పొన్నపల్లిలో జారిన ఏటిగట్టు

నరసాపురం టౌన్‌:పట్టణంలోని పొన్న పల్లిలో రూ.26 కోట్లతో నిర్మాణంలో ఉన్న ఏటిగట్టు కొంతమేర ఒక్కసారిగా గోదావరిలోకి జారిపోయింది. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఏటిగట్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి కోతకుగురవుతూ వస్తోంది. గుర్తించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. ప్రస్తుతం వరద లేకుండానే గట్టు కోతకు గురి కావడంతో అభివృద్ధి పనుల్లో నాణ్యతపై పొన్నపల్లి వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎల్‌ఎ ప్రసాదరాజు, ఛైర్‌ పర్సన్‌ శ్రీవెంకట రమణ, ఇన్‌ఛార్జి ఆర్‌డిఒ శ్రీనివాసరాజు, తహశీల్దార్‌ ఎస్‌ఎం.ఫాజిల్‌ అక్కడికి చేరుకుని అధికారులను అప్రమత్తం చేశారు. ఏటిగట్టును పటిష్టపర్చాలని ఆదేశించారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎంఎల్‌ఎ బండారు మాధవనాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాయకులు కవురు పెద్దిరాజు, పట్టణ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు, బొమ్మిడి నాయకర్‌, కొవ్వలి రామ్మోహన్‌ నాయుడు, పులపర్తి వెంకటేశ్వరరావు ఏటిగట్టును పరిశీలించారు. నాసిరకం రాళ్లతో పనులు చేపట్టారని, పనుల్లో స్థానిక ఎంఎల్‌ఎ హస్తముందని విమర్శించారు. వెంటనే ఏటిగట్టు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి యుద్ధప్రాతిపదికన పుణనిర్మాణం చేపట్టాలని నిరసన తెలిపారు.

➡️