బిజెపి పొత్తు, తొత్తు పార్టీలను ఓడించాలి

సిపిఎం భీమవరం జిల్లా కార్యదర్శి బి.బలరాం
ప్రజాశక్తి- తాడేపల్లిగూడెం
రానున్న ఎన్నికల్లో ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని, బిజెపి పొత్తు, తొత్తు పార్టీలను ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతకాయల బాబూరావు, కర్రి నాగేశ్వరరావు అన్నారు. వారి ఆధ్వర్యంలో స్థానిక గాంధీ రెడ్డి కాంప్లెక్స్‌ నుంచి పోలీస్‌స్టేషన్‌కు సోమవారం పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ నరసాపురం ఎంపీ అభ్యర్థి కెబిఆర్‌.నాయుడు, తాడేపల్లిగూడెం ఎంఎల్‌ఎ అభ్యర్థి మార్నీడి శేఖర్‌ (బాబ్జి)లను గెలిపించాలని కోరారు. దేశంలో, రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వాలు పేద, మధ్యతరగతి వారి పొట్టల మీద కొడుతున్నాయని, రాజ్యాంగాన్ని కూడా మార్చేలా ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, జగన్‌, పవన్‌ కళ్యాణ్‌ ఈ ముగ్గురు ప్రత్యక్షంగా,పరోక్షంగా మోడికి వంగి వంగి సలాం చేస్తూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారన్నారు. ప్రజలందరూ ఇండియా వేదికను గెలిపించుకోకపోతే దేశ, రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు. ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం, జిల్లా సెక్రటేరియట్‌ సభ్యలు చింతకాయల బాబూరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, సిపిఎం పెంటపాడు మండల కన్వీనర్‌ చిర్ల పుల్లారెడ్డి, సిపిఐ పట్టణ నాయకులు మండల నాగేశ్వరరావు, సిఐటియు పట్టణ అధ్యక్షులు జవ్వాది శ్రీను, కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ పాల్గొన్నారు.ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలితణుకు : ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం కోరారు. స్థానిక శ్రీసత్యనారాయణ స్పిన్నింగ్‌ మిల్‌ కార్మికులతో సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలను ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. కార్మిక చట్టాలను తొక్కే విధంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తుందన్నారు. ఎన్నికల్లో ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి భీమారావు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక అన్ని రంగాలను విస్మరించిందన్నారు. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని, ఎన్నికల్లో ఈ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం తణుకు, పైడిపర్రు, మండపాక, వేల్పూరు, రేలంగి గ్రామాల్లో రోడ్‌ షో నిర్వహించి ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నరసాపురం ఎంపీ అభ్యర్థి కెబిఆర్‌.నాయుడు, తణుకు ఎంఎల్‌ఎ కడలి రామారావు, సిపిఎం జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌, సిపిఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, సిపిఎం నాయకులు కామన మునిస్వామి, పి.దక్షిణామూర్తి, వెంకటేశ్వరరావు గోవిందరాజు, గుబ్బల గోపీ, త్రిమూర్తులు, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, కార్మికులు పాల్గొన్నారు.

➡️