రాష్ట్ర ప్రయోజనాలపై వైసిపి, టిడిపి మౌనం

May 10,2024 23:27

సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, యువతకు ఉద్యోగ నియామకాల గురించి వైసిపి, టిడిపి అధినేతలు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని, కేసులకు భయపడి మౌనంగా ఉండటమే కాకుండా కేంద్రంలోని బిజెపికి మద్దతుగానూ నిలుస్తున్నారని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ విమర్శించారు. పదేళ్లపాటు ఇరు పార్టీల వారూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని, ఈ నేపథ్యంలో ఇండియా వేదిక పార్టీల గెలుపుతో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ మేరకు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కోటప్పకొండ రోడ్డులో సిపిఎం కార్యాలయంలో శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన నిధులు, రాజధాని, పోలవరం, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం, పరిశ్రమల స్థాపన ఇండియా వేదిక విజయంతో సాధ్యమవుతాయని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ తరుపున నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గర్నెపూడి అలెగ్జాండర్‌ సుధాకర్‌, జిల్లాలోని ఇతర అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఓటేసేటప్పుడు భవిష్యత్‌ గురించి ఆలోచించాలని, స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన నాయకులకు ఓటు వేస్తే ప్రజల జీవితాలేమీ మారవని అన్నారు. దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న బిజెపి దేశానికి, రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని, కార్పోరేట్‌లకు లాభాలు చేకూర్చే అనేక విధానాలు అమలు చేసి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారాలు మోపిందని మండిపడ్డారు. గత ఎన్నికల్లో వైసిపి నుండి 22 మంది ఎంపీలు గెలిచినా వాఉ పార్లమెంట్‌లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కరోజైనా మాట్లాడారా? అని నిలదీశారు. ప్రజా సమస్యలపై పార్లమెంటులో మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. వైసిపి, టిడిపి జనసేన, బిజెపి అభ్యర్థులు కేవలం స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. డబ్బు, మద్యంతో ఓట్లు కొనొచ్చనే నమ్మకంతో వారున్నారని, ఈ నేపథ్యంలో ప్రజల నిజమైన తీర్పు ఎలా ఉంటుందో చూపించే సమయం ఆసన్నమైందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా పథకాలు ఉన్నాయని, ఆ పార్టీకి ఓటేయాలని కోరారు. ఇప్పటికే పల్నాడు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఇండియా వేదిక అభ్యర్థులు తరఫున సిపిఎం విస్తృతంగా ప్రచారం చేసిందని చెప్పారు.

➡️