దయనీయ పరిస్థితులపై గ్రామీణ శ్రామికుల సమరశీల పోరాటాలు

Dec 21,2023 07:06 #Agriculture, #AIAWU, #Articles, #Protest
false propaganda on china economy article m koteswarao

వ్యవసాయ కార్మికులు-గ్రామీణ శ్రామికవర్గమైన వీరు భారతదేశంలో అత్యంత అట్టడుగు వర్గం. కట్టుబానిసలైన వ్యవసాయ కార్మికులు తమ ఉక్కు సంకెళ్ళ నుండి బంధ విముక్తులైనా ఆకలి, పెరుగుతున్న నిరుద్యోగమనే సంకెళ్ళలో ఇంకా బందీలుగానే మిగిలారు. వీరిలో చాలామంది భూమి లేని నిరుపేదలే. వారికి కేవలం తమ శ్రమను అమ్ముకోవడం మినహా జీవనం సాగడానికి ఎలాంటి ఇతరత్రా మార్గాలు వుండవు.

2011 జనాభా లెక్కల ప్రకారం, మొత్తంగా పెద్ద, ఒక మోస్తరు సాగుదారుల సంఖ్య 11,86,69,264గా వుండగా, వ్యవసాయ కార్మికుల సంఖ్య 14,43,29,833గా వుంది. కొనసాగుతున్న వ్యవసాయ సంక్షోభం లక్షలాదిమంది చిన్న, ఒక మోస్తరు రైతులను సాగు వదిలే పరిస్థితులకు నెట్టివేసింది. ఆ రకంగా వారు భూమిలేని వ్యవసాయ కార్మికులుగా మారిపోయారు. కేవలం రైతులే కాదు, చిన్న తరహా చేతివృత్తుల వారు కూడా తమ ఉపాధిని కోల్పోతున్నారు. వ్యవసాయ కార్మికులుగా పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆర్థిక సంక్షోభం ఫలితంగా పారిశ్రామికాభివృద్ధి మందకొడిగా మారి, వీరికి ప్రత్యామ్నాయ గ్రామీణ లేదా పట్టణ ఉపాధి చూపించడంలో విఫలమైంది. సాగుదారుల కన్నా వ్యవసాయ కార్మికుల సంఖ్య పెరగడంతో కూలీ డబ్బులపై ఆధారపడడం మరింత ఎక్కువైంది. సాధారణంగా, వీరికి ప్రభుత్వాలు కనీస వేతనాలు ప్రకటించవు. ఒకవేళ ప్రకటించినా చాలా తక్కువగా వుంటాయి, అంతకంటే పెద్ద సమస్య ఏమిటంటే, వీరికి కనీస వేతనాలు అమలు చేసే వ్యవస్థ ఏదీ లేకపోవడం. ఫలితంగా, వ్యవసాయ కార్మికుల వాస్తవ వేతనాలు కాలక్రమంలో పెరగకుండా పోయాయి.

 

  • మహిళా కార్మికుల వేతనాలు మరీ తక్కువ

మహిళా వ్యవసాయ కార్మికుల వేతనాలు మరీ తక్కువగా వున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో అటువంటి పరిస్థితే వుంది. వ్యవసాయ కార్మికులు ఏకపక్షంగా రోజువారీ కూలీలపై పని చేయాల్సి వస్తోంది. కొంత అడ్వాన్స్‌ తీసుకోవడంతో గంటల తరబడి పని చేస్తున్నారు. వారిని దోపీడి చేసే స్థాయి ఇలా వుంది మరి. అంతకన్నా ఘోరమైన, దారుణమైన విషయం ఏమిటంటే, మహారాష్ట్ర, కర్ణాటకల్లో చెరకు తోటల్లో పనిచేసే మహిళా కూలీలు నెలసరి వచ్చిన సమయంలో కూలీ పోకుండా వుండేందుకు హిస్టరాక్టమీ (గర్భసంచి తొలగించుకోవడం) చేయించుకుంటున్నట్లు అనేక పరిశోధనలు, మీడియా వార్తల్లో వెల్లడైంది!!

 

  • సంక్షేమ పథకాల కుదింపుకు కుతంత్రాలు

అరకొర ఆదాయాలు, పెద్దఎత్తున నిరుద్యోగం నెలకొన్న ఇటువంటి పరిస్థితుల్లో, వ్యవసాయ కూలీల జీవితాలు కేవలం సాంఘిక సంక్షేమ పథకాలు, ప్రభుత్వ రంగ సంస్థల సామాజిక సంక్షేమ చర్యలపై ప్రధానంగా ఆధారపడి వున్నాయి. అయితే, మొత్తంగా ఈ సామాజిక సంక్షేమ భావన అనేది ఇటు భారత పెట్టుబడిదారులకు, అటు విదేశీ పెట్టుబడిదారులకూ ఇరువురికీ ఆమోదయోగ్యంగా లేదు. ప్రస్తుతం, బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలతో సామాజిక సంక్షేమ ప్రభుత్వమనే భావనే బలహీనమై పోతోంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మినహాయిస్తే, మిగిలిన చోట్ల ఆరోగ్య, విద్యా రంగాలతో సహా మొత్తంగా ప్రభుత్వ రంగం పెద్ద ఎత్తున ప్రైవేటీకరించ బడుతోంది. ఫలితంగా మన ప్రస్తుత, భవిష్యత్‌ కాలమంతా ప్రమాదంలో పడుతోంది. మోడీ ఆయన ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను ఉచితాలు అంటూ వ్యాఖ్యానించడం ద్వారా కించపరుస్తున్నారు. పైగా ఆ సంక్షేమ పథకాలను, చర్యలను కుదిస్తామని, అంతం చేస్తామని సంకేతాలు పంపుతున్నారు.

