ఎపి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరించుకోవాలి

Dec 1,2023 16:17 #AILU, #Kakinada
withdraw ap land titling

ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు)

ప్రజాశక్తి-కాకినాడ : రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన న్యూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణం ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఐలు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మేడపాటి ధర్మారెడ్డి, గుదిమెళ్ళ శ్రీ భాస్కరాచార్యులు, కాకినాడ సిటీ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు పి రాంచంద్ర రాజు, కె నాగ జ్యోతి లు పత్రిక ప్రకటన విడుదల చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదన్నారు. సామాన్యులకు న్యాయం జరిగేందుకు ఆస్కారం ఉండదన్నారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా తీసుకొచ్చిన ఈ చట్టంలో స్థానిక సివిల్ కోట్లకు విచారణ పరిధి (జ్యూరిడిక్షన్) లేకుండా చేశారన్నారు. కేవలం టైటిలింగ్ అధికారులకే అధికారం కట్టబెట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే ల్యాండ్ టైటిలింగ్ అధికారులపై రాజకీయ జోక్యం ఉండే అవకాశం ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెబుతున్నట్లు సులభంగా వేగంగా కేసులు పరిష్కారం చేయాలని భావిస్తే కోర్టులను పెంచి, సిబ్బందిని నియమించాలన్నారు. అంతేకాకుండా అవసరమైన చోట్ల ఫాస్ట్ట్రాక్ట్ కోర్టు లను ఏర్పాటు చేయడం ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారం అవుతాయన్నారు. అంతేగాని సివిల్ కోర్టులు చేయాల్సిన పనిని ల్యాండ్ టైటిలింగ్ అధికారులకు అప్పజెప్పడం ద్వారా పేదలకు మేలు కన్నా నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ అధికారులు ఇచ్చిన తీర్పుపై హైకోర్టుకు మాత్రమే వెళ్లే అవకాశం ఉందన్నారు. సామాన్యులు వ్యయ ప్రయాసలు పడి హైకోర్టుకు వెళ్లి న్యాయం పొందడం కష్టతరంగా మారుతుందన్నారు. డబ్బు లేని కారణంగా హైకోర్టులకు వెళ్లలేక సామాన్యులకు న్యాయం అందని ద్రాక్షగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే టైటిలింగ్ యాక్ట్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బార్ అసోసియేషన్ తో కలిసి పోరాడుతామన్నారు.

➡️