ఖండిస్తూ ఈ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో చెంపాటి సత్యనారాయణ రాజు, కొండేటి శ్రీను, చాగంటి సురేష్‌, చాగంటి నరేంద్ర, కాజ హేమ, శేఖర్‌ బాబు, నాగరాజు పాల్గొన్నారు. పాలకొల్లు :జిల్లాలో, రాష్ట్రంలో జర్నలిస్ట్‌లపై జరుగుతున్న దాడులను ఎపియుడబ్లూజె జిల్లా సమావేశం తీవ్రంగా ఖండించింది. ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు విన్నకోట వెంకట రమణ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ తొలి సమావేశం లయన్స్‌ క్లబ్‌లో గురువారం జరిగింది. ఎన్నికల సమయంలో జర్నలిస్ట్‌లపై జరిగే దాడులపై ఎన్నికల కమిషన్‌, జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సమావేశం కోరింది. సమావేశంలో జిల్లా అధ్యక్షులు సాయిబాబా, ప్రధాన కార్యదర్శి గజపతి ప్రసాద్‌, కోశాధికారి ముత్యాలు, జిల్లా ఎలక్ట్రానిక్‌ మీడియా సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

➡️