వృద్ధుల ఇంట్లో రోషన్‌కుమార్‌ భోజనం

ప్రజాశక్తి – కామవరపుకోట

మండలంలోని ఆడమిల్లి గ్రామ పంచాయతీలో కార్యకర్తల ఆనందోత్సాహాల మధ్య టిడిపి చింతలపూడి నియోజకవర్గ ఎంఎల్‌ఎ అభ్యర్థి సొంగా రోషన్‌కుమార్‌ పుట్టినరోజు వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ముందుగా ఆడమిల్లి గ్రామం చేరుకున్న ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలు, తీన్మార్‌ బ్యాండ్‌తో గ్రామంలోకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం 25 కేజీల భారీ కేక్‌కట్‌ చేశారు. అనంతరం తానేటి.సుబ్బారావు, గంగమ్మ వృద్ధ దంపతుల చిన్న పురిపాకలో ఒక సామాన్య వ్యక్తిలా నేలమీద కూర్చుని భోజనం చేశారు. ఈ సందర్భంగా రోషన్‌ కుమార్‌ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల ప్రజలు ఎన్నికల ముందు ప్రచారం చేస్తున్నట్లు కాకుండా ఎన్నికైన తర్వాత జరుపుకునే విజయోత్సవంలా బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఆడమిల్లి గ్రామంలో చూపిన అపూర్వ ఆదరణే దీనికి నిదర్శనమన్నారు. సర్పంచి గూడపాటి కేశవరావు మాట్లాడుతూ రోషన్‌కుమార్‌ పదవి లేకుండా ట్రస్ట్‌ ద్వారా ఎన్నో సేవలందించారని శాసనసభ్యునిగా గెలుపొందాక ఈ నియోజకవర్గాన్ని సర్వతో ముఖాభివృద్ధి చెందేలా తీర్చిదిద్దుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. చింతలపూడి నియోజకవర్గ బిసి సెల్‌ అధ్యక్షులు బాబ్జి మాట్లాడుతూ రోషన్‌ కుమార్‌ ఎటువంటి భేషజాలు లేని వ్యక్తి అన్నారు. అందరిలో ఒకరిగా కలిసిపోతూ మన్ననలు అందుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆడమిల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు యలమర్తి రాంబాబు, తూతా లక్ష్మణరావు, మద్దిపాటి శ్రీను, నల్లమిల్లి భుజంగరావు, తూంపాటి అబ్రహం, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

➡️