నరేంద్ర మోడీకి పరమాత్ముడు రాసిన లేఖ

Jun 14,2024 05:45 #Articles, #edit page

తనకు తన తల్లితో బయలాజికల్‌గా సంబంధం లేదని, లాజిక్‌ లేకుండా తనను ఆ పరమాత్ముడే నేరుగా ఈ భూమి మీదికి పంపాడనీ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించుకున్న నేపథ్యంలో-ప్రముఖ జర్నలిస్ట్‌ రవీష్‌ కుమార్‌ ప్రజెంటేషన్‌కు అనుసరణగా…తెలుగు పాఠకుల కోసం ‘నరేంద్ర మోడీకి ఆయన చెప్పిన పరమాత్ముడు రాసిన లేఖ’ను పొందుపరుస్తున్నాను.
ఇంగ్లీషులో ప్రారంభమైన ఉత్తరంలోని ప్రారంభ వాక్యాల సారాంశం ఇలా ఉంటుంది.
ప్రియమైన నరేంద్ర,
నిన్ను ఎవరు భూమి మీదికి నేరుగా పంపించాడని చెప్పుకుని తిరుగుతున్నావో…ఆ నేను-పరమాత్మను!!
అసలు నీ ఐడియానే నాకు నచ్చలేదు-నేను ఎవరికీ అధికారిక పత్రం ఇవ్వను. వాళ్ళు మూల మూలలకూ వెళ్ళి నేను పంపించానని చెప్పుకుని తిరగడానికి ఈ పరమాత్ముడు అలా ఎవ్వరినీ పంపించడు. పరమాత్ముడి స్థాయి వేరే ఉంటుంది నరేంద్రా? నువ్వు అర్థం చేసుకోలేవు. అయన మృత్యులోకానికి సుదూరంలో ఉంటాడు. ఆయన చదివేవి కేవలం శ్లోకాలు. నీ లాగా జనానికి శోకాన్ని పంచడు. మోసాలు చేయడు.
ప్యారే నరేంద్ర! ఆగే కి బాత్‌ హిందీమె కహనా చాహతా హూ-
హిందీలో ఎందుకంటే. నీకు చదువు లేదని, ఇంగ్లీషు రాదని నాకు తెలుసు కదా? నేను నిన్ను నేరుగా భూమి మీదికి పంపలేదు. అన్ని జీవుల్లాగే నువ్వూ పుట్టావు. కానీ మనిషిగా పుట్టిన విషయం మరిచిపొయ్యావు. నువ్వు నా పేరుని వాడుకుని నాకు ద్రోహం చేశావు. నన్ను అప్రతిష్ట పాలు చేశావు.
జంబూ ద్వీపానికి ఒక నియమం ఉంది. ఇక్కడికి వచ్చిన వారు వెళ్ళిపోక తప్పదు. కుర్చీలు కూడా మారుతూ ఉంటాయి. కుర్చీలో కూర్చునే నియమాలూ, పద్ధతులు కూడా మారుతూ ఉంటాయి. కుర్చీలో కుర్చునే నియమాలూ, పద్ధతులు కూడా మారుతూ ఉంటాయి. వేరు వేరు భూభాగాల్లోని మానవులు వారి వారి శక్తులను సంకలన పరుచుకుని, రాజ్యాంగమనేది రూపొందించుకున్నారు. దాన్ని మించిన శక్తి వారికి మరొకటి లేదు. ఒకవేళ భగవంతుడే అంటే నేనే-భూమికి దిగి వచ్చినా అక్కడి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూ రాజ్యాంగబద్ధంగా పని చేయాల్సిందే! ఎందుకంటే, అక్కడ రాజ్యాంగమే ప్రధాన అంగం. అదే విధి, విధానం! ప్రజాస్వామ్య దేశాలలో దేవుడూ విధి వంటివి ముఖ్యం కాదు. రాజ్యాంగమే ముఖ్యం. విధి విధానాలన్నీ రాజ్యాంగబద్ధంగా నడవాల్సిందే. వారి పరమాత్మ ఎవరన్నది ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు ఎలుగెత్తి చెప్పారు. రాజ్యాంగమే వారి పరమాత్మ, దాని ఆత్మే వారి నాగరికత!
నాకు కన్యాకుమారి చాలా ఇష్టం! కానీ, నువ్వు కాశీలో ఉండాల్సిన సమయంలో కాశీలో లేవు. భారత దేశం లోని అసంఖ్యాక ప్రజలు వారి వారి ఇల్లూ ముంగిలి, సంసారాలు వదిలేసి కాశీకి వచ్చారు. కానీ, నువ్వేం చేశావ్‌? కాశీలో లేకుండా కన్యాకుమారికి వెళ్ళిపోయావు. కాశీ ప్రజలు నీకు ఎందుకు తక్కువ ఓట్లిచ్చారో ఆలోచించావా? ఈ పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక వేషధారణలో తిరగొచ్చు. కానీ, ఆ కాశీ విశ్వేశ్వరుడి ఆదేశం ఎప్పుడైనా పాటించావా? విశ్వాస పాత్రులైన వారు మరి, ఆదేశాలు తప్పక పాటించాలి కదా? అది అందరి కర్తవ్యం. ఇతర పార్టీలను చీల్చగూడదు. వారి ఇళ్ళు కూల్చగూడదు. ప్రతిపక్ష నాయకులను జైల్లో వేయగూడదు. భిన్నమైన ఆలోచనా ధోరణిగల వారిని చంపించగూడదు-అని కదా ఆ దేవుడి ఆదేశం? పాటించావా మరీ? ఆ- ఒకవేళ నిన్ను పాలించమని ప్రజలు నీకు అత్యధికంగా సీట్లిస్తే వెళ్ళు. హాయిగా పరిపాలన చెరు. ప్రజా సంక్షేమం చూడు-అంతే!!
