మహోన్నత వ్యక్తి షేక్‌ సాబ్జీ : పిఎస్‌ఎన్‌ రాజు

ప్రజాశక్తి – ఉండి

తోటి ఉద్యోగులను గౌరవిస్తూ వారి ఉన్నతికి పాటుపడే మహోన్నత వ్యక్తి షేక్‌ సాబ్జీ అని, ఆయన మృతి ఉపాధ్యాయ రంగానికి తీరని లోటు అని యుటిఎఫ్‌ మండల మాజీ అధ్యక్షులు పిఎస్‌ఎన్‌ రాజు అన్నారు. బుధవారం పాందువ్వ గ్రామం మండల పరిషత్‌ పాఠశాలలో పిఎస్‌ఎన్‌ రాజు ఆధ్వర్యంలో ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం రాజు మాట్లాడుతూ ఎంఎల్‌సి ఉన్నప్పటికీ ఉపాధ్యాయులను గౌరవిస్తూ వారి అభివృద్ధికి ఎప్పుడూ పాటు పడే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం ఉపాధ్యాయ రంగాన్ని కలచివేసిందని వాపోయారు. యూనియన్లకు అతీతంగా ప్రతి ఉపాధ్యాయుడినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసేవారని కొనియాడారు. అనంతరం సిపిఎం నాయకులు దండు రామలింగరాజు మాట్లాడుతూ సాబ్జీ వర్థంతిని పాందువ్వ పాఠశాలలో ప్రతి సంవత్సరమూ నిర్వహించేందుకు వీలుగా పదివేల రూపాయల నగదు ఫిక్స్డ్‌ డిపాజిట్‌ చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిఎస్‌ఎన్‌ రాజును కొనియాడారు.

➡️