పాలకుల నిర్లక్ష్యంతో మసకబారుతున్నవిశాఖ

Mar 20,2024 06:05 #Articles, #edite page, #visaka

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖపట్నం….రాష్ట్ర విభజన తరువాత మరింత అభివృద్ధి చెందుతుందని అందరూ భావించారు. కానీ విచిత్రంగా 2014 తర్వాత నుండి అభివృద్ధి వేగం పెరగడం మాట అటు నుంచి క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. 2014 రాష్ట్ర విభజన చట్టంలోని అనేక అంశాలు నేటికీ అమలు కాకపోవడం, విశాఖ ప్రభుత్వ రంగ పరిశ్రమలు క్రమేణా బలహీనపడటం నేటి స్థితికి ప్రధాన కారణాలు.
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విశాఖపట్నంలోని ప్రభుత్వ పరిశ్రమలను బలహీనపరుస్తోంది. అభివృద్ధిలో విశేషమైన పాత్ర పోషిస్తున్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ను అమ్మేయాలని నిర్ణయించింది. మరో పక్క రాష్ట్ర విభజన చట్టంలోని అనేక అంశాలు అమలు చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా నిరాకరించడం, చట్టంలో పేర్కొన్న మెట్రో రైలు ఎగ్గొట్టడం, రైల్వే జోన్‌ ప్రకటనలకే పరిమితం చేసి నేటికీ స్థాపించకపోవడమే కాక రైల్వే డివిజన్‌ ఎత్తివేయడం, నీటి అవసరాలు తీర్చే పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులను పూర్తి చేయకపో వడం, ఐటి రంగం అభివద్ధి కాకపోవడం వంటివన్నీ కలిసి నేడు విశాఖ అభివృద్ధికి ఆటం కంగా నిలుస్తున్నాయి. విశాఖను పారిశ్రామిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఒకరు, పరిపాలనా రాజధాని చేసేస్తామని ఇంకొకరు… ఇలా రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు ఎన్ని ప్రగల్భాలు పలికినా అవేమీ నగరాభివృద్ధికి సహకరించడం లేదు సరిగదా, ఆ పేరుతో పెద్ద ఎత్తున భూకబ్జాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమ వుతున్నాయి. ఈ ప్రాంతంలోని చిన్న, సన్నకారు రైతుల భూములను భూబకాసురులు తన్నుకు పోతున్నారు. ఉపాధి, గృహవసతి పెద్ద సమస్యలుగా ముందుకు వస్తున్నాయి.
రాష్ట్ర అసెంబ్లీకి, పార్లమెంటుకు మరో యాభై రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు అవే పాత హామీలనిస్తున్నాయి. రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి తీరని ద్రోహం చేసిన బిజెపితో తెలుగుదేశం, జనసేన పార్టీలు జతకట్టాయి. రాష్ట్ర అధికార వైసిపి…. అన్ని సందర్భాలలోనూ మోడీ ప్రభుత్వానికి అండగా ఉంటోంది. స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మేయాలనే మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించి, దాన్ని కాపాడుకోవాలనే కనీస చిత్తశుద్ధిని కూడా ఈ మూడు పార్టీలు ప్రదర్శించడం లేదు. వారిలో వారు కలహించుకుంటూ, అసలు దోషి బిజెపిని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు.
ఈ నేపథ్యంలో ఈ ప్రాంత అభివృద్ధికి ఏం చేస్తే మేలు జరుగుతుందనే అంశంపై ఇటీవల సిపిఎం ”వైజాగ్‌ మేనిఫెస్టో” విడుదల చేసింది. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజలను భ్రమల్లో ఉంచి ఓట్లు దండుకోవడం కాకుండా, నిజంగా విశాఖపట్నం అభివద్ధి చెందాలంటే ఐదు ప్రధాన అంశాలు కచ్చితంగా అమలు జరపాలని సిపిఎం వైజాగ్‌ మేనిఫెస్టోలో పేర్కొంది. మొదటిది- రాష్ట్ర విభజన చట్టం సంపూర్ణంగా అమలు జరగడం. రెండోది- విశాఖ ప్రభుత్వ రంగ పరిశ్రమలను బలోపేతం చేయడం. స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం, సొంత గనులు కేటాయించడం, పటిష్ట పరచడం. మూడోది- ప్రభుత్వ విద్య, వైద్యం బలోపేతం చేయడం. నాలుగోది- పర్యావరణాన్ని పరిరక్షించడం. ఐదోది- మౌలిక వసతులు కల్పించడం.
ఆంధ్ర రాష్ట్రానికి తలమానికంగా నిలిచి ఉన్నత విద్యా రంగంలో విశేషమైన కృషి చేసిన ఆంధ్ర యూనివర్సిటీ నేడు పూర్తిగా కళావిహీనమైపోయింది. స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వేదికగా మారిపోయింది. టీచింగ్‌ సిబ్బంది లేకపోవడంతో విద్య ప్రమాణాలు క్షీణిస్తున్నాయి.
