అన్ని వ్యవస్థలు అదానీ వైపే!

adani scam case updates supreme court modi govt telakapalli ravi article

సుప్రీంకోర్టు తీర్పు కారణంగా అయోధ్యలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంలా రామమందిర ప్రాణ ప్రతిష్ట 22న జరగబోతున్నది. మధుర, కాశీ మందిరాల వివాదాలను కూడా తిరగదోడే న్యాయ ప్రక్రియ పూర్తయిపోయింది. క్రోనీ కార్పొరేట్‌ సామ్రాజ్యాధినేత గౌతమ్‌ అదానీ గ్రూపు అక్రమాలపై అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన ఫిర్యాదుల కేసును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆ తీర్పు వచ్చిన మరుసటి రోజునే మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) నిబంధనలు మార్చింది. పైకి విడివిడిగా కనిపించే ఈ పరిణామ క్రమం వెనక వున్న వ్యవస్థాగతమైన లింకేమిటో తెలియాలంటే న్యాయం అన్నదాని గురించి కారల్‌ మార్క్స్‌ ప్రసిద్ధ వాక్యాలు గుర్తు చేసుకోవలసి వుంటుంది. ‘చట్టం వ్యవస్థపై ఆధారపడి వుంటుంది గానీ వ్యవస్థ చట్టంపై ఆధారపడి వుండదు.’ ‘మత రాజ్య వ్యవస్థలో దైవ దూషణ అన్నిటి కంటే పెద్ద నేరంగా వుంటుంది. రాచరికంలో రాజద్రోహానికి అత్యధిక శిక్ష. వర్గ సమాజంలో ప్రైవేటు ఆస్తికి భంగం కలిగించే చర్య అనుమతించబడదు.’ 45 ఏళ్ల కిందట ఆంధ్రా యూనివర్సిటీ ప్రసంగంలో ఈ వాక్యాలను ఉటంకించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చిన్నపరెడ్డి దాన్ని వివరించడానికి మూడు ఉదాహరణలివి. విచిత్రంగా ఇప్పుడు భారత దేశంలో ఈ మూడు లక్షణాలు కలిసి కనిపిస్తున్నాయి. గుళ్లూ గోపురాల వివాదాలు, రాజద్రోహ కేసులు, బడా ఆశ్రిత పెట్టుబడిదారులను కాపాడే మార్కెట్‌ శాసనాలు ఏక కాలంలో అమలవుతున్నాయి.

