మా కష్టాలు కన’పడవా’..!

ప్రజాశక్తి – ఆచంట

వశిష్ట గోదావరి గీసిన నెలవంక అయోధ్యలంక గ్రామం. ఆ ఊరును గోదావరి నిర్మించింది. వరదలొచ్చినప్పుడు ఊళ్లు, ఏరులు ఏకం చేసే ఉగ్రగోదావరి ఆ ఊరికి మాత్రం ఒక సమగ్ర రూపం ఇచ్చింది. వందల ఏళ్ల క్రితం సహజ సిద్ధంగా ఒక దీవిని నిర్మించింది. దాన్ని నివాసయోగ్యంగా మార్చుకున్నారు స్థానికులు. వరదలకు ఎగువ నుంచి కొట్టుకొచ్చిన ఇసుకతో గోదావరి మధ్యలో పెద్ద పెద్ద మేటలు ఏర్పడతాయి. అవి ఒక్కోసారి కిలోమీటర్ల మేర విస్తరిస్తాయి. ఈ విధంగా గోదావరి మధ్యలో ఏర్పడిన గ్రామమే అయోధ్య లంక. ఆ గ్రామానికి చేరుకోవాలంటే పడవ ఎక్కాల్సిందే. పచ్చని పంట పొలాలు, పశు సంపద, గలగల పారే గోదావరి, ఇసుక తెన్నెలు చూడచక్కని అందాలు అయోధ్యలంక సొంతం. ప్రభుత్వాలు దృష్టి సారిస్తే ఈ గ్రామం ఒక పర్యాటక కేంద్రం అయ్యేది. సహజంగానే బాహ్య ప్రపంచంతో సంబంధాలు అంతగా ఉండని ఈ లంక గ్రామాన్ని అభివృద్ధి పరంగా పట్టించుకోకపోవడంతో అక్కడివారు ఒంటరితనం అనుభవిస్తున్నారు.దినదిన గండం పడవ ప్రయాణం..గోదావరి జిల్లాలో ఎక్కడ పడవ ప్రమాదం జరిగినా ఆచంట నియోజకవర్గంలోని లంకగ్రామాల వాసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. నియోజకవర్గంలో అనేక లంక గ్రామాలున్నాయి. శతాబ్ధాల క్రితం గోదావరి పాయల మధ్య సహజ సిద్ధంగా ఏర్పడిన దీవులను ఇక్కడివారు నివాస ప్రాంతాలుగా మార్చుకున్నారు. ఆచంట మండలం పెదమల్లం పంచాయతీ పరిధిలో ఆనగార్లలంక, కోడేరు పంచాయతీ పరిధిలో పల్లెపాలెం, అయోధ్యలంక పంచాయతీ పరిధిలో అయోధ్యలంకతోపాటు పుచ్చలంక, మర్రిమూల, రాయిలంక, గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో దాదాపుగా ఏడు వేల మంది ప్రజలు జీవిస్తున్నారు. వారు నిత్యం గోదావరిలో పడవలపై ప్రయాణిస్తుంటారు. గోదావరికి వరదలొచ్చినా వారు లంక గ్రామాలను వదిలి బాహ్య ప్రపంచంలోకి రాని పరిస్థితి. ఎందుకంటే లంకగ్రామాలతో వారికున్న అనుబంధం అటువంటిది. ప్రమాదమని తెలిసినా పడవ ప్రయాణమే వారికి ఆధారం. దీంతో బిక్కుబిక్కుమంటూనే వారు నిత్యం పడవలపై ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో వారు ఒక్కోసారి పడవ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.తూర్పుగోదావరితోనే అనుబంధం..మండలంలోని లంక గ్రామాలు భౌగోళికంగా జిల్లాలో ఉన్నా వారికి తూర్పుగోదావరి జిల్లాతోనే అనుబంధం ఎక్కువ. ముఖ్యంగా ఆనగార్లలంక, పుచ్చలంక, పల్లెపాలెం వాసులకు తూర్పుగోదావరికి చేర్చి ఒకవైపు రోడ్డు సౌకర్యాలు ఉన్నాయి. దీంతో వారు తహశీల్దార్‌, గ్రామ పంచాయతీ కార్యాలయంలో పనులకు మాత్రమే పశ్చిమ వైపు వస్తుంటారు. నిత్యావసరాలను తూర్పుగోదావరి జిల్లా నుంచి తెచ్చుకుంటారు. నిత్యం గోదావరిలో రాకపోకలు తప్పనిసరి. దీనికి వారు నాటు పడవలనే వినియోగిస్తున్నారు.అయోధ్యలంక వాసులది అత్యంత ధైన్యం..