ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు

Mar 9,2024 14:36 #West Godavari District

పార్లమెంటు అభ్యర్థి రూ 95 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థి రు.40 లక్షలు ఖర్చు పరిమితం
జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్

ప్రజాశక్తి-భీమవరం : రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని నియమా వాళ్ళని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ అన్నారు. స్థానిక కలెక్టరేట్లో శనివారం సాధారణ ఎన్నికలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టరు పాల్గొని మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినా వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రవర్తన నియమావళి పరిధిలోకి వస్తారన్నారు. ఏదైనా సందేహాలు ఉన్నా తమ దృష్టికి తీసుకువచ్చి నివృత్తి చేసుకోవాలన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు ఎన్నికల్లో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అన్న అంశాలపై పూర్తి స్పష్టత ఉండాలన్నారు. ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ చాలా ముఖ్యమైనదన్నారు. వీలైనంతవరకు ముందుగానే నామినేషన్ వేసుకునేలా అభ్యర్థులకు తెలియ జేయాలన్నారు.ఈవీఎంలపై కూడా పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఈవీఎంలు, మాక్ పోల్, ప్రొసీజర్స్, పోల్ డే రోజు ఏం చేయాలి అనే దానిపై సందేహాలు లేకుండా పూర్తి స్పష్టతతో ఉండాలని పేర్కొన్నారు. ఎన్నికల కోసం సెంట్రలైజ్డ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని, సోషల్ మీడియా సెల్, మీడియా మానిటరింగ్ సెల్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పోలింగుకు 48 గంటల ముందు చేయాల్సిన పనులపై, అన్ని రకాల అంశాలపై పూర్తిగా అవగాహన అవసరం అన్నారు. ఎలాంటి విమర్శలు గొడవలు రాకుండా చూసుకోవాలని, మద్యం, డబ్బు పంపిణీ జరగకుండా చూడాలన్నారు. పోస్టల్ బ్యాలెట్, సువిధ, సివిజల్ యాప్ ల గురించి, ఐటి అప్లికేషన్స్ పై పూర్తి అవగాహన ఉండాలన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలింగు రోజు ఓటు వేయడంపై ఓటర్లకు అవగాహన కల్పించాలని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా రెవిన్యూ అధికారి బి.శివనారాయణ రెడ్డి, విశ్రాంతి ఆర్డీవో, మాస్టర్ ట్రైనర్ యం.చక్రపాణి, భీమవరం , తాడేపల్లిగూడెం ఆర్డీవోలు కె.శ్రీనివాసులు రాజు, కె.చెన్నయ్య, జిల్లా శిక్షణ నోడల్ అధికారి కె.సి.హెచ్. అప్పారావు, ఆచంట , తణుకు నియోజక వర్గల ఆర్ఓ వి.స్వామి నాయుడు, జెడ్.వెంకటేశ్వర రావు, ఎలక్షన్స్ సుపర్డెంటు సి.హెచ్. దుర్గా ప్రసాదు, ఎలక్షన్స్ డిప్యూటీ తహశీల్దారు యం.సన్యాసి రావు, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు గూడూరి జగదీష్, కామన నాగేశ్వర రావు ( వైస్సార్సిపి), మరపట్ల శ్యాంబాబు, కొట్టి. నరసింహా మూర్తి(పండు) (టిడిపి,) బి. బలరామ్ (సిపియం), అరేటి మృత్యుంజయ రావు( సిపిఐ), వై.దేవేంద్ర ఫణికర్( జనసేన, )గంజి మురాజ్జీ రాజు( రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా) అర్జునరావు( కాంగ్రెసు,) పి.నాగేశ్వరరావు (బిజెపి,) కాటూరి కరుణాకర్, గొట్టుముక్కల శివాజీ (బీఎస్పీ, )పాల్గొన్నారు.

➡️