ప్రభుత్వ పాఠశాల నిర్మించాలని నిరసన

Feb 16,2024 21:16

ప్రజాశక్తి – ఉండి

తమ గ్రామంలో వెంటనే ప్రభుత్వ పాఠశాలను నిర్మించాలని అర్తమూరు గ్రామ సర్పంచి గోనబోయిన వీర్రాజు, ఎంపిటిసి సభ్యులు దంగేటి రామలింగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో వారు శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచి, ఎంపిటిసి మాట్లాడుతూ ఇప్పటివరకు అర్తమూరులో ప్రభుత్వ పాఠశాల లేకపోవడంతో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలోని మిషనరీ స్కూలులో ఎలిమెంటరీ విద్యార్థులకు ఉపాధ్యాయులు తరగతులను నిర్వహించేవారన్నారు. ఇటీవల ఆ పాఠశాలకు విద్యుత్‌ బిల్లు కట్టలేదని అధికారులు కనెక్షన్‌ను తొలగించడంతో విద్యార్థుల అవస్థలు తెలుసుకున్న తాము విద్యుత్‌ అధికారులతో మాట్లాడామని చెప్పారు. ప్రభుత్వ సంస్థలకు విద్యుత్‌ సౌకర్యాన్ని తిరిగి అందిస్తామని, ప్రయివేట్‌ విద్యా సంస్థలకు తక్షణమే బిల్లులు చెల్లించాల్సిందేనని చెప్పడంతో విషయాన్ని ఎంఇఒ దృష్టికి తీసుకెళ్లామన్నారు. స్థలం పంచాయతీ ద్వారా ఇప్పిస్తే తాము పాఠశాల నిర్మించేందుకు సిద్ధమని ఎంఇఒ తెలిపారన్నారు. 20 సెంట్ల భూమిని సేకరించి గ్రామపంచాయతీలో, మండల పరిషత్‌లో తీర్మానించగా ఇప్పుడు విద్యాశాఖాధికారులు కాలయాపన చేస్తూ తమను కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారన్నారు. విసిగిపోయిన తాము పెదకాపవరంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా తమను పట్టించుకోకుండా విషయం మాట్లాడకుండా వెళ్లిపోయారన్నారు. దీంతో తాము విద్యార్థుల తల్లిదండ్రులను సమావేశపరిచి నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్‌ రామకూరు ఏసమ్మ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️