అయోధ్యలంక గ్రామం పూర్తిగా గోదావరి మధ్యలో ఉంటుంది. ఆ ఊరు వెళ్లి రావాలంటే పడవ ప్రయాణమే దిక్కు. ప్రతి చిన్న పనికీ వారు పడవ ఎక్కాల్సిందే. అయోధ్యలంకలోనే సుమారు నాలుగు వేల మంది జనాభా ఉన్నారు. వీరు పేరుకు పశ్చిమగోదావరిలో ఉన్నా వారికి నిత్యం తూర్పుగోదావరితోనే అనుబంధం ఎక్కువ. విద్య, వైద్యం, వ్యాపారం తదితర అవసరాల కోసం వారు తూర్పుగోదావరి వెళ్లి వస్తుంటారు. ఎందుకంటే వీరికి పశ్చిమ కంటే తూర్పు తీరం దగ్గర. చిన్నపాటి పాయదాటి పుచ్చలంక వెళ్తే అక్కడ నుంచి తూర్పుగోదావరి చేరుకోవడం వారికి క్షణాల్లో పని. లంకలో పండించిన కొబ్బరి, అరటి, మొక్కజొన్న, పచ్చిమిర్చి, తమలపాకు, కూరగాయలు, అపరాలు మార్కెట్‌కు వెళ్లాలంటే పడవ ద్వారానే తూర్పుగోదావరి చేరుకోవాల్సిందే. అంతేకాదు లంక గ్రామాల్లో ఇంటి నిర్మాణం ఒక పెద్ద ప్రహాసనమే. నిర్మాణ సామగ్రి పడవలపైనే చేర్చుకోవాలి. లంక గ్రామంలో ప్రాథమిక విద్య వరకూ అందుబాటులో ఉండటంతో ఉన్నత విద్య కోసం నిత్యం విద్యార్థులు పడవల మీదే తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లి వస్తుంటారు.కలగానే వంతెన నిర్మాణం..అయోధ్యలంక అభివృద్ధి అంతా వంతెనతో ముడిపడి ఉండడంతో అయోధ్యలంక, పుచ్చలంక గ్రామాల మధ్య వంతెన నిర్మించాలని ఎప్పటి నుంచో లంకవాసులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు వశిష్ట గోదావరిపై అయోధ్యలంక – పుచ్చలంక గ్రామాలను కలుపుతూ రూ.50 కోట్లతో వారిధి నిర్మిస్తామని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ హామీ ఇచ్చారు. హడావుడీగా వంతెనకు శంకుస్థాపన కూడా చేశారు. 2019లో సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ఓటమి పాలైంది. వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రిగా చెరుకువాడ శ్రీరంగనాథరాజు బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జిల్లాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అనగార్లంక, అయోధ్యలంక బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి వారధి సమస్యను తీసుకెళ్లడంతో పాటు ఆయా ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు. ఈ నేపథ్యంలో తక్షణ నిర్మాణానికి ప్రతిపాదనలు చేయాలంటూ సానుకూలంగా స్పందించారని శ్రీరంగనాథరాజు తెలిపారు. ఈ నేపథ్యంలో గత ఆగస్టులో వచ్చిన వరదలకు అయోధ్యలంక వెళ్లిన శ్రీరంగనాథరాజును అక్కడి ప్రజలు గోదావరిపై వారధి నిర్మించాలని నిలదీయగా సుమారు రూ.100 కోట్లు ఖర్చవుతుందంటూ మాట దాటవేశారు. వరదలొచ్చిన ప్రతిసారీ ప్రజా ప్రతినిధులు హామీలివ్వడం తప్ప అమలు చేయకపోవడంతో వంతెన నిర్మిస్తారన్న ఆశలు వారిలో సన్నగిల్లుతున్నాయి.వంతెన నిర్మిస్తే బాధలు తీరతాయి..చొప్పల నాగేశ్వరరావు, అయోధ్యలంకలంకగ్రామాల్లో బాధలు పడలేక మా పిల్లలు ఇక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక్కడే పుట్టిన మేం బయటకు రాలేకపోతున్నాం. గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. గ్రామానికి వంతెన పడితే గాని మా బాధలు తీరవు. తక్షణం పాలకులు, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించండి.బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నాం..సరేళ్ల వెంకటేశ్వరరావు, అయోధ్యలంకఅయోధ్యలంకకు వంతెన నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వంతెన ప్రస్తావనే లేదు. వరదల సమయంలో ఎంఎల్‌ఎ శ్రీరంగనాథరాజును నిలదీయగా రూ.వంద కోట్లు ఖర్చవుతుందంటూ మాట దాటేసి వెళ్లిపోయారు. బిక్కుబిక్కుమంటూ పడవలపై వెళ్తున్నాం. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలి.

➡️