విద్య, ఆరోగ్యం, విద్యుత్‌ రంగాల ప్రైవేటీకరణతో, ప్రజా పంపిణీ వ్యవస్థను, ఇతర సామాజిక సంక్షేమ పథకాలను బలహీనపరచడంతో వ్యవసాయ కూలీలు ఈ సేవలకు కూడా డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో అయితే ప్రభుత్వాలే ఈ సేవలను అందించేవి. ఇవి వారి జీవితాలపై అదనంగా పెను భారాన్ని మోపుతున్నాయి. అనివార్యమైన, మౌలిక అవసరాలుగా మారిపోయాయి. తక్కువ ఆదాయ పరిస్థితులు నెలకొనడంతో రుణాలు లేదా అప్పులు అనేవి వారికి ఏకైక ప్రత్యామ్నాయంగా మారిపోయాయి. తమ దుర్భర పరిస్థితులను ఎదుర్కొనాలంటే ఇది తప్పనిసరై పోయింది. దారిద్య్రం కారణంగా ఆత్మహత్య చేసుకోవడమా లేక రుణాలు తీసుకుని, వాటిని తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడడమా వీటిల్లో ఏదోకదాన్ని ఎంచుకునే పరిస్థితి నెలకొంది. 2014లో వ్యవసాయ కూలీల ఆత్మహత్యల నమోదును చేపట్టారు. ఆ సమాచారాన్ని బహిరంగంగా విడుదల చేశారు. 2014లో 5650 మంది రైతులు, 6710 మంది వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు నమోదయ్యాయి. అంటే ఎంత ఒత్తిడితో కూడిన పరిస్థితులు నెలకొన్నాయో, అందులో వారెలా జీవిస్తున్నారో తెలుస్తోంది. గతేడాది ఎన్‌సిఆర్‌బి గణాంకాల రపకారం, 5563 మంది వ్యవసాయ కూలీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2014 నుండి మొత్తమ్మీద 40,685 మంది రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) ఒక్కటే వ్యవసాయ, గ్రామీణ కూలీలకు ఏకైక ఆశాకిరణంగా వుంది.

గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత నిరుపేద, అణచివేతకు గురైన వర్గాలు మనుగడ సాగించడానికి ఇది బాగా సాయపడింది. వాస్తవాలన్నీ ఈ రీతిన వున్నప్పటికీ, ఈ పథకాన్ని సమూలంగా నిర్మూలించేందుకు గత 9 ఏళ్ళుగా మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే వుంది. డిమాండ్‌ గల ఈ ఉపాధి పథకాన్ని మోడీ ప్రభుత్వం బలహీనపరిచింది. ఆ పథకానికి అరకొర నిధులు కేటాయిస్తూ, తక్కువ కూలీ రేట్లు అమలు చేస్తూ, సామాజిక ఆడిట్‌ వ్యవస్థను దెబ్బ తీస్తూ, ఈ పథకానికి సంబంధించిన కూలీలు, స్థానిక అధికారులను నిరుత్సాహపరుస్తూ అన్నింటికంటే ముఖ్యంగా ఇటీవల (ఆన్‌లైన్‌లో) హాజరు నమోదు, (కులాల వారీగా) నిధులు కేటాయింపు, వేతనాల చెల్లింపు వ్యవస్థల్లో మార్పులు చేసింది. ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎకు వరుసగా కేంద్ర బడ్జెట్‌ల్లో అరకొర నిధులు కేటాయించడం ద్వారా మోడీ ప్రభుత్వం ఈ పథకంపై నిరంతరంగా దాడి చేస్తూనే వుంది. వాస్తవానికి, మొత్తం బడ్జెట్‌ ప్రకారం చూసినట్లైతే ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎకు జరిపిన కేటాయింపులు తగ్గిపోయాయి. 2013-14 ఆర్థిక సంవత్సరానికి మొత్తంగా బడ్జెట్‌లో ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పథకానికి 1.98శాతం నిధులు కేటాయించారు. అదే ప్రస్తుత 2022-23 సంవత్సరానికి చూసినట్లైతే ఇది 1.85శాతంగా మాత్రమే వుంది.

