గ్రూప్‌-1 పరీక్ష ఏర్పాట్లపై కలెక్టర్‌ సమీక్ష

Mar 15,2024 22:45

మాట్లాడుతున్న గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి
ప్రజాశక్తి-గుంటూరు :
జిల్లాలో గ్రూప్‌-1 పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులందరూ సమన్వయంతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై లైజనింగ్‌ ఆఫీసర్లు, చీఫ్‌ సూపరింటెంట్లతో కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రూప్‌-1 ఉద్యోగుల నియామకం కోసం ఈనెల 17న జరిగే పరీక్షలకు జిల్లాలో 23 పరీక్షా కేంద్రాల్లో 15,040 మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్‌ 2 పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాలను లైజనింగ్‌ అధికారులు, చీఫ్‌ సూపరింటెంట్లు మరోసారి పరిశీలించి మౌలిక సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలని, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌తో వైద్యశిబిరాల ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. జేసీ రాజకుమారి మాట్లాడుతూ అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు పేపర్‌-1 పరీక్షకు ఉదయం 9 గంటల నుంచి 9.30 వరకు గ్రేస్‌ పిరియడ్‌ 15 నిమిషాలు కలిపి 9.45 వరకు, పేపర్‌ 2 పరీక్షకు మధ్యాహ్నం 1 గంట నుంచి 1.30 వరకు గ్రేస్‌ పిరియడ్‌ 15 నిమిషాలు కలిపి 1.45 వరకు మాత్రమే అనుమతించాలని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులు మెబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానికి గ్యాడ్జెట్‌లు తీసుకెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేయాలన్నారు. సమావేశంలో డిఆర్‌ఒ పి.రోజా, ఏపీపీఎస్సీ అసిస్టెంట్‌ సెక్రటరీ (మానిటరింగ్‌) ఎన్‌.ప్రమీళ, సెక్షన్‌ ఆఫీసరు ఎస్‌.ప్రతాప్‌కుమార్‌ పాల్గొన్నారు.

➡️