టిడిపి ర్యాలీని అడ్డుకున్న అధికారులు

అనుమతి కోరాం.. ఇక మీ ఇష్టం అంటూ ముందుకు సాగిన ఎంఎల్‌ఎ రామరాజు

ప్రజాశక్తి – ఆకివీడు

టిడిపి ఆధ్వర్యాన చేపట్టిన మోటార్‌ సైకిల్‌ ర్యాలీని ఆకివీడు సరిహద్దుల్లో ఐ.భీమవరం రోడ్డులో ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు. ఐ.భీమవరంలో ఆదివారం సాయంత్రం ఎంఎల్‌ఎ, టిడిపి అభ్యర్థి మంతెన రామరాజుకు గ్రామస్తులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి ర్యాలీ ముందుకు సాగగా ఆకివీడు సరిహద్దులో ఎంపిడిఒ ఆధ్వర్యంలో అధికారులు ర్యాలీని అడ్డుకున్నారు. ఎంఎల్‌ఎ వాహనాన్నీ ఆపారు. ‘మీ ర్యాలీకి అనుమతి లేదు.. ఆపి వేయండి’ అంటూ అధికారులు స్పష్టం చేశారు. ఎంఎల్‌ఎ వాహనం దిగొచ్చి తాము అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నామని, ఇచ్చి ఉంటారని భావించి ర్యాలీ ప్రారంభించామని తెలిపారు. ఇప్పుడు ర్యాలీ ఆపడం సాధ్యం కాదని, అనుమతి వచ్చే వరకూ ఇక్కడే కూర్చుంటామని తెలిపారు. సుమారు 15 నిమిషాల పాటు అధికారులు, ఎంఎల్‌ఎ, నేతల మధ్య చర్చలు సాగాయి. ర్యాలీ కొనసాగిస్తే కేసు తప్పదని ఎంపిడిఒ యద్దనపూడి రామకృష్ణ హెచ్చరించారు. ‘మీ ఇష్టం.. మీరు తేల్చి చెప్పరు.. మమ్మల్ని కదలనివ్వరు. నా వెనుక ఉన్న కార్యకర్తలను ఆపే పరిస్థితి మా వద్ద లేదు. ఇక మీ ఇష్టం’ అంటూ ఆ అధికారిని తప్పించుకుని ఎంఎల్‌ఎ ముందుకు కదిలారు. దీంతో ర్యాలీ ముందుకు సాగింది. అనంతరం మండల కేంద్రం ఆకివీడులో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్‌.టర్నింగ్‌ వద్ద నేతలు ఎంఎల్‌ఎకు గజమాల వేసి సత్కరించారు. ఉండి: ఉండి ఎంఎల్‌ఎ, టిడిపి అభ్యర్థి మంతెన రామరాజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి భారీ మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఆకివీడు మండలం నుంచి ఉండి మండలంలో గ్రామాల మీదుగా మండల కేంద్రం ఉండి చేరుకున్న ర్యాలీకి తెలుగుదేశం శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఎంఎల్‌ఎ మంతెన రామరాజు, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజుకు గజమాల వేసి సత్కరించారు. రాత్రి 9 గంటల వరకే ర్యాలీకి అనుమతి ఉండటంతో రామరాజు కొద్దిసేపు మాట్లాడి పెదఅమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్‌ హాలుకు వెళ్లిపోయారు.

➡️