బకాయిలు చెల్లిస్తారా.. గద్దె దింపమంటారా..!

ప్రజాశక్తి – భీమవరం

‘ఒకటో తేదీనే జీతం.. మెరుగైన పిఆర్‌సి.. సకాలంలో డిఎలు ఇవ్వడంతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయులతో స్నేహపూరిత వాతావరణంలో ఉంటానని చెప్పిన జగన్‌ అధికారం చేపట్టిన తర్వాత ఇవన్నీ మరచి ప్రవర్తించడం సిగ్గుచేటని ఉద్యోగ, ఉపాధ్యాయ నేతలు విమర్శించారు. సమస్యలు పరిష్కరించడంతోపాటు బకాయిలు విడుదల చేస్తారా.. గద్దె దింపమంటారా అని అల్టిమేటం జారీ చేశారు. స్థానిక యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయం ఎదురుగా యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో 12 గంటల ధర్నా బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పిఎస్‌.విజయరామరాజు అధ్యక్షత వహించగా రాష్ట్ర కోశాధికారి గోపీమూర్తి మాట్లాడుతూ ఉద్యోగులు దాచుకున్న వేల కోట్ల రూపాయలు దోచుకోవడం దారుణమన్నారు. బకాయిలు విడుదల చేయకపోతే విజయవాడలో ఈ నెల 9, 10 తేదీల్లో 36 గంటల ధర్నాకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఐక్య పోరాటంతోనే సమస్యలు పరిష్కారమవుతాయని, ఆ విధంగా అంతా ముందుకు సాగాలని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎకెవి.రామభద్రం మాట్లాడుతూ సమస్యలు ఐక్య పోరాటాలే శరణ్యమన్నారు. ధర్నాలో యుటిఎఫ్‌ నేతలు దండు పద్మావతి, సరిపల్లి జయప్రభ, ఎం.మార్కండేయులు, కె.శ్రీదేవి, కె.రాజశేఖర్‌, సిహెచ్‌.పట్టాభిరామయ్య, పి.శివప్రసాద్‌, జి.లక్ష్మీనారాయణ, పి.క్రాంతికుమార్‌, డి.ఏసుబాబు, జి.రామకృష్ణంరాజు, కె.శ్రీరామకృష్ణ, ప్రసాద్‌, కెఎసిహెచ్‌.సాయిరాం, ఎం.శ్రీనుబాబు, పి.కృష్ణకుమారి, జివివి.రామానుజరావు, ఎంవి.రాజశేఖర్‌, కెవి.సత్యనారాయణమూర్తి, పులఖండం శ్రీనివాస్‌ పాల్గొన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రారు, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి కె.క్రాంతిబాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు ప్రసాద్‌ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి షేక్‌ వలీ, సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్‌ చైతన్య ప్రసాద్‌, సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఉద్యోగ నాయకులు బావాజీ, సురేష్‌, రోహిణి సంఘీభావం తెలిపి మాట్లాడారు.వంటావార్పుతో వినూత్న నిరసనధర్నా శిబిరం వద్ద వంటావార్పు చేపట్టి వినూత్నరీతిలో నిరసన తెలిపారు. అనంతరం రోడ్డుపైనే సహపంక్తి భోజనాలు చేశారు.పట్టణంలో భారీ ర్యాలీ స్థానిక యుటిఎఫ్‌ కార్యాలయం నుంచి ఉపాధ్యాయులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం చౌక్‌ మీదుగా పోలీస్‌ బొమ్మ సెంటర్‌, మావుళ్లమ్మ గుడి రోడ్డు, ఆంధ్రాబ్యాంక్‌ రోడ్డు, తహశీల్దార్‌ కార్యాలయం రోడ్డు మీదుగా యుటిఎఫ్‌ కార్యాలయానికి చేరుకున్నారు. తొలుత జ్యోతిరావు పూలే చిత్రపటంతోపాటు ఇటీవల మృతి చెందిన ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ, రిటైర్డ్‌ హిందీ ఉపాధ్యాయుడు, యుటిఎఫ్‌ నేత పెన్మెత్స సత్యనారాయణరాజు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అమలు కాని హామీలు నమ్మొద్దు యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు ఇచ్చే అమలు చేయని హామీలు నమ్మొద్దని యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌.ప్రసాద్‌ అన్నారు. యుటిఎఫ్‌ 12 గంటల ధర్నా ముగింపు సందర్భంగా ఆయన విచ్చేసి మాట్లాడారు. ఈ ధర్నాలో ఆర్థిక శాఖాధికారులు బకాయిల లెక్కలు కడుతున్నారన్నారు. అయితే ఐక్య ఉద్యమాలు మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో చంద్రబాబు ఉపాధ్యాయులను మోసం చేశారని, ఆపై అధికారం చేపట్టిన జగన్‌ అమలు చేయని హామీలిచ్చి మరోసారి మోసం చేశారని అన్నారు. రాబోయే రోజుల్లో వైసిపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

➡️