పెదఅమిరంలో ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాంపు

ప్రజాశక్తి – కాళ్ల

ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా విద్యార్థులు పల్లెల్లో పర్యటించి గ్రామీణ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుందని భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల డైరెక్టర్‌ ఎం.జగపతిరాజు అన్నారు. పెదఅమిరంలో జాతీయ సేవా శిబిరాన్ని ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు గ్రామస్తులకు పల్లె ప్రగతికి ఏవిధంగా తోడ్పడాలో సూచనలు, సలహాలు అందించాలన్నారు. పల్లెల్లో శానిటేషన్‌, తాగునీరు, పర్యావరణ పరిశుభ్రత వంటి సమస్యలపై ఇంటింటికీ వెళ్లి వారిని చైతన్యం చేయాలని కోరారు. తమ కళాశాల ఉన్నత భారత్‌ అభియాన్‌ ద్వారా కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల తమ కళాశాలకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తోందన్నారు. పెదఅమిరం గ్రామ పంచాయతీ సర్పంచి డొక్కు సోమేశ్వరరావు మాట్లాడుతూ ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల తమ గ్రామాన్ని దత్తత తీసుకొని సాంకేతిక సూచనలు సలహాలు అందించడం తమకెంతో ఉపయోగకరంగా ఉందన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ ఆర్‌.కృష్ణచైతన్య మాట్లాడుతూ తమ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం క్యాంపు ఏర్పాటు చేసుకునేందుకు పెదఅమిరం గ్రామ పంచాయతీ తమకు పూర్తి సహాయ సహకారాలు అందించడం పట్ల ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ క్యాంపులో ప్రధానంగా చెట్లు నాటడం, పర్యావరణం, వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెదఅమిరం గ్రామ పంచాయతీ కార్యదర్శి సునీల్‌రాజు, ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల యుబిఎ కోఆర్డినేటర్‌ జి.మెహర్‌ గణేష్‌, సహాయ ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ కెఎన్‌వి.సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెదఅమిరం సర్పంచి డి.సోమేశ్వరరావును కళాశాల డైరెక్టర్‌ ఎం.జగపతిరాజు ఘనంగా సత్కరించారు.

➡️