ఆకలి బాల్యం

Jun 10,2024 23:26 #Articles, #childhood, #edit page, #hungry

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నలుగురు బాలల్లో ఒకరు తీవ్రమైన ఆహార కొరతతో బాధపడుతున్నారని ‘యునిసెఫ్‌’ నివేదిక పేర్కొంది. కనీసం కడుపు నిండా తిండి లేక అనేక పేద, మధ్య ఆదాయ దేశాల్లో బాలలు తీవ్రమైన అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 44 కోట్ల మంది బాలలు సుమారు 100 అత్యల్ప ఆదాయ దేశాల్లో క్షుద్బాధతో కునారిల్లుతున్నట్లు యునిసెఫ్‌ తాజాగా తెలిపింది. బాలలు సంపూర్ణ ఆరోగ్యంగా ఎదగడానికి పాలు, ఆహార పదార్థాలు, విటమిన్లు, మినరల్స్‌, ప్రోటీన్లు వంటివి అవసరం. వీటిలో కేవలం రైస్‌, కొంత మేరకు పాలు మాత్రమే సగం బాలలకు అందుతున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో సంపూర్ణ పోషకాహార లోపంతో భవిష్యత్తులో యువత చదువులోనూ, ఆరోగ్యంలోనూ తీవ్రమైన ఇబ్బంది పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం వలన తరచూ వ్యాధులు, రోగాల బారినపడే అవకాశం ఉంది.
ఆహార కొరతతో బాధపడుతున్న ఈ 44 కోట్ల మందిలో సుమారు 18 కోట్ల మంది తీవ్రమైన ఆహార కొరతతో బాధపడుతున్నారు. వీరిలో అత్యధికులు సోమాలియా లోనే ఉన్నారు. తరువాత స్థానంలో గినియా, ఆఫ్ఘనిస్తాన్‌ వంటి దేశాల్లో ఉన్నారు. మన దేశంలో కూడా అనేకమంది బాలలు తినడానికి తిండి లేక అలమటిస్తూ మన కళ్ళ ముందే కనపడుతున్నారు. భిక్షాటన చేస్తున్నారు. అయితే, రకరకాల వేడుకల్లో, విజయోత్సవ సంబరాల్లో విగ్రహలకు, చిత్రపటాలకు అభిమానంతో ”పాలాభిషేకం, క్షీరాభిషేకం” చేస్తూ ఉంటారు. పిల్లలు తాగే పాలు ఇలా వృధా చేయడం భావ్యమా…!? ఇకనైనా అందరూ ఆలోచన చేయాలి. ఇటువంటి పాలు బాలలకు అందించడం మంచిది.
సరైన పోషకాహారం లేకపోవడం వలన… రేపటి యువతగా మారాల్సిన నేటి తరం బాలలు తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతూ, శారీరక మానసిక ఆరోగ్యం లేక ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సమస్యగా మారుతున్నది. కావున ప్రతీ దేశం తమ తమ దేశంలో బాలల సంరక్షణకు ప్రత్యేక దృష్టి సారించాలి. అభివృద్ధి చెందిన దేశాలు బాలల సంక్షేమానికి యునిసెఫ్‌ వంటి సంస్థలకు ఆర్థిక సహకారం అందించాలి. వారి ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషించాలి. ఉద్రిక్తతలు, యుద్ధాల సమయంలో బాలల సంరక్షణకు, పోషణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పాలస్తీనాలో ఇజ్రాయిల్‌ చేస్తున్న దమనకాండలో అభం శుభం ఎరుగని బాలలు ఆకలితో అల్లాడుతున్నారు. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు లేకుండా ఐక్యరాజ్యసమితి ప్రధాన పాత్ర పోషించాలి.

– ఐ.పి.రావు

➡️