Delhi : నీట మునిగిన ఢిల్లీ

Jun 28,2024 23:25 #MP, #Samajwadi Party

88 ఏళ్ల తరువాత రికార్డు వర్షపాతం
విమానాశ్రయ టెర్మినల్‌ 1 పైకప్పు కూలి ఒకరి మృతి
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. గురువారం నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన వానలతో నగరం జలయమయమైంది. అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా, ట్రాఫిక్‌ జామ్‌, విద్యుత్‌- మంచినీటి సరఫరా నిలిచిపోవడం వంటి సమస్యలతో జనజీవనం అస్థవ్యస్థమైంది. 88 ఏళ్ల తర్వాత రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 8.30 నుండి శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు 24 గంటల వ్యవధిలోనే ఢిల్లీలో 228 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ (ఐఎండి) అధికారులు తెలిపారు. 1936 జూన్‌లో 24 గంటల వ్యవధిలో 235.5 మిల్లీమీటర్ల వర్షపాతం తరువాత ఇదే అత్యధికమని చెప్పారు. దేశరాజధానికి రుతుపవనాలు చేరుకున్నాయని అధికారులు తెలిపారు. గురువారం నుంచి కురుస్తున్న వర్షాలతో ఢిల్లీ వాతావరణం చల్లబడింది. గత రెండు నెలల నుంచి ఢిల్లీలో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం మాత్రం కనిష్ట ఉష్ణోగ్రత 24.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
భారీ వర్షాలతో ఢిల్లీ రోడ్లన్నీ జలమయమయ్యాయి. సాధారణ ప్రజలే కాదు.. ఎంపీలు సైతం ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై నీరు నిలిచి ఉండడంతో ఎస్‌పి ఎంపి రామ్‌గోపాల్‌ యాదవ్‌ పార్లమెంటుకు వెళ్లేందుకు ఇబ్బందిపడ్డారు. ఆయనను సిబ్బంది చేతుల్లో మోసి కారులో కూర్చోబెట్టారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనిపై ఎంపి రామ్‌గోపాల్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రోడ్డుపై నిలిచిన వర్షం నీటిని మోటార్‌ ద్వారా తొలగించి ఉంటే బాగుండేదని, ఢిల్లీ అధికారులతో మాట్లాడినా ప్రయోజనం లేకపోయిందన్నారు. తనతోపాటు హోమ్‌శాఖ సహాయ మంత్రి, ఆర్మీ జనరల్స్‌, నేవీ అడ్మిరల్స్‌ బంగ్ల్లాలు కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయని చెప్పారు. ట్రాఫిక్‌ జామ్‌లతో పాటు చాలా కాలనీల్లో విద్యుత్‌, మంచినీటి సరఫరా నిలిచిపోయింది. మింటో రోడ్డులో ఒక ట్రక్కు పూర్తిగా నీట మునిగింది. విద్యుత్‌ షాక్‌తో రోహిణి ప్రాంతంలో 39 ఏళ్ల వ్యక్తి మరణించాడు.
విమానాశ్రయం టెర్మినల్‌ 1 పైకప్పు కూలి ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు
భారీ వర్షాల కారణంగా ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్‌ా1 పై కప్పు కూలిపోయింది. శుక్రవారం ఉదయం 5:00 గంటల సమయంలో డిపార్చర్‌ గేట్‌ 1, గేట్‌ 2 వద్ద టెర్మినల్‌ 1 పై కప్పు కూలిపోవడంతో ఈ ప్రమాదంలో ఒక క్యాబ్‌ డ్రైవర్‌ మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని మేదాంత ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వీరి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో నాలుగు వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంతో టెర్మినల్‌ 1ను పూర్తిగా ఖాళీ చేసి మూసివేశారు. ప్రమాద ప్రాంతాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు పరిశీలించి, పరిస్థితిని సమీక్షించారు. మృతుని కుటుంబానికి రూ.20 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. టెర్మినల్‌ 1 డిపార్చర్‌ హాల్‌ను విస్తరణ పనుల తరువాత ఈ ఏడాది మార్చిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.
విమాన సర్వీసులు రద్దు
టెర్మినల్‌ 1 పై కప్పు కూలడం, భారీ వర్షాల కారణంగా అనేక విమాన సర్వీసులను శుక్ర, శనివారాల్లో రద్దు చేశారు. కొన్ని సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. తమ విమాన సర్వీసులను నిర్థారణ చేసుకున్న తరువాతే వినియోగదారులు విమానాశ్రయానికి రావాలని ఇండిగో తదితర సంస్థలు ప్రయాణికులకు విజ్ఞప్తి చేశాయి. ఢిలీల్లో మరో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆదివారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఢిల్లీ ప్రభుత్వ అత్యవసర సమావేశం
ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం మధ్యాహ్నం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి అతిషి మాట్లాడుతూ రుతుపవన కాలంలో కురవాల్సిన మొత్తం వర్షంలో 25 శాతం వర్షం 24 గంటల్లోనే కురిసిందని చెప్పారు. ఈ కారణంగా అనేక ప్రాంతాల్లో డ్రెయిన్‌ ఓవర్‌ఫ్లో అవడం, నీరు బయటకు వెళ్లడానికి సమయం పట్టిందని చెప్పారు. ఈ సమావేశానికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వికె సక్సేనా అధ్యక్షత వహించారు. నీటి ముంపును పరిష్కరించడానికి ఎమర్జన్సీ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేయాలని, నీటిని తోడివేయడానికి స్టాటిక్‌ పంపులను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.

➡️