స్టీల్‌ప్లాంట్‌పై వైసిపి వైఖరి బహిర్గతం చేయాలి

ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న అత్తిలి విమల

 ప్రజాశక్తి -గోపాలపట్నం : విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు వైసిపి వైఖరి ఏమిటో ఎన్నికల నేపథ్యంలో బహిర్గతం చేయాలని పశ్చిమ నియోజకవర్గ సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి అత్తిలి విమల డిమాండ్‌చేశారు. కరాస ప్రాంతంలో సోమవారం విమల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేయడానికి కేంద్రంలోని బిజెపి ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి నిలువరించాల్సింది పోయి వారికి వంతపాడుతూ విశాఖ ప్రజలను వంచనకు గురిచేస్తోందని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకు వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమకారులను చట్టసభలకు పంపాలని కోరారు. పారిశ్రామిక ప్రాంతంలో నెలకొన్న సమస్యలపై సిపిఐ నిరంతరం ప్రజల తరుపున నిలబడి పోరాడుతోందన్నారు. గెలిచినా, ఓడినా నిరంతరం ప్రజల్లోనే ఉంటామని ఓటర్లకు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కూడా రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసిందని ఆరోపించారు.గోపాలపట్నంలో… గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో సిపిఐ నాయకులు ఇంటింటికీ వెళ్లి విమలను గెలిపించాలని కోరుతూ ప్రచారం నర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి.చంద్రశేఖర్‌, క్షేత్రపాల్‌, అనకాపల్లి జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, సహాయ కార్యదర్శి రాజన దొరబాబు, నేతలు నాగభూషణం, బేగం, కాసుబాబు, కన్నబాబు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️