మిచౌంగ్‌ కల్లోలం

ప్రజాశక్తి – భీమవరం

వాతావరణ మార్పులు జిల్లా వాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో రెండు రోజుల నుంచి ఈదురుగాలులు బలంగా వీచాయి. ఆదివారం రాత్రి నుంచి ప్రారంభమైన వర్షం సోమవారం రాత్రి వరకూ ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. రోజువారి పనులు చేసుకునే కూలీలు, కార్మికులు, సామాన్య ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు వంటి ప్రధాన పట్టణాల్లో రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. భీమవరంలోని మూడు అండర్‌ టెన్నల్‌లో వర్షపు నీరు భారీగా చేరింది. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తబస్టాండ్‌, పాత బస్టాండ్‌ సెంటర్లు, బొంబాయి స్వీట్‌, ప్రకాశంచౌక్‌, గాంధీచౌక్‌, అంబేద్కర్‌ సెంటర్‌ , హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీ, జువ్వలపాలెం రోడ్లు సైతం నీటమునిగాయి.ముప్పులో లక్షా 40 వేల ఎకరాలుఅకాల వర్షాలతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. మూడు రోజుల నుంచి వ్యవసాయ పనుల్లో రైతులు నిమగమయ్యారు. పంటను రక్షించుకునేందుకు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 2 లక్షల 11 వేల ఎకరాల్లో సాగు చేపట్టిన రైతులు లక్షా 40 వేల ఎకరాల్లో కోతలు కోయాల్సి ఉంది. కుండపోత వర్షానికి పంటంతా నేలమట్టం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు ఇలానే వర్షం పడితే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మాసూళ్లు పూర్తిచేశారు. ధాన్యం కళ్లాల్లోనే ఉంది. ఆకు కూరలు, కూరగాయల రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఆక్వా రైతులు ఉక్కరిబిక్కిరితుపాన్‌ దాటికి ఆక్వా రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వర్షాల వల్ల ఆక్వాచెరువులో ఆక్సిజన్‌ శాతం ఏమాత్రం పడిపోయినా రొయ్యలు దెబ్బతినే ప్రమాదం ఉంది. జిల్లాలో సుమారు లక్షా 20 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. నాసిరకం సీడ్‌ కారణంగా విబ్రియాసిస్‌, నైట్‌ కట్‌, వైట్‌ ఫికల్‌, ఇహెచ్‌పి వంటి వ్యాధులు వెంటాడుతున్నాయి.పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్‌ తుపాన్‌ దృష్ట్యా జిల్లాలోనీ అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, విద్యాసంస్థలకు సోమవారం జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి సెలవు ప్రకటించారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇళ్లకే పరిమితమయ్యారు. మంగళవారం కూడా సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలోని విద్యాసంస్థలన్నీ ఉత్తర్వులను పాటించి పాఠశాలలను మూసి ఉంచాలని తెలిపారు.జిల్లాలోని తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టర్‌ ఛాంబర్లో కలెక్టర్‌ పి.ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలోని నరసాపురం, మొగల్తూరు రెండు మండలాల్లోని 12 గ్రామాలను తుపాన్‌ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించడం జరిగిందని, వీటితోపాటు వర్ష ప్రభావంతో పాలకొల్లు, పాలకోడేరు, భీమవరంలో కూడా కొన్ని లోతట్టు ప్రాంతాలను గుర్తించడం జరిగిందన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 1.40 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. బలమైన ఈదురు గాలులు, వర్షాలు కారణంగా ఎక్కడైనా చెట్లు పడిపోతే ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా వెంటనే తొలగించేందుకు ఆర్‌ అండ్‌ బి, పంచాయతి రాజ్‌, అగ్నిమాపక శాఖల సిబ్బందితో ఒక టీం ఏర్పాటు చేసి మండల తహశీల్ద్దార్‌ కార్యాలయంలో ఉంచినట్లు తెలిపారు.అంధకారంలో గ్రామాలు.. ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో జిల్లాలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల చెట్లు, చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. దీంతో అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. సోమవారం ఉదయం నుంచి విద్యుత్‌ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రజలు అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించారు. తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండడంతోపాటు, విద్యుత్‌ వినియోగదారులు, రైతులు జాగ్రత్తలు పాటించాలని విద్యుత్‌ శాఖ అధికారులు కోరారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తుపాన్‌ సమయంలో ఇంటి గృహోపకరణాల స్విచ్‌లను ఆఫ్‌మోడ్‌లో ఉంచాలని తెలిపారు. ఇంటి పరిసరాల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు పడిపోయినా, విద్యుత్‌ వైర్లు తెగిపడినా వెంటనే విద్యుత్‌ కార్యాలయానికి గాని కంట్రోల్‌ రూమ్‌కు గాని తెలియజేయాలని తెలిపారు. జిల్లా ప్రత్యేకాధికారిగా కన్నబాబు తుపాన్‌ ప్రభావిత జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. దీనిలో భాగంగా జిల్లా ప్రత్యేక అధికారిగా రాష్ట్ర మున్సిపల్‌ కమిషనర్‌ కన్నబాబును ప్రభుత్వం నియమించింది. ఉండి : మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో మండల వ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురిశాయి. ఫలితంగా చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్ష ప్రభావంతో రోడ్లన్నీ నిండిపోయి చెరువులుగా మారాయి. పోడూరు : ఆదివారం రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో పంట పొలాలు నేలకొరిగాయి. తుపాను ప్రభావం ఇంకా రెండు రోజులపాటు ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో రైతులు చెందుతున్నారు. వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. గుంతల్లో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి.కాళ్ల : పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలతో వరి చేలు నేలనంటాయి. మండలంలో 3,878 ఎకరాల్లో సార్వా సాగవుతోంది. ఇప్పటివరకూ 600 ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత సీజన్లో పంట దిగుబడి ఆశాజనకంగా ఉందని, తుపాన్‌ ప్రభావంతో నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, నాయకులు ఆదుకోవాలని రైతులు, కౌలు రైతులు కోరుతున్నారు.ఆక్వా రైతు ఆందోళనతుపాను నేపథ్యంలో ఆక్వా రైతుల్లో ఆందోళన నెలకొంది. రెండు రోజులుగా వర్షాలు పడడంతో చెరువుల్లో నీరు చల్లబడి ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. రొయ్యలు మృత్యువాత పడే ప్రమాదం ఉందని వారు దిగాలు చెందుతున్నారు. మండలంలో సుమారు 26 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. రొయ్యలు పట్టుబడికి వచ్చే సమయానికి తుపాన్లు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయని ఆక్వా రైతులు వాపోతున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడంతో ప్రతికూల వాతావరణం నుంచి బయటపడాలని రేయింబవళ్లు చెరు వుల వద్దే కాపలా ఉంటున్నారు. ఇప్పటికే ఎకరానికి సుమారు రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఆచంట : వాతావరణం రైతులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికందే సమయంలో ప్రకృతి విలయతాండవం చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకూ ఏకధాటిగా వర్షం కురవడంతో రైతులు కలవర పడుతున్నారు. పంటను కాపాడుకోవడానికి రాశులపై బరకాలు, కొబ్బరి ఆకులు, గడ్డి కప్పుతూ కాపాడుకుంటున్నారు. మండలంలో 10,600 ఎకరాల్లో సార్వాసాగు చేపట్టగా ఇప్పటివరకు సుమారు 500 ఎకరాల వరకూ కోతలు పూర్తయినట్లు వ్యవసాయ విస్తరణాధికారి నాగరాజు తెలిపారు. 350 ఎకరాల్లో వరిచేలు నేలకొరిగినట్లు తెలిపారు. పాలకొల్లు : పాలకొల్లులో సోమవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. దీనికితోడు చలిగాలులు వీస్తున్నాయి. పట్టణంలోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వర్షంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.పాలకొల్లు రూరల్‌ : ఆదివారం రాత్రి నుంచే మండలంలో ఎడతెరిపి లేని వర్షాలు ప్రారంభమయ్యాయి. దీంతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రైతులు ఆందోళనలో పడ్డారు. మంగళవారం కూడా వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు.మొగల్తూరు : ఆదివారం రాత్రి నుంచి మండలంలో వర్షం కురుస్తోంది. రోడ్లపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోయి మడుగులను తలపించాయి. పల్లపు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. గ్రామాల్లో పక్కా డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో రహదారి పైన వర్షపు నీరు నిలిచిపోయింది.యలమంచిలి : తుపాను నేపథ్యంలో ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలో వరిచేలు నేలనంటాయి. చేతికొచ్చిన పంట కళ్లదుటే నేలనంటడంతో వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. మండల వ్యాప్తంగా 6 వేల ఎకరాల్లో రైతులు వారి సాగు చేశారు. మరో పది రోజుల్లో మాసూళ్లు అయ్యే పరిస్థితి ఉండగా, తుపాను సృష్టించిన బీభత్సానికి నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంపర్రు, చింతదిబ్బ, కాంబోట్లపాలెం, శిరగారపల్లి, మేడపాడు, నేరేడుమిల్లి గ్రామాల్లో వరి చేలను వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ బొంతు కర్ణారెడ్డి పరిశీలించారు. ఆయన వెంట రైతు నాయకులు జిఎస్‌.బాబు, జడ్డు బదరీ నారాయణ, జై పరంకుశం ఉన్నారు.భీమవరం రూరల్‌ : మిచౌంగ్‌ తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి.ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. భీమవరం మండలం కొవ్వాడ-అన్నవరంలో పంట పొలాలను, వర్షంలో ఒబ్బిడి చేసుకున్న ధాన్యం రాశులను రైతు సంఘం, సిపిఐ ప్రతినిధి బృందం సోమవారం పరిశీలించింది. ఈ సందర్భంగా ప్రసాద్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కలిశెట్టి వెంకట్రావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.సీతారాంప్రసాద్‌, జిల్లా సమితి సభ్యులు సెనపల శ్రీనివాసరావు పాల్గొన్నారు.పెనుగొండ : తుపాను నేపథ్యంలో భారీ వర్షాలు కురవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రయాణికులు, పేపర్‌బారు, పాల వ్యాపారస్తులు రోజువారి పని నిమిత్తం వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

➡️