ఈ చట్టంలోని సెక్షన్‌ 27 కింద కొన్ని రాష్ట్రాలకు బిజెపి ప్రభుత్వం నిధులను అందచేయకుండా నిలిపివేసింది. అవినీతిపై పోరాడేందుకు చేసే కృషి లేకుండా పోయింది. పనుల పర్యవేక్షణకు డ్రోన్‌ కెమెరాలను వినియోగించడంతో అవినీతిని అరికట్టేందుకు సాంకేతికతను అధికంగా ఉపయోగించడం ఆరంభమై, సామాజిక తనిఖీలు లేదా ఆడిట్‌లు నిరుత్సాహానికి గురవుతున్నాయి. మౌలికంగా, అవినీతిపై పోరాడే రాజకీయ సంకల్పం కొరవడింది. మొత్తంగా 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేవలం ఆరింట్లో మాత్రమే 50శాతానికి పైగా గ్రామ పంచాయితీల్లో మాత్రమే ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కింద చేయాల్సిన సామాజిక ఆడిట్‌ పూర్తయింది. వంద శాతమూ గ్రామ పంచాయితీల్లో ఆడిట్‌ పూర్తి చేసిన ఏకైక రాష్ట్రం కేరళ మాత్రమే.

 

  • 41 శాతం కుటుంబాలకు ఎలాంటి భూమి లేదు

భూమిలో తమకు దక్కాల్సిన చట్టబద్ధమైన వాటాను పొందేందుకు భూమిలేని నిరుపేదలైన వ్యవసాయ కూలీలు వేచి చూస్తూనే వున్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వేల డేటాను చూసినట్లైతే, గ్రామీణ ప్రాంతాల్లో 41 శాతం కుటుంబాలకు 2018-19లో ఎలాంటి వ్యవసాయ భూమి లేదు. అలాగే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) డేటాను చూస్తే, 2015-16లో 47 శాతం పైగా గ్రామీణ కుటుంబాలు ఎలాంటి వ్యవసాయ భూమిని కలిగి లేవు. 2011 నాటి సామాజిక ఆర్థిక, కుల గణన (ఎస్‌ఇసిసి) ప్రకారం 56 శాతం గ్రామీణ కుటుంబాలు భూమిలేని నిరుపేదలుగానే వున్నాయి. భూమిలేని నిరుపేదల సంఖ్య 2018-19లో ఆంధ్రప్రదేశ్‌ (54.4 శాతం), బీహార్‌ (49.3 శాతం), పంజాబ్‌ (46.3 శాతం), తెలంగాణ(42.5 శాతం)గా వుంది. ఇటీవల కాలంలో ముఖ్యంగా నయా ఉదారవాద సంస్కరణల అమలు తర్వాత, భూ సంస్కరణల విషయంలో పరిస్థితి తిరగబడింది. దేశవ్యాప్తంగా భూమిలేని (0.01 హెక్టార్ల భూమి కన్నా తక్కువ కలిగివున్న) కుటుంబాల సంఖ్య ప్రస్తుత 35 శాతం నుండి 49 శాతానికి పెరిగింది. వ్యవసాయ కూలీలు ఎలాంటి వనరులు లేక ఆర్థికంగా దోపిడీకి గురవ్వడమే కాకుండా, గ్రామీణ సమాజంలో అట్టడుగు అంచున వున్నారు. ఈ వ్యవసాయ కూలీల్లో ఎక్కువమంది ఎస్‌సి, ఎస్‌టి కమ్యూనిటీలకు చెందినవారే. వీరు అనేక రకాలైన అత్యాచారాలకు గురవుతుంటారు. మనుస్మృతి చెప్పిన చాతుర్వర్ణాల ప్రాతిపదిక కలిగిన ఈ ఫ్యూడల్‌ సమాజంలో సామాజిక అణచివేతకు గురవుతూ వుంటారు. బిజెపి పాలనలో హిందూత్వ, మనువాద శక్తులు పెరిగిపోవడంతో వారిపై దాడులు, వివక్ష అనేక రెట్లు పెరిగిపోయింది. వారికి కల్పించే రాజ్యాంగపరమైన రక్షణలు, హామీలు అమలు కావడంలేదు, బలహీనపడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమ హక్కుల కోసం గ్రామీణ శ్రామికవర్గం పోరాడాలని కృతనిశ్చయానికి వచ్చింది. ఇటీవల కాలంలో వేతనాలు, భూమి, గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు కోసం, అలాగే సామాజిక సంక్షేమ పథకాల అమలు కోసం, కులాల పేరుతో జరిగే అత్యాచారాలకు, దారుణాలకు వ్యతిరేకంగా స్వతంత్ర సమరశీల పోరాటాలు జరపడం మనం చూస్తున్నాం. చారిత్రక రైతాంగ పోరాటాల్లో వారు భాగస్వాములయ్యారు. మతోన్మాదం, కార్పొరేట్‌ బంధానికి వ్యతిరేకంగా రైతులు, కార్మికులు సాగించే వర్గ ఐక్యతలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

agriculture workers protest in bjp govt article

  • వ్యాసకర్త : విక్రమ్‌ సింగ్‌, వ్యవసాయ కార్మిక సంఘం అభిల భారత సహాయ కార్యదర్శి.
➡️