పేదల ఆరోగ్యానికి భరోసా ఆరోగ్యశ్రీ

ప్రజాశక్తి – నరసాపురం టౌన్‌

రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న అతిపెద్ద కార్యక్రమం ఆరోగ్య శ్రీ అని ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. చిట్టవరం గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్‌ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ స్మార్ట్‌ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన సభలో మాట్లాడారు. ఆరోగ్యశ్రీలో కుటుంబానికి రూ. 5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ పెంచినట్లు తెలిపారు. ఇప్పుడున్న కార్డుల స్థానంలో నియోజకవర్గంలోని అర్హులందరికీ కొత్త కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. చిట్టవరంలో రూ.336 కోట్ల విలువైన 1,345 కార్డులు అందించామన్నారు. కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్‌ గుబ్బల రాధాకృష్ణ, జెడ్‌పిటిసి బొక్కా రాధాకృష్ణ, సర్పంచి తాడి లక్ష్మణరావు, ఎంపిటిసి నక్కా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. భీమవరం రూరల్‌:పేదల ఆరోగ్యానికి భరోసా ఆరోగ్యశ్రీ అని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. బుధవారం పట్టణంలోని బలుసుమూడి రామాలయం వీధిలో ఆరోగ్యశ్రీ కార్డుదారులతో జిల్లా కలెక్టర్‌ మమేకమై ఆరోగ్యశ్రీ కార్డు ప్రయోజనాలను వారికి వివరించారు. ఇంతకుముందు ఉన్న రూ.5 లక్షల ప్రయోజనాన్ని రూ.25 లక్షలకు ప్రభుత్వం పెంచినట్లు తెలిపారు. ఈ విషయాన్ని కార్డుదారులు గ్రహించాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు పొందిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. దీని ద్వారా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ ఏఏ ప్రాంతాల్లో ఉన్నాయో తదితర సమాచారాన్ని తెలుసుకోవడం సులువవుతుందన్నారు. ఆరోగ్యశ్రీ కార్డుదారులు డిజిటల్‌ కార్డులను స్వీకరించి కార్డు ప్రయోజనాలపై అవగాహన కలిగి వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డి.మహేశ్వరరావు, పురపాలక సంఘం కమిషనర్‌ ఎం.శ్యామల, వైద్యాధికారి ఎస్‌.కృష్ణదుర్గ, ఎఎన్‌ఎంలు, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు.వీరవాసరం :ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ తెలిపారు. బుధవారం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఆరోగ్యశ్రీ కార్డులను ఎంఎల్‌ఎ లబ్ధిదారులకు అందజేశారు. ఈ పథకం పట్ల లబ్ధిదారులు పూర్తిగా అవగాహన పెంచుకుని అత్యవసర సమయంలో సత్వరమే వైద్యం పొందాలన్నారు. కార్యక్రమంలో సర్పంచి చికిలే మంగతాయారు, వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ గొలగాని సత్యనారాయణ, ఎఎంసి ఛైర్మన్‌ కోటిపల్లి బాబు పాల్గొన్నారు.భీమవరం రూరల్‌ : రాష్ట్రంలో ప్రతి కుటుంబమూ ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు. రాయలం పంచాయతీ కార్యాలయం వద్ద ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యం అందించడంపై బుధవారం జరిగిన అవగాహనా సదస్సుల్లో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకూ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షల విలువైన ఉచిత వైద్యం ప్రజలకు అందుతుండగా, ఈ సౌకర్యాన్ని రూ.25 లక్షల వరకూ పెంచుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చర్యలు తీసుకున్నారన్నారు. అనంతరం ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్‌ కోటిపల్లి బాబు, ఎంపిపిల సంఘం జిల్లా అధ్యక్షులు పేరిచర్ల విజయ నరసింహరాజు, జెడ్‌పిటిసి కాండ్రేగుల నరసింహారావు పాల్గొన్నారు. ఉండి:రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచడం హర్షించదగ్గ విషయమని ఎన్‌ఆర్‌పి అగ్రహారం గ్రామ సర్పంచి సురవరపు కనకదుర్గ వెంకటాచార్యులు అన్నారు. బుధవారం ఎన్‌ఆర్‌పి అగ్రహారంలో ఆరోగ్యశ్రీ పరిధి పెంపుపై ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి సురవరపు కనకదుర్గ వెంకటాచార్యులు మాట్లాడుతూ ఖరీదైన వైద్యాన్ని చేయించుకోవడంలో నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆరోగ్యశ్రీని రూ.25 లక్షలకు పెంచడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సురవరపు వెంకటాచార్యులు, నాయకులు గలావిలి ధనుంజయ, ఎన్‌ఆర్‌పి అగ్రహారం గ్రామ హెల్త్‌ క్లినిక్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️