హోరాహోరీ పోరులో నెగ్గేదెవరు?

May 17,2024 21:33

ప్రజాశక్తి – మాచర్ల : రాష్ట్రంలోనే అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న మాచర్లలో అందరు ఉహించిన ట్లుగానే దాడులు, ప్రతి దాడులు హింసతో అట్టుడికింది. హింస, దౌర్జన్యాల మధ్య కూడా ఓటర్లు చైతన్యంతో తమ ఓటు హక్కుని వినియోగించుకోవటంతో మాచర్ల నియోజకవర్గంలో అత్యధికంగా 83.75 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ నేపథ్యంలో వివిధ సామాజిక తరగతులు, మహిళలు, యువత, పెద్దలు, కార్మికులు, రైతులు, కూలీలు ఇలా వివిధ తరగతులకు చెందినవారు ఎటువైపు మొగ్గుచూపారో ఇరు పార్టీలకు చెందిన నాయకులు అంచనాలు వేసుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఏ గ్రామాల్లో ఓట్లు వచ్చి ఉంటాయి.. ఏ గ్రామం ఏకపక్షంగా ఏ పార్టీకి ఓట్లు వేసి ఉంటాయి.. అనే లెక్కలు తీసి గెలుపుపై ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు. తమ అభ్యర్థుల గెలుపు కోసం వైసిపి, టిడిపి శ్రేణులు పోలింగ్‌ రోజున తీవ్రంగా కృషి చేశారు. దాడులు, ప్రతి దాడుల్లోనూ భాగమయ్యారు. పోలింగ్‌కు 3 రోజుల ముందు నుండే ధనం, మద్యంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఇరు పార్టీలు పోటి పడ్డాయి. పోలింగ్‌ జరిగిన సరళిని బట్టి ఆయా పార్టీల నాయకుల వ్యూహలను బట్టి గెలుపుపై ఎవరి ధీమా వారికి ఉంది. ఇదే క్రమంలో గెలుపు ఓటములపై ఇరు పార్టీలకు చెందిన కొందరు బెట్టింగులకు పాల్పడుతున్నట్లు తెలిసింది.
వైసిపి అంచనా…వైసిపి తరుపున పోటి చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరసగా నాలుగు సార్లు గెలిచి ఐదోసారి బరిలో నిలిచారు. 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా చేసిన ఆయనకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అనుచరగణంతో పాటు మంచి పట్టుంది. ఆయనతోపాటు అతని సోదరుడు వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వీరి పాలనా సమయమంతా టిడిపికి చెందిన మొదటి, రెండవ, మూడవ శ్రేణి క్యాడర్‌ను తమ వైపుకు తిప్పుకోవటంతో టిడిపికి దారి చూపే నాయకులు లేకుండా చేశారు. దీంతో ఏకపక్షంగా గత మున్సిపల్‌, పంచాయతీ తదితర స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నిచోట్లా తమదైన శైలిలో ఏకగ్రీవం చేసుకోన్నారు. దీంతో ప్రతి గ్రామంలో వైసిపికి చెందిన నాయకుడే అధికారం చెలాయించటంతో ప్రతిపక్ష పార్టీకి బలం లేకుండా పోయింది. గత ఎన్నికలలో టిడిపిలోని అసమ్మతి వర్గం సహాయ, సహకారాలు ఉండటంతో రామకృష్ణారెడ్డికి విజయం సులువుగా దక్కింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తమకు మద్దతుగా ఉన్నందున ఇప్పుడూ గెలుస్తామని వైసిపి అంచనా. వైసిపికి ఏకపక్షంగా ఓట్లు తెచ్చే గ్రామాలైన కళ్లకుంట, కెపిగూడెం, రెంటాల, మిర్యాల గ్రామాల్లో ఈసారి కూడా ఆ ఏకపక్షత కొనసాగిందని భావిస్తున్నారు. ప్రతిపక్షం కంటే ఎక్కువగా డబ్బు పంచటం తమకు అనుకూలించినట్లు ధీమాగా ఉన్నారు. కోద్దో, గోప్ప ఉన్న వ్యతిరేకతను ధన ప్రభావంతో అధిగమించినట్లు భావిస్తున్నారు. టిడిపికి ఏకపక్ష అనుకూలంగా ఓట్లు వచ్చా యని కొన్ని గ్రామాలను టిడిపి శ్రేణులు చెబుతున్నా.. అదేమీ లేదని, మధ్యాహ్నం వరకు తమ ఏజెంట్లు ఉండి సజావుగా పోలింగ్‌ జరగటంతో వైసిపికి మద్దతుగా ఉండే వారు అత్యదిక శాతం ఓటేశారని వైసిపి శ్రేణులు చెబుతు న్నాయి. ఏదేమైనా 3 నుండి 5 వేల మోజారిటీతో తప్పక తాము గెలుస్తామని వైసిపి నాయకులు ధీమాగా ఉన్నారు.
టిడిపి అంచనా…. ఎన్‌డిఎ కూటమి తరుపున టిడిపి అభ్యర్థిగా పోటి చేసిన జూలకంటి బ్రహ్మనందరెడ్డి కార్యకర్తల అండతో టిడిపిని బలోపేతం చేశారు. వైసిపి వైపు వెళ్లిన టిడిపి నాయకులు ఒక్కొక్కరుగా పార్టీలోకి తిరిగి వచ్చారు. ఎన్నికలకు సర్వశక్తులు కూడదీసుకొని పిన్నెల్లి రామకృషా ్ణరెడ్డిని ఢ కొట్టారు. టిడిపి అనుకూల సామాజిక తరగతి ఉండే గ్రామాల్లో మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఏకపక్షంగా ఓటింగ్‌ జరిగింది. వైసిపి అనుకూల గ్రామాల్లో సైతం మధ్యాహ్నం వరకు ఓటింగ్‌ జరిగేలా చూడగలిగారు. వైసిపి శ్రేణుల దాడులను ఎదుర్కొన్నారు. 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న రామకృష్ణారెడ్డిపై ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా మారి, అవి ఓట్ల రూపంలో తమను గెలిపించబోతున్నట్లు టిడిపి అంచనా. వైసిపితో పోల్చుకుంటే డబ్బులు తక్కువగా పంచినా తమకు నష్టమేమీ లేదని భావిస్తు న్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ తమకు అనుకూలంగా మారినట్లు వారంటున్నారు. తాము భారీ మోజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

➡️