ఆ స్వామి, ఆ విశ్వేశ్వరుడు మూడు లోకాలు పాలించడం లేదా? ఒక లోకానికి మరో లోకానికీ మధ్య ద్వేషం పెంచుతున్నాడా? కుల మతాలను, లింగ భేదాలకూ అతీతంగా ఆ భగవంతుడు అందరినీ సమంగా ప్రేమించడం నువ్వు చూడలేదా? ఏం నీకు కళ్ళు మూసుకు పొయ్యాయా? ఎవరి పట్లా కక్ష చూపడు కదా? ఎవైనా పొరపాట్లు జరిగితే అవి మానవ మాత్రుల అహంకారం వల్ల జరిగేవే, దేవుడి వల్ల కాదు- దేవుడన్న వాడికి మాయా వ్యామోహాలు ఉండవు. దేవుడి పుత్రుణ్ణని చెప్పుకునే నువ్వు ఆ మాయా మోహాలు దాటుకుని ఎందుకు రాలేదూ? తుచ్ఛ మానవుడిలా ప్రవర్తిస్తూ అందరి కన్నా ఉన్నతమైన వాడిననే భ్రమలో బతుకుతున్నావు.
ఘోరంగా విఫలమై ఓడిపోయినా, నైతిక బాధ్యత వహిస్తున్నావా? లేదే? ఇంకా ఎందుకు విర్రవీగుతున్నావ్‌? ఇంకా నీకు అధికారం మీద, కుర్చీ మీద వ్యామోహమే పోలేదు. నువ్వు దేవుడి పుత్రుణ్ణని ఎలా ప్రకటించుకున్నావ్‌? కొంచెమైనా సిగ్గుపడాలి కదా? నిజాయితీ, నిబద్ధత గల సామాన్య పౌరులు దేశంలో ఎంతో మంది ఉన్నారు. నీతి, నిజాయితీల విషయంలో ఎంతటి అథమ స్థాయిలో ఉన్నావో ఇకనైనా నువ్వు ఆలోచించుకో.
చెప్పు, నరేంద్రా! చెప్పు-నువ్వు కన్యాకుమారి వెళ్ళావు. ఆధ్యాత్మికతకు ఉండే మహోన్నతమైన స్థానాన్ని, హుందాతనాన్ని నువ్వు నవ్వులపాలు చేశావ్‌. గేలి చేశావ్‌. చులకన చేశావ్‌. పరమాత్ములమైన మేము ఇలాంటి తప్పిదాలు చేయము. సత్య మార్గాన్ని, న్యాయ మార్గాన్ని అనుసరించు. న్యాయాన్ని అభినయంతో జత పరచకు నరేంద్రా. అది ఘోరమైన తప్పిదం. అవి రెండూ వేరు వేరు. అభినయమంటే నటన- నటనతో ప్రజలకు న్యాయాన్ని అందించలేవు. నువ్వే కాదు. నీ గ్రూపులో చేరే కుట్రదారులు, వెన్నుపోటు దారులు ఎవరూ ప్రజలకు నటనతో న్యాయాన్ని అందించలేరు.
ఇంతెందుకూ? కాశీలో గంగను చూసినప్పుడల్లా గొప్ప భావుకుడివై పోయినట్లు నటిస్తావ్‌. గొప్ప శ్రద్ధా భక్తులున్నట్లు – నువ్వు ఏర్పాటు చేసుకున్న ఇంటర్వ్యూలలో చెపుతుంటావు. ఎప్పుడైనా ఆ గంగమ్మ తల్లి రోదనను వినిపించుకున్నావా? గంగా నదిని ప్రక్షాళనం చేస్తున్నామని, శుద్ధి చేస్తున్నామని ప్రకటిస్తావే తప్ప-చేశావా? కాలుష్యపు కోరల నుంచి ఆ తల్లిని విడిపించావా? శుభ్రపడి శుద్ధి కావాలని గంగ తపించిపోతూ ఉంది. కాశీ ఘాట్‌ను ఒక ‘మాల్‌’ లాగా చేసి పెట్టావ్‌ నరేంద్రా- గ్రహించుకో.
చివరగా మరొక మాట! నా లాగా కనిపించాలని వేషాలెయ్యకు. దేశ ప్రజలకు అబద్ధాలు చెప్పకు. ఇతరుల బాధలు తెలుసుకో. వాటిని తగ్గించడానికి నీ అధికారాన్ని ఉపయోగించు. అంతే కానీ, అధికారం ఉంది కదా అని దుర్వినియోగం చెయ్యకు. అప్పుడు నేనే నీకు తగిన బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆ జెఎన్‌యూ విద్యార్థి ఉమర్‌ ఖాలిద్‌ను గుర్తు చేసుకో. ఆ అబ్బాయి చేసిన అపరాధమేమిటీ? మూడేళ్ళ నుండి జైల్లో మగ్గుతున్నాడు. బెయిల్‌ కూడా దొరకకుండా చేశావ్‌. ఎంతో భవిష్యత్తు గల యువకుడు. ఎంతో వేదనను, యాతనను అనుభవిస్తున్నాడు. ఇలా దేశంలో ఎంతో మంది….
సూచన ప్రాయంగా నేను కొన్ని విషయాల్నే ప్రస్తావించాను నరేంద్రా-వీటి లోంచి నువ్వు ఎక్కువ విషయాలు గ్రహించు-బుద్దిగా మసలుకో.

ఇట్లు,
నీ పరమాత్మ.

– రచయిత : డా|| దేవరాజు మహారాజు సాహితీవేత్త, జీవ శాస్త్రవేత్త-మెల్బోర్న్‌ నుంచి

➡️