జమ్మలమడుగులో నువ్వా నేనా

ప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్‌ జమ్మలమడుగు అసెంబ్లీ బడిలో నువ్వా నేనా అనే రీతిలో పోటీ నెలకొంది. 2024 సార్వత్రిక ఎన్నికల బరిలో వైసీపీ తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మూలే సుధీర్‌రెడ్డి, బిజెపి తరఫున మాజీ మంత్రి హ్యట్రిక్‌ ఎమ్మెల్యేగా పేరున్న చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ తరఫున పాముల బ్రహ్మానందరెడ్డి, వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి అభిమాని దన్నవాడ అల్లే నాగిరెడ్డి భార్య ప్రభావతి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే మూలే సుధీర్‌రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి పేరు, సంక్షేమం, పథకాల అమలు వంటి అంశాలను ప్రజలలోకి తీసుకెళ్తూ ముందుకుపోతున్నారు. బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి 2004 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన అభివద్ధిని, డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం ఉంటే అభివద్ధి జరుగుతుందని ప్రజలకు వివరించడంలో మునిగిపో యారు. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి పాముల బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్‌ తోనే రాష్ట్ర అభివ ద్ధి, ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజి, కడప ఉక్కు పరిశ్రమ వంటి అంశాలతో ప్రజలలోకి వెళుతుంటే స్వతంత్ర అభ్యర్థి అల్లె ప్రభావతి వైసిపి, ఎన్‌డిఎ కూటములను విమర్శిస్తూ ప్రచారం పోటా పోటీగా చేస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం ఆరు మండలాల ఉండగా అందులో కొండాపురం, ముద్దనూరు, ఎర్రగుంట్ల, పెద్దమోడియం, మైలవరం, జమ్మలమడుగు మండలాలతో పాటు ఎర్రగుంట్ల, జమ్మలమడుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. 2024 జనవరి 26 వరకు ఉన్న ఓటర్లు 2,40,835 మంది ఉండగా అందులో మహిళ ఓటర్లు 1,23,751 కాగా, పురుషుల ఓటర్లు 1,17,067 థర్డ్‌ పర్సన్స్‌ 17 కలవు. మహిళల ఓట్లు నియోజకవర్గంలో అధికంగా ఉన్నాయి. రెండు మున్సిపాలిటీలలో నియోజ కవర్గంలోని ఓటర్లలో సగం ఓట్లు 121803 ఉన్నాయి. అటు మహిళ ఓట్లు, ఇటు మున్సిపాలిటీలలో ని ఓట్లే కీలకంగా మారనున్నాయి. కులాల వారిగా చూస్తే 78 వేల ఓట్లు ఎస్సిలవి, 38 వేల ఓట్లు ముస్లింలవి, 57 వేల ఓట్లు బిసిలవి, రెడ్లవి 40 వేలు, 25 వేలు వైశ్యులు, బ్రహ్మణులవి ఉన్నాయి. ఇందులో ఎస్‌సిల ఓట్లు, ముస్లింల ఓట్లు మొత్తం ఓట్లల్లో సగం ఉన్నాయి. వైసిపి, బిజెపి, కాంగ్రెస్‌ పార్టీల మనుగడకు వీరి ఓట్లే ప్రాధాన్యత సంతరించుకుంది. మే 13న జమ్మలమడుగు ఓట్లర్లు ఎవరికీ పట్టం కట్టనున్నారో వేచి చూడాలి మరి.

➡️