నీట్‌, నెట్‌ అక్రమాలపై కదంతొక్కిన విద్యార్థిలోకం

Jun 20,2024 23:37 #Dharna, #neet exam, #scam, #SFI
  • దేశవ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు
  • ఢిల్లీలో ధర్మేంద్ర ప్రదాన్‌ కార్యాలయం వద్ద నిరసనాగ్రహం
  • ఎన్‌టిఎ రద్దు, విద్యామంత్రి రాజీనామాకు డిమాండ్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జాతీయ స్థాయి పరీక్షల ప్రశ్నాపత్రాల వరుస లీకేజీలు, అక్రమాలపై విద్యార్థిలోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణని ప్రశ్నిస్తూ దేశవ్యాప్తంగా గురువారం నాడు భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు నగరాల్లో ఆందోళనలు జరిగాయి. ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రదాన్‌ కార్యాలయమైన శాస్త్రీభవన్‌ వద్ద విద్యార్థులు కదంతొక్కారు. నీట్‌-యుజి, యుజిసి నెట్‌ పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహించి ధర్మేద్ర తక్షణమే రాజీనామా చేయాలని, ఎన్‌టిఎను రద్దు చేయాలని విద్యార్థులు నినదించారు. ఢిల్లీలోనూ, బిజెపి పాలిత రాష్ట్రాల్లోనూ విద్యార్థుల ఆందోళనలను అణిచేసేందుకు పోలీసులు బలప్రయోగం ప్రదర్శించారు. ఢిల్లీలో జెఎన్‌యుఎస్‌యుతో పాటు, ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, డిఎస్‌ఎఫ్‌, కెవైఎస్‌, ఎన్‌ఎస్‌యుఐ విద్యార్థి సంఘాలు శాస్త్రి భవన్‌ వద్ద పెద్త ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఢిల్లీ పోలీసులు విద్యార్థులపై దాడికి దిగారు. విద్యార్థినులపైనా మగ పోలీసులు దాడికి పాల్పడ్డారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులను అరెస్టు చేసి ఢిల్లీలోని వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. పోలీసుల దౌర్జన్యాన్ని ఎస్‌ఎఫ్‌ఐ తీవ్రంగా ఖండించింది. యుజిసి నెట్‌ స్కామ్‌, నీట్‌, సెంట్రల్‌ యూనివర్శిటీస్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సియుసెట్‌) నిర్వహణలో పేపర్‌ లీక్‌లు, స్కామ్‌లతో సహా ఎన్‌టిఎ చుట్టూ ఉన్న వివాదాల నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు అర్హత కోల్పోయిన ఎన్‌టిఎని రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూక్‌ బిశ్వాస్‌ డిమాండ్‌ చేశారు. పరీక్షల మాల్‌ ప్రాక్టీస్‌ కు కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పలువురు ధర్మేంద్ర ప్రధాన్‌ నివాసం ఎదుట ఆందోళన చేయగా, వారిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సర్వ కళాశాల ఎదుట నిరసన తెలిపిన ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలపై పోలీసులు దారుణంగా దాడి చేశారు. ఉత్తరప్రదేశ్‌తో పాటు బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, కేరళ, త్రిపుర తదితర రాష్ట్రాల్లోనూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
బిజెపి హయాంలో పరీక్షలను నాశనం చేస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్‌ యాదవ్‌ ఆరోపించారు. ఉక్రెయిన్‌-రష్యా వివాదానికి ముగింపు పలికామని, పరీక్ష పేపర్‌ లీక్‌ను ఆపలేకపోయామని చెబుతున్న మోడీని రాహుల్‌ గాంధీ ఎద్దేవా చేశారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం ఉన్న వారిని తొలగించకుండా విద్యా వ్యవస్థను కాపాడలేమని రాహుల్‌ అన్నారు.

➡️