ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి : కలెక్టర్‌

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌

ముఖ్యమంత్రి బహిరంగ సభకు విచ్చేసే ప్రజలకు ఎటు వంటి ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. సిఎం ఈ నెల 29వ తేదీ శుక్రవారం జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో జెసి ఎస్‌.రామ్‌సుందర్‌ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ సభా వేదిక ప్రాంతంలో, బస్సుల్లో అల్పాహారం, తాగునీటి ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరమైన చోట బయో టాయిలెట్లు సిద్ధం చేయాలన్నారు. సభాస్థలికి చేరే రూటు మ్యాప్‌లు అందరికీ తెలిసేలా ప్రధాన కూడల్లో ప్రదర్శన చేయాలన్నారు. కార్యక్రమం జరిగే ప్రదేశంలో అంబులెన్స్‌ సిద్ధంగా ఉంచాలని, మందులు, వైద్యాధికారులు, సిబ్బందితో పబ్లిక్‌ మీటింగ్‌కు తగ్గట్టుగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ బి.శివనారాయణ రెడ్డి, ఆర్‌డిఒలు కె.శ్రీనివాసులు రాజు, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ కె.సంగీత్‌ మాధుర్‌, అధికారులు పాల్గొన్నారు.

➡️