  • అదానీ అనుబంధం, హిండెన్‌బర్గ్‌ పరిశోధన

నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన నాటి నుంచి కేంద్రం వత్తాసుతోనే దేశ విదేశాల్లో అదానీ గ్రూపు చెలరేగిపోవడం అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వ సంస్థల ఆస్తులు, కాంట్రాక్టులు దానికే వెళ్లేలా చేయడంలో బిజెపి ప్రభుత్వ పాత్ర చాలా సార్లు వెల్లడైంది. ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి దేశాల్లోనూ అదానీ గ్రూపు తరపున మోడీ సిఫార్సులు చేసినట్టు ఆ దేశాల నేతలే వెల్లడించారు. ఎ.పి లో గంగవరం, కృష్ణపట్నం వంటి రేవులతో సహా, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ సహా అనేక ఆస్తులు, టెంటర్లు వారికే దక్కాయి. మరోవైపున స్టాక్‌ మార్కెట్‌లో అదానీ గ్రూపు షేర్ల రేట్లు విపరీతంగా పెరిగిపోతూ వచ్చాయి. అతి పెద్ద కార్పొరేట్‌గా అంబానీల స్థానంలో అదానీ అవతరిస్తున్నట్టు కనిపించింది. అటు అదానీ ఇటు అంబానీ మధ్యలో ప్రధాని అనేది నానుడిగా మారింది. అంబానీలు అన్ని ప్రభుత్వాల్లోనూ చక్రం తిప్పినా మోడీ హయాంలో ఆయన ఇష్టుడైన కుబేరుడుగా అదానీకి తిరుగులేకుండా పోయిందని పారిశ్రామిక వర్గాలు భావించాయి. ఇలాంటి తరుణంలో 2023 జనవరి 24న హిండెన్‌బర్గ్‌ రిసెర్చి గ్రూపు అదానీ వ్యవహారాలపై ఒక సంచలన పరిశోధనా నివేదిక ప్రకటించింది. ఈ గ్రూపు షేర్లు ఇంతగా విజృంభించడం వెనక అనైతిక ఆర్థిక పద్ధతులు న్నాయనీ వెల్లడించింది. అదానీ గ్రూపు బినామీల ద్వారా తన షేర్లను అరువు తీసుకొని మార్కెట్‌ రేటుకు అమ్ముతూ మళ్లీ తక్కువ రేటుకు కొంటూ, కృత్రిమంగా గిరాకీ పెంచినట్టు వెల్లడించింది. స్టాక్‌ మార్కెట్‌ భాషలో దీన్నే షార్ట్‌ సెల్లింగ్‌ అంటారు. అంటే ఒక సంస్థ మార్కెట్‌లో తన షేర్లను తనే తీసుకుని భారీగా అమ్మడం, తర్వాత చౌకగా కొనడం, రేటు పెరిగాక విడుదల చేయడం. ఇదే ఒక అభ్యంతరకర మార్గమైతే ఆ సంస్థకు సంబంధించిన బినామీలు లేదా భాగస్వాముల ద్వారానే భారీగా కొనుగోళ్లు, అమ్మకాలు చేయించి జోరుగా పెరిగిపోతున్న భ్రమ కలిగించడం. ఇదంతా ఎందుకంటే సాధారణ మదుపరులు ఎగబడిపోయి షేర్లు కొనుగోలు చేయడానికి. మార్కెట్‌ విలువ బాగా పెంచి చూపించి రుణాలు, అడ్వాన్సులు పుట్టించుకోవడానికి, అన్నిటినీ మించి ప్రత్యర్థులను దెబ్బ తీయడానికి, ఈ క్రమంలో వీటినే ఆధారంగా చూపి ప్రభుత్వ బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి ఉదారంగా అప్పులు, భాగస్వామ్యాలు పొందడానికీ ఇవి ఉపయోగపడతాయి. అదానీ విషయంలో స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో సహా అనేక సంస్థలు విస్తారంగా సహకరించాయి. ఇదేగాక షేర్ల కొనుగోలులోనూ అవీ పాలుపంచుకున్నాయి. ఈ క్రమంలో విపరీతంగా వందల కోట్లు చేతులు మారి మనీ లాండరింగ్‌ కార్యకలాపాలు సాగాయి. దీనిపై రెండేళ్ల పరిశోధన జరిపి ఇందుకు సంబంధించిన అనేక వాస్తవాలు, వివరాలు హిండెన్‌బర్గ్‌ బయిటపెట్టింది. ఆ సమయంలో అదానీ గ్రూపు పెరుగుదల 817 శాతంగా వుండింది. ఆస్తుల విలువ రూ.17,80,000 కోట్లు. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడైన అదానీ వ్యవహరాలపై వెంటనే దర్యాప్తు జరపాలనీ, అన్ని నిజాలు బయిటపెట్టాలనీ ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి.

  • సుప్రీం కోర్టులో జరిగిందేమిటి?

