ఎండల్లో.. ఎండిన డొక్కలతో..

Apr 7,2024 00:19

పొలాల్లో గుడారాల వద్ద వలస కూలీలు
ప్రజాశక్తి-మాచర్ల :
కరువు ప్రాంతంగా పేరొందిన పల్నాడు ప్రాంతానికి కర్నూలు ప్రాంతం నుండి మిర్చి కోతలకు మాచర్ల మండలానికి కొన్ని కుటుంబాలు వలసొచ్చాయి. వీరంతా పొలాల్లోనే తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకానుండి బతుకుతెరువు కోసం వీరు ప్రతి ఏడాది ఈ ప్రాంతానికి వస్తూంటారు. ఈ ఏడాది కూడా దాదాపు రెండు నెలలు క్రితం 15 కుటుంబాలు ఈ ప్రాంతానికి వచ్చాయి. బోయ సామాజిక తరగతికి చెందిన వీరంతా పిల్లలు సహా కుటుంబాలతో వస్తూంటారు. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండటంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, రోగాల బారిన పడుతున్నామని వలస కూలీలు ఆవేదనకు గురవుతున్నారు. కూలిడబ్బంతా ఆస్పత్రి, మందులకు అయ్యేలా ఉందని భయపడుతున్నారు. దగ్గర్లోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీకి గురవడంతో బోర్లు పనిచేయక నీరు కూడా దూరం నుండి తెచ్చుకోవాల్సి వస్తోంది. కనీసం బల్బు పెట్టుకోవటానికి కూడా వీలుకుదరక చిమ్మచీకట్లో ఉంటున్నామని, పాములు, తేళ్ల మధ్య భయంగా బతుకుతున్నారు. మండిగిరి లకీë, నక్కలదొడ్డి సుబ్రహ్మణ్యం, రామాంజమ్మ, అంజనమ్మలు మాట్లాడుతూ ఈ ఏడాది కోతలుకూడా పూర్తయ్యాయని, గతంలో ఉన్నంత కాపు ఈ ప్రాంతం లేదని, వచ్చిన కొద్ది మొత్తం కూలితోనే మరికొన్ని రోజుల్లో సొంతూళ్లకు వెళ్తామని చెబుతున్నారు.

➡️