అత్యంత అప్రమత్తంగా ఉండండి

ప్రజాశక్తి – భీమవరం

సాధారణ ఎన్నికల ప్రక్రియ అత్యంత కీలక దశలో ఉందని, ఈ నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి సుమిత్‌కుమార్‌ అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుండి ఈ నెల 12న జరిగే పోలింగు సామగ్రి పంపిణీ, 13న పోలింగ్‌ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి సుమిత్‌కుమార్‌ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు అత్యంత కీలక దశకు చేరుకున్నాయన్నారు. పోలింగ్‌ సామగ్రి పంపిణీ, పోలింగు సరళి, వెబ్‌ కాస్టింగ్‌పై నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పోలైన ఓట్లు ప్రగతి, సెక్టార్‌వారీగా పొలింగు కేంద్రాల మ్యాపింగు, పోలింగు అధికారుల లాగిన్‌, డ్యాష్‌బోర్డు అంశాలపై సమగ్ర అవగాహన కల్పించామన్నారు. వీటిపై ఎటువంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవాలన్నారు. ఇక్కడ నుంచి చేపట్టే పర్యవేక్షణ, రిపోర్టింగు తీరు కీలకమన్నారు. సమయపాలన విషయంలో కచ్చితత్వం పాటించాలని, ఆదేశాలు పాటించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ జె.ఉదయభాస్కరరావు, ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌ అధికారులు, డిప్యూటీ తహశీల్దారు ఎం.సన్యాసిరావు, డిజిటల్‌ అసిస్టెంట్లు, ఎన్నికల సిబ్బంది, పాల్గొన్నారు.

➡️