విశాఖ, ఉత్తరాంధ్రకే కాక ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్‌ వంటి రాష్ట్రాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న విశాఖలోని కింగ్‌ జార్జ్‌ ఆసుపత్రి (కెజిహెచ్‌) నేడు మౌలికవసతుల్లేక, డాక్టర్లు, సిబ్బంది కొరతతో విలవిలలాడుతోంది. ప్రభుత్వం, వైద్యం మీద పెడుతున్న ఖర్చు క్రమేణా తగ్గడంతో ఈ ఆసుపత్రి కళావిహీనంగా మారుతోంది.
వైశాల్యంలో దేశంలోనే కీలక నగరంగా ఉన్న విశాఖపట్నం నేడు తీవ్రమైన పర్యావరణ సమస్యలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఉన్న కాలుష్యానికి తోడు, ప్రైవేట్‌ రంగంలోని గంగవరం పోర్టు నుండి వెలువడుతున్న కాలుష్యం గాజువాక, మల్కాపురం తదితర ప్రాంతాలను పూర్తిగా కమ్మేస్తోంది. ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. దీనిని నివారించకపోతే ప్రజలు నివసించడానికి వీలులేని స్థితి ఏర్పడుతుంది. అనేక గ్రామాలను, అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలను విశాఖపట్నంలో విలీనం చేసి గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జివిఎంసి)ను ఏర్పాటు చేశారు. అయితే దానికి తగ్గట్లుగా మౌలికవసతుల కల్పన మెరుగుపడలేదు. విలీన ప్రాంతాల్లో రోడ్లు, మంచినీటి సదుపాయాలు, వీధిలైట్లు, డ్రైనేజీ వ్యవస్థ నేటికీ అద్వానంగా ఉన్నాయి. మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన కళ్యాణ మండపాలను సామాన్యులకు అందుబాటులో లేకుండా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేశారు. క్రీడా మైదానాలు, ఇండోర్‌ స్టేడియం, అక్వేరియం వంటివి పూర్తిగా లీజుకు ఇచ్చేశారు. పెద్దఎత్తున ఛార్జీలు వసూలు చేయడంతో ఇవి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి.
ఉపాధికై పొట్ట చేత పట్టుకుని విశాఖకు వలసలు వస్తున్న అనేకమంది పేద ప్రజలకు గృహ వసతి పెద్ద సమస్యగా మారింది. అనేక మందికి నిలువ నీడలేని పరిస్థితి ఏర్పడింది గృహ వసతి కల్పించవలసింది పోయి మురికివాడల నిర్మూలన పేరుతో ఇక్కడ నివసిస్తున్న పేదలను ప్రభుత్వం సుదూర ప్రాంతాలకు తరలించడంతో వీరికి గృహ వసతి మాట అటుంచి, ఉపాధే పెద్ద సమస్యగా మారింది. ఏ ఉపాధి గురించి అయితే వీరు విశాఖపట్నం వచ్చారో ఆ ఉపాధికే దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రజలందరికీ గృహవసతి కల్పించడం అనే లక్ష్యంతో ఏర్పడిన విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ (విఎంఅర్‌డిఎ) ఆ లక్ష్యానికి పూర్తిగా భిన్నంగా నేడు ఒక పెద్ద రియల్‌ ఎస్టేట్‌ సంస్థగా మారిపోయింది. దీనికి తోడు పంచ గ్రామాల భూ సమస్య, గాజువాక ఇనాం భూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుండా ఉండడంతో వేలాదిమంది గృహ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నేడు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ సంస్థలు బలహీన పడుతున్నాయి. తక్కువ వేతనాలు,
ఉద్యోగ భద్రత లేని కాంట్రాక్టు వ్యవస్థ సర్వ వ్యాపితమయింది. సముద్ర తీర మత్స్యకారులు కాలుష్యం, కార్పొరేటీకరణ వల్ల ఉపాధి కోల్పోతున్నారు. స్థిరమైన ఆదాయం, ఎటువంటి హక్కులూ లేని అసంఘటిత రంగం భారీగా పెరుగుతోంది. ఒకప్పుడు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో మెరుగైన ఉపాధికై విశాఖపట్నం గ్రామీణ ప్రజానీకాన్ని ఆకర్షించింది. నేడు దానికి భిన్నంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం గిట్టుబాటు కాక అక్కడ నుంచి నెట్టివేయబడ్డ ప్రజానీకం చిన్న చిన్న ఉపాధి పనుల కోసం విశాఖ నగరానికి వలసలు వస్తున్నారు.
అందరికీ మెరుగైన ఉపాధి కల్పన ద్వారానే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడమే అసలైన అభివృద్ధి. ఇటువంటి అభివృద్ధి సాధించాలంటే సిపిఎం మేనిఫెస్టోలో పేర్కొన్న ఐదు ప్రధాన అంశాలు కచ్చితంగా అమలు జరగాలి. ఈ అంశాలు రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలలో పేర్కొనడం, వాటిని అమలు చేసేలా ప్రజలు వత్తిడి తేవడం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుంది.

-రచయిత సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి  ఎం.జగ్గునాయుడు

➡️