అదానీపై తీవ్రమైన ఈ ఆరోపణలను విచారించడం కోసం ఒక కమిటీని నియమించాలంటూ ఫిబ్రవరిలో సుప్రీం కోర్టులో పిల్‌ దాఖలైంది. కోర్టులోనూ పార్లమెంటులోనూ పోరాటం జరుగుతున్నా కేంద్రం కనీసంగా స్పందించలేదు. అదానీ గ్రూపు తనను తాను సమర్థించుకుంటూ ఎదురు దాడి చేసింది. అంతేగాక దూసుకుపోతున్న భారతీయ కంపెనీని దెబ్బ తీయడం కోసం దేశ వ్యతిరేక శక్తులు కుట్రలు పన్నుతున్నాయని బిజెపి నేతలు కొత్త పల్లవి అందుకున్నారు. ఎట్టకేలకు మూడు మాసాల తర్వాత మార్చి 2న సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరిపి రెండు మాసాలలోగా నివేదిక నివ్వాలని సెబీని ఆదేశించింది. స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలలోనూ డబ్బు మార్పిడిలోనూ అక్రమాలు నిగ్గు తేల్చాలన్నది. మరోవైపున కోర్టు తరపున కూడా ఒక త్రిసభ్య కమిటీని నియమించింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అభరు మనోహర్‌ సప్రే అధ్యక్షతన ఈ కమిటీ నివేదిక మే 19న అందజేసింది. అక్రమాలకు పాల్పడినట్టు ఆధారాలు దొరకలేదని సమర్థించింది. దీనిపై సెబీ వ్యవహరించిన తీరులోనూ ఉల్లంఘనలు లేవంటూనే పూర్తి వివరాలు రాబట్టడంలో అది విఫలమైనట్టు పేర్కొంది. ఏవో పరిశోధనా సంస్థలు అనేక ఆరోపణలు తీసుకొచ్చినా వాటి మూలాలలోకి వెళ్లడంలో సెబి కృతకృత్యం కాలేకపోయింది. అదానీ గ్రూపు షేర్ల విపరీత పెరుగుదల కారణాలు, పెట్టుబడి పెట్టిన కంపెనీలతో వారి బాంధవ్యం వంటి అంశాలను కూడా నిగ్గు తేల్చలేదని విమర్శించింది. సెబీ నిబంధనల మార్పు వల్ల పారదర్శకత లేకుండా పోయిందనీ, లోపాయికారీ పెట్టుబడులు సమకూర్చేవారి వివరాలు దాచిపెట్టబడ్డాయనీ కూడా ఈ కమిటీ చెప్పింది. నిజానికి 2014 లోనే డిఆర్‌ఐ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌) దృష్టికి ఈ ఆరోపణలు వచ్చాయనేది ఇక్కడ గమనించాలి. వీటిపై విచారణ జరుగుతున్నట్టు 2020లో 2021లో పార్లమెంటుకు కేంద్రం సమాధానమిచ్చింది. తీరా చూస్తే ఆ దర్యాప్తు లోపభూయిష్టంగా వున్నట్టు సుప్రీం నియమించిన కమిటీనే ఇక్కడ చెప్పడం గమనించదగింది. ఈలోగా తాజా ఆదేశాల ప్రకారం రెండు మాసాల్లో నివేదిక నివ్వాల్సిన సెబీ ఆగష్టు వరకూ పొడగింపు పొందింది. ఇలా మొత్తం ప్రహసనంగా మారిపోగా రాజకీయంగా దానిపై ఎంత కల్లోలం రేగుతున్నా అదానీ మాత్రం యథాతథంగా కార్యకలాపాలు సాగిస్తూ పోయారు. నవంబరు నాటికి వాదనలు వినడం పూర్తి కాగా తీర్పు రిజర్వు చేసిన చీఫ్‌ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ధర్మాసనం జనవరి 3న ప్రకటించిన తీర్పు దేశానికి దిగ్భ్రాంతి కలిగించింది.

  • అయితే ఓకె..అంతా రైటే..

సెబీ విచారణలో ఎలాంటి పొరబాటు లేదని సుప్రీం కోర్ట్టు కితాబునిచ్చింది. అది విఫలమైంది గనక సిబిఐకి దర్యాప్తు అప్పగించాలనే అభ్యర్థనను తోసిపుచ్చుతూ అది అరుదైన సందర్భాల్లో మాత్రమే సాధ్యమని చెప్పడం మరింత విపరీతమైన అంశం. దీనికి సిజెఐ అనేక వాదనలు తెచ్చారు గాని ఎన్ని రాజకీయ వాజ్యాలలో సిబిఐని, ఎన్‌ఐఎను తీసుకొచ్చారో దేశమంతటికీ తెలుసు. నిజానికి సుప్రీంకోర్టు సమయంలో సింహ భాగం దానికే సరిపోతున్నది. కంపెనీల షార్ట్‌ సెల్లింగ్‌పై సెబీ నిబంధనలను తాము నియంత్రించలేమని కూడా చేతులెత్తేసింది. చాలా కాలంగా ఈ విషయంలో పాటిస్తున్న నియంత్రణను కొంతకాలం కిందట మార్చినట్టు వాదించిన సెబీ సమర్థనను ఈ విధంగా సుప్రీం తీర్పు కూడా ఆమోదించింది. అదానీ గ్రూపుపై విస్తారమైన పరిశోధనల సమాచారం, నివేదికలు అందుబాటులో వున్నా సెబీ వాటిని ఉపయోగించుకోలేక పోయిందని తాను నియమించిన కమిటీయే చెప్పినా ధర్మాసనం పట్టించుకోలేదు. పైగా వీరంతా చట్టబద్దమైన సెబీ నియంత్రణ సంస్థగా విచారిస్తుంటే థర్డ్‌ పార్టీ (బయిటివారని) ఎందుకని ప్రశ్నించింది. పత్రికల్లో మీడియాలో వచ్చిన నివేదికలను, కథనాలను పరిగణనలోకి తీసుకోనవసరం లేదని ఎదురు వాదించింది. ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ పేపర్స్‌ (ఒసిసిఆర్‌పి) విడుదల చేసిన నివేదికను పిల్‌లో ప్రస్తావించడాన్ని తోసిపుచ్చింది. ఇది సహజ న్యాయ సూత్రాలకే విరుద్ధమని చెప్పనక్కర్లేదు. సెబీ అనుసరించిన పద్ధతులు, సూత్రాలు సరైనవా కావా అని చెప్పడం తన పరిధిలో వుండదని కూడా వ్యాఖ్యానించింది. అదానీ వ్యవహారాలను గతంలో ఎన్నడూ తాను దర్యాప్తు చేసిందేలేదని సెబీ తన వాంగ్మూలంలో చెప్పడం ఇక్కడ అతి పెద్ద పిల్లి మొగ్గ. మరోపక్క షార్ట్‌ సెల్లింగ్‌ను స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలను నియంత్రణ చేయడం కోసం తాము భవిష్యత్తులో చర్య తీసుకుంటామని కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ ఇచ్చిన హామీని ఓకె చేసింది.

