ఇది ఘోరమైన వైఫల్యం : పినరయి విజయన్‌

Jun 20,2024 23:38 #BJP Govt, #coments, #Pinarayi Vijayan

తిరువనంతపురం : కేంద్ర ప్రభుత్వ ఘోరమైన అసమర్ధత వల్ల కీలకమైన జాతీయస్థాయి పరీక్షల విశ్వసనీయత దెబ్బతిందని, లక్షలాదిమంది విద్యార్ధుల భవితవ్యం ప్రతిష్టంభనలో పడిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. పరీక్షల సమగ్రతకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ) హామీ కల్పించలేకపోవడంతో యుజిసి-నెట్‌ పరీక్షను కేంద్రం రద్దు చేసిందన్నారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్‌ పరీక్షల నిర్వహణ, నిజాయితీ విషయంలో అవినీతి జరిగిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ కొత్త విదాం చెలరేగిందని విజయన్‌ పేర్కొన్నారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌, పిహెచ్‌డి కోర్సులకు అభ్యర్ధులను ఎంపిక చేయడానికి యుజిసి-నెట్‌ పరీక్షను ఏడాదికి రెండుసార్లు ఎన్‌టిఎ నిర్వహిస్తుంది. విద్యార్ధులు, వారి కుటుంబాలు పెద్ద మొత్తంలో డబ్బును, కాలాన్ని పెట్టుబడిగా పెడతారని, కీలకమైన ఈ పరీక్షల కోసం ఎంతో శ్రమ పడతారని ఆయన పేర్కొన్నారు. ఎన్‌టిఎ అసమర్ధత వల్ల లక్షలాదిమంది విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందుల్లో పడుతున్నారని అన్నారు.
‘నీట్‌పై వివాదం ఇంకా సద్దుమణగలేదు, ఈలోగా పరీక్షల సమగ్రత విషయంలో రాజీపడ్డారంటూ యుజిసి-నెట్‌ పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ ప్రకటించింది. ఇలా పదే పదే అసమర్ధత ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు. దీనివల్ల వేలాదిమంది విద్యార్ధులు ఆందోళనలో పడుతున్నారు, ప్రజాధనం వృధా అవుతోంది. ఎన్‌టిఎలో తలెత్తిన ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. పారదర్శకమైన, సక్రమమైన, నమ్మకమైన పరీక్షా ప్రక్రియకు హామీ కల్పించాలి.” అని విజయన్‌ పేర్కొన్నారు.
విద్యా రంగాన్ని కాషాయీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్న బిజెపి ప్రభుత్వం విద్యార్ధుల పట్ల తన ప్రాధమిక బాధ్యతను మరిచిపోయిందని విజయన్‌ విమర్శించారు.

➡️