నిరంకుశ పోకడలు

Jun 28,2024 05:36 #editpage

భారతీయ జనతా పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ముకుతాడు వేసినా, దాని నిరంకుశ ధోరణిలో ఏ మార్పూ కనపడటం లేదు. 18వ లోక్‌సభకు సభాపతి, ఉప సభాపతి ఎన్నిక విషయంలో ఆ పార్టీ ఏకపక్ష వైఖరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. లోక్‌సభలో సభాపతిగా అధికార పక్ష సభ్యుడిని, ఉప సభాపతిగా ప్రతిపక్ష సభ్యుడిని నియమించుకోవడం ఒక సాంప్రదాయంగా వస్తోంది. రాజ్యాంగంలోని 93వ అధికరణం ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ”లోక్‌సభ తన సభ్యుల్లో ఒకరిని స్పీకర్‌గా, మరొకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటుంది. స్పీకరు ఎన్నిక తేదీని రాష్ట్రపతి నిర్ణయిస్తారు. అదే రోజు డిప్యూటీ స్పీకరు ఎన్నిక కూడా జరుగుతుంది.” అని పేర్కొంది. తొలి లోక్‌సభ నుంచి 16వ లోక్‌సభ వరకూ ఈ రాజ్యాంగ నిర్దేశం అమలైంది. ప్రారంభంలో అధికార పక్ష సభ్యుల నుంచే స్పీకరు, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక జరిగేది. 1969లో మేఘాలయకు చెందిన ప్రతిపక్ష సభ్యుడు గిల్బర్ట్‌ స్వేల్‌ డిప్యూటీ స్పీకరుగా నియమితులయ్యారు. అప్పటినుంచి పాలక పార్టీ నుంచి కాక వేరే పార్టీ సభ్యుడిని ఉప సభాపతిగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
మోడీ రెండోసారి ప్రధాని అయిన తరువాత – అనేక ప్రజాస్వామిక విధానాలకు తిలోదకాలిచ్చినట్టే- డిప్యూటీ స్పీకరు ఎన్నికకు కూడా మంగళం పాడేశారు. అనేక అంశాలపై ప్రశ్నించి, ప్రస్తావించి, చర్చించాల్సిన పార్లమెంటును అధికార పక్ష బల ప్రయోగశాలగా మార్చేశారు. ప్రతిపక్ష సభ్యులను బలవంతంగా సభనుంచి గెంటేసి, మందబలంతో ప్రజావ్యతిరేక చట్టాలను తీసుకొచ్చే దుస్సాహస చర్యలకు పాల్పడ్డారు. ఈ నిరంకుశ నిర్వాకాలు నిరాటంకంగా కొనసాగించటానికి వీలుగా ఉప సభాపతి స్థానాన్ని భర్తీ చేయడం మానేశారు. డిప్యూటీ స్పీకరు పదవిని ప్రతిపక్షానికి కేటాయించే సాంప్రదాయం జనతా ప్రభుత్వం, నేషనల్‌ ఫ్రంట్‌, యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాల్లోనూ, వాజపేయి హయాంలోనూ, తరువాత యుపిఎ కాలంలోనూ కొనసాగింది. 2014లో మోడీ తొలిసారి ప్రధాని అయినప్పుడూ అన్నా డిఎంకెకు చెందిన తంబి దురై డిప్యూటీ స్పీకరుగా ఉన్నారు. 2019లో బిజెపి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సంఖ్యాబలం సాధించాక- డిప్యూటీ స్పీకరు స్థానానికి చాప చుట్టేసింది. గత ఐదు దశాబ్దాల సాంప్రదాయాన్ని పాటించాలనే ఇండియా బ్లాకు పార్టీలు పట్టుబట్టాయి. అయినా, మొండిగా వ్యవహరించటం మోడీ సర్కారుకే చెల్లింది. గడచిన పదేళ్ల నిరంకుశ ధోరణినే ఇప్పుడూ అనుసరించటం 2024 ప్రజల తీర్పును ఉల్లంఘించటమే!
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రాంతీయ పార్టీలు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. గడచిన పదేళ్లలో బిజెపితో ప్రత్యక్ష భాగస్వామ్యం లేకపోయినా అన్ని సందర్భాల్లోనూ వంత పాడిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు కూడా కమలాన్ని బలపర్చటం విచారకరం. శాసనసభలో తనకు 10 శాతం సభ్యులు లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఘోషిస్తున్న ఆ పార్టీ- లోక్‌సభలో అధికార పార్టీ కొమ్ము కాయడం ద్వంద్వ వైఖరి. రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పు నుంచి కూడా ఆ పార్టీ ఎలాంటి గుణపాఠమూ తీసుకున్నట్టు లేదు. ప్రతిపక్షం బలపడితేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్న వాస్తవాన్ని మరవరాదు. టిడిపి, జనసేన కూడా బిజెపికి మద్దతిచ్చి, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి మచ్చ తెచ్చాయి. డిప్యూటీ స్పీకరు పదవి ప్రతిపక్షానికి ఇవ్వాలని గట్టిగా కోరి ఉండాల్సింది. ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని నాటి కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా రద్దు చేస్తే, తెలుగు ప్రజలు, దేశంలోని కాంగ్రెసేతర పార్టీలూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమించి, విజయం సాధించాయి. అలాంటి ఒరవడిని కొనసాగించాల్సిన టిడిపి … మోడీ షాల నిరంకుశ పోకడలకు వంత పాడితే ప్రజాస్వామ్యానికి నష్టం. అంతేగాక విధానపరంగా నిక్కచ్చిగా నిలబడకుండా వారసత్వాన్ని కాపాడడం సాధ్యం కాదు. ఇప్పటికైనా బిజెపి డిప్యూటీ స్పీకరు స్థానాన్ని ప్రతిపక్షానికి కేటాయించి, పార్లమెంటరీ సాంప్రదాయాన్ని గౌరవించాలి. అలా చేసేలా టిడిపి, జనసేన, వైసిపి తమ వంతు పాత్ర నిర్వహించాలి. తద్వారా తెలుగు ప్రజల ప్రజాస్వామ్య కాంక్షను బలపర్చాలి.

➡️