Sharad Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాం -శరద్‌పవార్‌

పూణె : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, శివసేన (యుబిటి), ఎన్‌సిపి (ఎస్‌పి) కలిసి పోటీ చేస్తాయని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ – నవంబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం పూణెలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తాము కాంగ్రెస్‌, ఉద్ధవ్‌ థాకరే శివసేనతో కలిసి పోటీచేస్తామని చెప్పారు. సీట్ల కేటాయింపుపై త్వరలో చర్చిస్తామని, మూడు నెలల సమయం ఉందని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సంకీర్ణంలో భాగమైన చిన్న మిత్రపక్షాల ప్రయోజనాలను రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పరిరక్షించడం మహారాష్ట్రలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీల నైతిక బాధ్యత అని అన్నారు. రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, దానిని అమలు చేయడం ప్రతిపక్ష కూటమి నైతిక బాధ్యతని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు సమిష్టిగా ఉంటాయని తెలిపారు. వామపక్షాలు, పీసెంట్స్‌ అండ్‌ వర్కర్స్‌ (పిడబ్ల్యుపి) సంకీర్ణంలో భాగమైనప్పటికీ.. లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు ఇవ్వలేకపోయామని, ఈ ఎన్నికల్లో వారితో కలిసి ముందుకు వెళ్లడం తమ నైతిక బాధ్యతని చెప్పారు.

➡️