కూటమితోనే అభివృద్ధి

ప్రజాశక్తి – తణుకురూరల్‌

అభివృద్ధి, సంక్షేమం టిడిపి కూటమితోనే సాధ్యమని టిడిపి తణుకు ఎంఎల్‌ఎ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం తణుకు మండలం కొమరవరం, మహాలక్ష్మీచెరువు, వేల్పూరు గ్రామంలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టిడిపి కూటమికి మద్దతివ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి మాట్లాడుతూ అన్ని వర్గాలకూ, ప్రాంతాలకూ న్యాయం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. బిసిలకు రక్షణ చట్టం తేవడంతో పాటు 50 సంవత్సరాలకే పెన్షన్‌ కల్పిస్తున్నట్లు తెలిపారు. పింఛన్‌ రూ.4 వేలు పెంచడంతో పాటు ప్రతి ఇంటికీ పంపించినట్లు తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు మెగా డిఎస్‌సి నోటిఫికేషన్లు వస్తాయని హామీ ఇచ్చారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ సమర్థవంతంగా అమలు చేస్తామని, మైనార్టీ సోదరులకు సంక్షేమ ఫలాలు అందిస్తామని తెలియజేశారు. రైతులకు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తామని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకూ నెలకు రూ.1500 జమ చేస్తామని, బడి పిల్లల కోసం తల్లి అకౌంట్లో ఏడాదికి రూ.15 వేలు జమ చేస్తామని, సంవత్సరానికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని అన్నారు. యువత, రైతులు, వృద్ధులు, మహిళలు ఆలోచించి విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️