సాగు చేసేదెంత..రుణం ఇచ్చిందెంత..!

కౌలు రైతులకు పంట రుణాల మంజూరులో తీవ్ర అన్యాయంరెండు జిల్లాల్లో 70 శాతానికిపైగా సాగు కౌలురైతుల చేతుల్లోనేఈ ఆర్థిక సంవత్సరంలోనూ అరకొర రుణాలేరూ.పది వేల కోట్ల రుణ ప్రణాళికలో రూ.450 కోట్లులోపే రుణాలుసాగు చేయని భూయజమానుల జేబుల్లోకే పంట రుణాల సొమ్ముమూడు లక్షల మంది కౌలురైతుల గోడుపట్టని ప్రభుత్వం
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
కౌలురైతులకు ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోంది. సాగు చేసే కౌలురైతులకు కాకుండా భూయజమానులకు బ్యాంకులు పంట రుణాలు మంజూరు చేస్తుండటం గమనార్హం. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనూ రుణాల మంజూరులో ఇదే పరిస్థితి కొనసాగింది. కౌలురైతులు సాగు చేస్తున్న ఆయకట్టుకు, బ్యాంకులు మంజూరు చేసిన పంట రుణాలకు పొంతన లేకుండాపోయింది. వ్యవసాయ రుణ ప్రణాళికలో పంట రుణాల మంజూరుకు కేటాయించిన సొమ్ములో ఐదుశాతం సొమ్ము కూడా కౌలురైతులకు అందకుండాపోయింది. దీంతో కౌలురైతులు సాగు పెట్టుబడులకు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. రాష్ట్రంలోనే అత్యధికంగా కౌలురైతులు ఉన్న జిల్లాల్లో ఏలూరు, పశ్చిమగోదావరి ఉన్నాయి. రెండు జిల్లాల్లో దాదాపు మూడు లక్షల మంది వరకూ కౌలురైతులు ఉన్నారు. రుణార్హత కార్డులు అందుకున్న రైతులు పట్టుమని లక్షా 30 వేల మంది కూడా లేరు. దాదాపు లక్షా 50 వేల మందికిపైగా కౌలురైతులకు రుణార్హత కార్డులే మంజూరు చేయని పరిస్థితి జిల్లాల్లో నెలకొంది. రెండు జిల్లాలో దాదాపు 15 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. వరి, పామాయిల్‌, మొక్కజొన్న, పొగాకు వంటివి ప్రధాన పంటలుగా ఉన్నాయి. రెండు జిల్లాల్లో సాగవుతున్న వ్యవసాయ భూమిలో 70 శాతానికిపైగా సాగు కౌలురైతులే చేస్తున్నారు. వ్యవసాయ సాగులో కీలక భూమిక పోషిస్తున్న కౌలురైతుల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో మొత్తంగా లక్షా 30 వేల మంది కౌలురైతులకు మాత్రమే కౌలుకార్డులు మంజూరు చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. రెండు జిల్లాల్లోనూ కౌలురైతులకు మంజూరు చేసిన రుణం రూ.450 కోట్లులోపే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో పశ్చిమగోదావరి జిల్లాలో రూ.350 కోట్లు వరకూ రుణాలిచ్చినట్లు చెబుతున్నారు. ఏలూరు జిల్లాలో రూ.వందకోట్లులోపే కౌలురైతులకు పంటరుణాలు మంజూరైన పరిస్థితి ఉంది.పంట రుణాల ప్రణాళికకు.. చేతలకు పొంతన కరువు రెండు జిల్లాల్లో వ్యవసాయ రుణ ప్రణాళికల్లో పంట రుణాలకు దాదాపు రూ.పది వేల కోట్లు వరకూ కేటాయించిన పరిస్థితి ఉంది. 2024-25 రుణ ప్రణాళికలోనూ ఏలూరు జిల్లాలో పంట రుణాలకు రూ.6,306 కోట్లు కేటాయిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నిబంధనల ప్రకారం పంట రుణాలు సాగుదారునికి మాత్రమే ఇవ్వాలి. భూయజమానికి పంటేతర రుణం అందించాల్సి ఉంది. ఎక్కడా అటువంటి పరిస్థితి లేకుండా పోయింది. సాగు చేయని భూయజమానికి పంట రుణాలు మంజూరు చేస్తున్నారు. అధికారులు చెబుతున్న పంట రుణాల ప్రణాళికలో ఐదు శాతం సొమ్ము కూడా కౌలురైతులకు ఇవ్వడం లేదు. దీంతో కౌలురైతులు పెట్టుబడి కోసం ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు. ఇ-క్రాప్‌ బుకింగ్‌లో భూయజమానుల పేర్లు చేర్చి వారికే పంట రుణాలు ఇస్తున్నారు. దీంతో పంటలు దెబ్బతింటే పరిహారంగాని, బీమా సొమ్ము సైతం కౌలురైతులకు అందడం లేదు. ప్రభుత్వం ప్రతియేటా అందిస్తున్న రైతుభరోసా సొమ్ము సైతం భూయజమానుల జేబుల్లోకే వెళ్లిపోతున్నాయి. వైసిపి ప్రభుత్వం కౌలురైతుల పట్ల మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మేనిఫెస్టోలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు అంశంపై డిమాండ్‌ వ్యవసాయ సాగులో కీలక పాత్ర పోషిస్తున్న కౌలురైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ బలంగా విన్పిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని చేర్చాలని కౌలురైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో కౌలురైతులకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఇప్పుడు జనసేన టిడిపి పొత్తుతో ఎన్నికలకు వెళ్తోంది. ఈసారి మేనిఫెస్టోలోనూ ఈ అంశం చేర్చుతుందా.. లేదా అనే చర్చ సాగుతోంది. కౌలురైతులకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తేనే తమకు న్యాయం జరుగుతుందని వాస్తవ సాగుదారులు ఘంటాపథంగా చెబుతున్నారు.

➡️