అన్యాక్రాంతమైన ఆస్తులు

Jul 2,2024 04:55 #kabza, #lands, #YCP

వైసిపి హయాంలో ప్రభుత్వ ఆస్తులను అన్యా క్రాంతంగా అసమ్మదీయులకు కట్టబెట్టినట్టు నివేదికలు తెలియజేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాల యాలకు, టిడ్కో ఇళ్ళకు అధికార పార్టీ రంగులు, ఎటువంటి సలహాలు ఇవ్వని సలహాదారులకు, న్యాయస్థానాల్లో ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాదులకు వేల కోట్లు నజరానా చెల్లింపు, ఇసుక, మద్యం, ప్రభుత్వ కార్యాలయాలూ తనఖా పెట్టడం గతంలో ఎప్పుడూ జరగలేదు. అలాగే రుషికొండలో ఆదాయాన్నిచ్చే రిసార్ట్స్‌ కూల్చి ఆరు వందల కోట్ల ప్రజాధనంతో ప్రజలకు ఏ మాత్రం ప్రయోజనం లేని ప్యాలెస్‌ల నిర్మాణం, కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూముల్లో ఏడాదికి వెయ్యి రూపాయలు నామమాత్రపు అద్దెకు పదుల సంఖ్యలో పార్టీ కార్యాలయాలు నిర్మాణం వంటివి రాష్ట్రాన్ని దివాళా తీశాయి. అన్యాక్రాంతంగా దోచేసిన ఆస్తులను విజిలెన్స్‌ ద్వారా జప్తు చెయగలిగితే ప్రజలకే మాత్రం ఆర్థిక భారం లేని రాష్ట్రంగా ఒడ్డుకు తేవచ్చు. అదే జరగక పోయినట్లైతే ప్రజా ప్రతినిధు లందరూ ఒకే తానులో ముక్కలుగా వివేకవంతులైన రాష్ట్ర ప్రజలు అనుమానించే దుస్థితి ఏర్పడే ప్రమాదముంది. దోచేసిన ఆస్తులను ఎంతటి వారైనా జప్తు చేయాలని, అక్రమాలు చేసిన అధికారులకు పదవీ విరమణ చేసిన తర్వాత ప్రభుత్వ రాయితీలు పింఛన్‌లు జీవితాంతం చెల్లించకుండా చట్టం చేయగలిగితే భవిష్యత్తులో ఏ ప్రభుత్వోదోగీ తన విధుల్లో తోక జాడించే అవకాశం ఉండదు. అక్రమార్కులపై కొరడా ఝుళిపించండి! అన్యాక్రాంతమైన ఆస్తులు కాపాడండి!

– యర్రమోతు ధర్మరాజు.

 

➡️