ఎవరు గెలుత్తారో.!

May 18,2024 19:26

 ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి :  ఏరా అప్పన్నా…! మొన్న మనం ఓట్లేశాం కదా ఎవరు గెలుస్తారంటావ్‌…! ఏమోరా చిట్టిబాబు యవులు ఎవరికి గుద్దేశారో అర్థం కావడం లేదు..! అవునవును… చాలా మంది నీలాగే సెప్తున్నారు. ఓటర్ల నాడి పట్టలేకపోతున్నారట నాయకులు కూడాను. సరేగానీ, ఇంతకీ మన అభ్యర్థి గెలుస్తాడంటావా? అప్పన్నా….! అదేరా? డబ్బులు పంపకాల్లో తేడాలు వచ్చాయట. రెండు పార్టీల వారూ ఒక్కో దగ్గర ఒక్కోలాగ పంచారట. ఓస్‌… ఊరుకోరా! డబ్బులు తీసుకున్నోళ్లంతా ఓట్లేసేత్తారా యేటీ. అంత అమాయకులెవరున్నారు ఈరోజుల్లో… కాకపోతే మరీ తెలీనోళ్లు అటు ఇటు సర్థుబాబు చేస్తారు తప్ప డబ్బులిచ్చారని అభిమానించే పార్టీకి యతిరేకంగా గుద్దేస్తారనుకుంటున్నావేటి కొంపదీసి. ఔనంటావా? అలాగే ఉంది మరీ… ఆ సూరమ్మకి అటోలు ఇటోలూ ఇద్దరూ బలవంతంగా డబ్బులు ఇచ్చారట. ఈ విషయం అందరికీ తెలిసిపోవడంతో ఇప్పుడు ఆవిడను ఇరు పార్టీ వాళ్లూ నమ్మడం లేదు. డబ్బులు తీసుకుంటే అలాగే ఉంటది మరీ…సరేగానీ రాష్ట్రంలో సెంద్రబాబు వస్తాడా? ఈసారి… మరోసారి జగన్‌కి అవకాశముంటుందంటావా? ఏం సెప్తాంరా బాబు… యవులకి నచ్చినచ్చిట్టు వాళ్లే చెప్తండ్రు. ఇప్పుడు యవలితోనూ మాట్లాడలేకపోతున్నాం. ఆ తవిటయ్య లేడూ… సెంద్రబాబు గెలుస్తాడంటే వాడికి కోపం. మళ్లీ జగన్‌ పెబుత్తమే వత్తాదంటే సాంబగాడు అస్సలు ఊరుకోవడం లేదు. ఎవలి అంచనాలు వారివి. ఇంకా పేపర్లోళ్లూ, టీవీ వాళ్లు సర్వేలు గట్టా చేయడం లేదా? ఏటి? ఎందుకు సెయ్యరూ… ఆలూ కూడా ఆ సంస్థలు అభిమానించే పెబుత్వాలే గెలుస్తాయని చూపిస్తున్నారు? కాలం అంతా మారిపోయింది. ఎవులి డబ్బా వాళ్లే కొట్టుకుంటున్నారు. సరేగానీ జగన్‌ పెబుత్తం ఇచ్చిన పింఛన్లు, అమ్మఒడి, ఆసరా చేయూతతోపాటు ఇతర పథకాలు తీసుకున్నవారు తిరిగి జగన్‌కి వెయ్యరంటావా? ఎందుకెయ్యరూ… ఏస్తారు. కానీ, అదే పథకాలను కొనసాగిస్తూనే కొంచెం డబ్బులు కూడా పెంచుతానని సెంద్రబాబు సెప్పాడు కదా? అన్నట్టు సూపర్‌ సిక్స్‌ అంటూ ఆ పార్టీ నాయకులు బాగానే ప్రసారం చేశారు కదా. ఆ మాటకొస్తే జగన్‌ మాత్రం పెంచుతానని సెప్పలేదా? ఏటి? ఈసారి ముసలోలు. ఆడోళ్లు అందరూ ఫ్యానుకి గుద్దేశారట నిజమే అంటావా? ఔవునవును… ఆలందరూ ప్యానుకి గుద్దేస్తే… ఉద్యోగులు, యువకులు సైకిల్‌కి గుద్ధేశారు. ఇదీ ఈ వారం పబ్లిక్‌ టాక్‌. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఈనెల 13న ముగిసింది. మరుచటి రోజు నుంచి అభ్యర్థులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు గ్రామం, బూత్‌ స్థాయిలో పోలైన ఓట్లు, అందులు తమకు అనుకూలంగా ఉన్నవి. ప్రతికూలంగా ఉంటాయనుకున్నవి లెక్కిస్తున్నారు. ఎవరి దీమాలు వారు వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఓటమి భయం కూడా అందర్నీ వెంటాడుతోంది. మరోవైపు సాధారణ ప్రజల్లో కూడా ఎన్నికల్లో గెలుపోటములపై సర్వత్రా చర్చనడుస్తోంది. వారి మనోగతాలను, స్నేహితులు, బంధువుల అభిప్రాయాలను ఆఫీసులు, దుకాణాలు, బజార్లు, హోటళ్లులో జనం చర్చించుకుంటున్నారు. మచ్చుకి కొన్ని పరిశీలిస్తున్నారు. ఇంతకీ సీపురుబిల్లిలో సత్తిబాబు గెలుస్తాడా? పోతాడా? ఓమోరా జిల్లాలో అయితే ఎక్కువ మంది టిడిపి వస్తాది అంటున్నారు. కానీ, మినిస్టర్‌గారు అతికష్టమ్మీదైనా గెలుస్తారట. ఎంకట్రావు కూడా గట్టిపోటీయే ఇచ్చాడట. చూడాలి మరి. బొత్స అభివృద్ధి మంత్రం. ఎంకట్రావు రాజకీయ తంత్రం ఎలా ఉంటుందో? మరి మిగిలిన చోట్ల వైసిపి పరిస్థితి ఎలా ఉంటుంది. ఈసారి కష్టమేనట మన ఇయ్యానారం జిల్లాలో మినిస్టర్‌తోపాటు మరొకరు గెలిచేసే అవకాశ ఉందట. మిగిలిన అన్నిచోట్లా పోతారని అనుకుంటున్నారు ఎక్కువ మంది జనం.మరి ఇయ్యానారంలో యవులు గెలుస్తారంటావ్‌. సొతంత్రంగా పోటీచేసిన మీసాల గీతకు ఎక్కువ ఓట్లు పడితే స్వామి పంటపండినట్టే. లేదంటే రాజుగారి కూతురిదే విజయం అంటున్నారు పబ్లిక్‌. నెల్లిమర్లలో సంగతేటంటావ్‌… ఎన్నికలకు ముందు టిడిపి ఓట్లన్నీ జనసేనకు పడడం కష్టమని చాలా మంది నోట వినిపించిందిగానీ, టిడిపోళ్లంతా మనస్పూర్తిగానే చేశారట. కాబట్టి ఈసారి జనసేనే అంటున్నారు. ఒక వేళ జనసేన ఓడిపోతే టిడిపోళ్లు దెబ్బయ్యడంతోపాటు కులం కార్డు కూడా వైసిపికి బాగా ఉపయోగపడినట్టు లెక్క. మినిస్టర్‌గారి తమ్ముడు సంగతి ఎలా ఉందో? ఈసారి కష్టమేనట. ఈ మధ్య చాలా గ్రామాల్లో భూములు, ఇతర సమస్యలపై జనం ఆయన్ని బాగానే నిలదీశారు. గ్రామాలకు గ్రామాలే టిడిపిలోకి ఎల్లిపోయాయట. దత్తిరాజేరు మండలంలో భోజరాజపురపోళ్లు తమ గ్రామానికి రోడ్డు వేయలేదని ఏకంగా ఓటింగే బహిష్కరించారు. ఔనా..? ఐతే కష్టమే మరి. కురుపాంలో పుష్పశ్రీవాణి పరిస్థితి ఎలా ఉందంటావ్‌. ఆవిడైతే ఈసారి కష్టమే అంటున్నారు. పతిపక్షంలో వున్నప్పుడు బాగానే పనిచేసిందట. అధికారంలోకి వచ్చాకే జనానికి బాగా దూరమైపోయిందట. అందుకే ఆమెను మరోసారి ప్రతిపక్షంలో పెడతారని అనుకుంటున్నారు జనం. టిడిపికి అవకాశాలు ఉన్నాయట. కానీ, అక్కడ సిపిఎంకి ఆదరణ పెరిగిందని చెప్పుకుంటున్నారు. సాలూరులో దొరగారి పరిస్థితి ఏమిటో….?టిడిపి అభ్యర్థి సంధారాణి ఈసారి గట్టిపోటీయే ఇచ్చారట. ఓట్లు బాగానే వస్తాయంటున్నారు. కానీ, టిడిపోళ్లు అనైక్యత, గ్రూపులే దొరగారికి కొండంత అండ. కాబట్టి టిడిపిలోని ఆ బలహీనతలే తిరిగి దొరగారిని అందలమెక్కిస్తాయని అన్నిచోట్ల ఇనిపిస్తున్నమాట. రాజాం, బొబ్బిలి ఎలా ఉంటాయి? అప్పలనాయుడు నువ్వు సెప్తు..ఏం సెప్తాం కిట్టమూర్తి… బొబ్బిలి ఐతే ఈసారి ఖాయంగా టిడిపి వస్తాదని చాలా మందినోట ఇనిపిస్తాంది.రాజాం కూడా కాస్త అటు ఇటులో టిడిపియే నని నేను అనుకుంటున్నాను. ఎస్‌.కోటలో గ్రూపుల గోల ఎలాంటి తీర్పునిస్తుందో మరీ….అక్కడ రాజకీయాలు ఎప్పుడూ తికమకే. ఇరు పార్టీలకు చెందిన ఓట్లు క్రాస్‌ ఓటింగ్‌ పడిందట. ఎమ్మెల్యే ఓటు ఒక పార్టీకి, ఎంపీ ఓటు మరో పార్టీకి వేసుకున్నారట. అతికష్టంమీద లలితమ్మకి అవకాశాలు ఉన్నాయట. టిడిపిలోని క్రాస్‌ ఓటింగ్‌ వైసిపికి ఎక్కువగా ఉంటే.మరోసారి కడుబండే. మరి పార్వతీపురం సంగతి? ఎలచ్చన్‌ వరకు తిరిగి వైసిపియే వస్తుందన్న చర్చ ముమ్మరంగానే సాగింది కానీ, విజయచంద్ర బాగానే రాజకీయం చేశాడట. పార్టీలో వెన్నుపోటును ముందే నిలువరించడంతోపాటు వైసిపికి ధీటుగానే ప్రచారం, సమీకరణాలు చేసుకున్నాడట. కాబట్టి అక్కడ ఏ పార్టీకి అయినా ఫుల్‌ టైట్‌ అంటున్నారు. పాలకొండ ఎవరికి అండ అంటావ్‌.. అక్కడ ఈసారి టిడిపి ఖాయం అనుకున్నారు. కానీ, జనసేనకు సీటిచ్చారు. సీటు పేరుకు జనసేనదైనా అభ్యర్ధి టిడిపి వాడే. కాబట్టి గెలిసే అవకాశముంది. కాకపోతే ఇక్కడ గ్రూపు రాజకీయాలపైనే జనం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లోలోపల పార్టీ నాయకులు దెబ్బ ఎయ్యకపోతే జనసేనకే అవకాశం. ఓడిపోతే సొంత పార్టీ నుంచి దెబ్బపడినట్టే లెక్క అట.

➡️