చక్కని తర్ఫీదుతోనే ఉత్తమ ఫలితాలు సాధ్యం

మానవత జిల్లా అధ్యక్షులు తాడేపల్లి మోహనరావు

ప్రజాశకి – పెనుమంట్ర

విద్యార్థుల్లోని ప్రతిభని వెలికితీసేలా శిక్షణ ఇచ్చి, చక్కగా తీర్చిదిద్దితే ఉత్తమ ఫలితాలు వస్తాయని జిల్లా మానవత శాఖ అధ్యక్షులు తాడేపల్లి మోహనరావు అన్నారు. ఆదివారం రాత్రి పెనుమంట్ర మానవత శాఖ ఆధ్వర్యంలో మార్టేరులోని వేణు గోపాల ఆడిటోరియంలో జరిగిన ముగింపు ఉత్సవాల సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండలశాఖ అధ్యక్షుడు బాణాల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ ముగింపు ఉత్సవాల్లో మే 1 నుంచి యోగ, కుంగుపు, కరాటే, గీతా శ్లోకాలు, కూచిపూడి నాట్యం, సంగీతం, కోలాటంలలో 190 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెడల్స్‌, పాల్గొన్న ప్రతిఒక్కరికీ సర్టిఫికెట్‌, బహుమతులు అందజేశారు. అనంతరం అధ్యక్షులు మాట్లాడుతూ ఉత్తమ సమాజ నిర్మాణంలో మానవత ఎప్పుడూ ముందుంటుందన్నారు. విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దితే భవిష్యత్‌లో ఉత్తమ సమాజాన్ని నిర్మించవచ్చని ఆయన ప్రసంగంలో తెలియజేశారు. తాడేపల్లి మోహనరావు మాట్లాడుతూ విద్యార్థులను వేసవిలో మొబైల్‌ ఫోన్‌లకు, టీవీలకు దూరంగా ఉంచడానికి, పిల్లల్ని ఉత్తమంగా తీర్చిదిద్దటానికి పెనుమంట్ర శాఖ నిర్వహిస్తున్న ఈ శిక్షణా శిబిరం అభినందనీయమని మండల శాఖ చేస్తున్న సేవలు కొనియాడారు. సభ అనంతరం శిక్షణ పొందిన విద్యార్థులు చేసిన ప్రదర్శనలు విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజల హర్షధ్వానాలతో వేణుగోపాల ఆడిటోరియం మార్మోగిపోయింది. ఈ వేడుకల్లో జిల్లా కార్యదర్శి కొత్త సత్యనారాయణమూర్తి, మండల కార్యదర్శి బండి ప్రసాద్‌, కోశాధికారి శ్రీనివాసరావు మురళీకృష్ణ, వైస్‌ ప్రెసిడెంట్‌ కర్రి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

➡️