  • న్యూస్‌ క్లిక్‌ కేసులో ఏమైంది?

తీర్పు రాగానే సత్యం గెలిచిందని అదానీ గొప్పగా స్వాగతించారు. ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. పరస్పర విరుద్ధాంశాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్‌ ప్రతినిధి జైరాం రమేష్‌ ఒక సమగ్ర ప్రకటన చేశారు. ఈ తీర్పు చాలా నిరుత్సాహ కరమని సిపిఎం పేర్కొంది. ప్రభుత్వం అన్నిటినీ కప్పిపుచ్చడానికి సుప్రీం తీర్పు లైసెన్సుగా మారిందని కూడా సిపిఎం విమర్శించింది. తమాషా ఏమంటే వివరాలు తప్పక వెల్లడించాలని తీర్పు వచ్చిన రెండు రోజుల్లోనే షార్ట్‌ సెల్లింగ్‌ నిబంధనలు సెబీ సవరించింది! అదానీని కాపాడే ప్రక్రియ అయిపోగానే వాటి అవసరం తీరిపోయిందన్నమాట. మోడీ రాజ్యంలో సమస్త వ్యవస్థలూ శక్తులూ కూడా అదానీని కాపాడ్డానికే అంకితమైన తీరు ఇది. న్యూస్‌క్లిక్‌పై కేంద్రం దాడికి కారణం నైవేలీ సింఘం ద్వారా దానికి మూడు కోట్ల రూపాయలు అందాయనే ఆరోపణ. వాస్తవానికి అవి చట్టబద్దంగా జరిగిన లావాదేవీలు. కానీ దాన్ని పెద్ద వ్యవహారంగా చేసి ప్రబీర్‌ పురకాయస్థ తదితరులను నెలల తరబడి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. ఇప్పటికీ వేధిస్తూనే వున్నారు. మీడియాపై అదానీ పట్టు అంతులేకుండా పెరిగిపోతున్న స్థితి కూడా చూస్తున్నాం. 17 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం అక్రమాలను అంతర్జాతీయ సమాజం లోతులు చూపుతున్నా దాటేస్తున్న ఈ సర్కారు న్యూస్‌క్లిక్‌ విషయంలో మన దర్యాప్తు సంస్థల సమాచారాన్నే మరో రూపంలో ఇచ్చిన న్యూయార్క్‌ టైమ్స్‌ కథనాన్ని ఆధారంగా చూపుతుంది. కానీ అదానీకి సంబంధించిన వేల కోట్ల స్టాక్‌ భాగోతాలలో మనీలాండరింగ్‌లలో మాత్రం పత్రికల కథనాలపై ఆధారపడలేమని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెబుతుంది. తలకిందులు తర్కం అంటే ఇదే కదూ?

 

  • తెలకపల్లి రవి
➡️