‘పోలవరం’పై మథనం..!

దెబ్బతిన్న ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణుల బృందం
అమెరికా, కెనడాకు చెందిన నలుగురు నిపుణుల నాలుగు రోజుల పర్యటన
తొలిరోజు ఎగువ, దిగువ కాపర్‌డ్యామ్‌, స్పిల్‌, గ్యాప్‌-1 పనుల పరిశీలన
ఫొటో ఎగ్జిబిషన్‌, మ్యాప్‌ పాయింట్‌ పరిశీలించి వివరాలు సేకరణ
రేపు దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌తోపాటు ఇతర పనులు పరిశీలన
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి, పోలవరం
‘పోలవరం ప్రాజెక్టు ఎందుకు నిలిచిపోయింది. ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డంకులు ఏమిటీ?, పనులను తిరిగి ఎలా ప్రారంభించాలి అనే అంశాలపై పరిశీలనకు అంతర్జాతీయ నిపుణుల బృందం ఆదివారం రంగంలోకి దిగింది. ఈ బృందం పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్లను ఎలా పరిష్కరించాలనే దానిపై పరిశీలించనుంది. ఈ బృందంలో అమెరికాకు చెందిన డేవిడ్‌ బి.పాల్‌, గియాన్‌ ఫ్రాంకో డి సిస్కో, కెనడాకు చెందిన సీన్‌ హించ్‌బెర్గర్‌, రిచర్డ్‌ డోన్నెలీ ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర జలనరుల శాఖ అధికారులతో ఢిల్లీలో నిపుణుల బృందం ముందుగా సమావేశమైంది. శనివారం రాత్రికి రాజమండ్రి చేరుకున్న నిపుణులు ఆదివారం ఉదయం 9.45 గంటలకు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు. మొత్తం నాలుగురోజుల రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు ఆదివారం ఎగువ, దిగువ కాపర్‌ డ్యామ్‌ల పనులను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్పిల్‌వే వద్ద పనులను పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసిన మ్యాప్‌ పాయింట్‌ను పరిశీలించారు. ఎగువ కాపర్‌ డ్యామ్‌ నిర్మాణంలో మూడుచోట్ల మట్టి నమునాలు సేకరించారు. గ్యాప్‌-1 పనులు పరిశీలించడంతోపాటు ఎగువ కాపర్‌ డ్యామ్‌ వద్ద లీకవుతున్న సీపేజీని పరిశీలించారు. రెండోరోజు సోమవారం దెబ్బతిన్న డయాఫ్రంవాల్‌, ఇసిఆర్‌ఎఫ్‌గ్యాప్‌-2తోపాటు ఇతర పనులను, సంబంధిత ప్రణాళికలను పరిశీలిస్తారు. మరో రెండు రోజులు వీరు అధికారులు, ప్రాజెక్టుకు సంబంధించిన నిపుణులతో చర్చించనున్నారు. దీనిలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్యులు, కేంద్ర జలసంఘం నిపుణులు, సిఎస్‌ఎంఆర్‌ఎస్‌ సంస్థ ప్రతినిధులు, వ్యాప్కోస్‌, బావర్‌, కెల్లర్‌, మేఘా కంపెనీ ప్రతినిధులు, అంతర్జాతీయ డిజైన్‌ సంస్థ అఫ్రి ప్రతినిధులు పాల్గంటారు. ఆ తర్వాత నైపుణ్య ఏజెన్సీలు, నిపుణులతో అంతర్జాతీయ బృందం చర్చించనుంది. సమావేశం నిర్వహించిన అనంతరం పనుల పురోగతిపై నివేదిక ఇవ్వనున్నారు. పోలవరం ప్రాజెక్టులో ఏర్పడ్డ అనిశ్చిత పరిస్థితులు, పెను సవాళ్ల పరిష్కారానికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం అవసరమని కేంద్ర జలసంఘం నిర్ణయించిన క్రమంలో నిపుణుల బృందం రంగ ప్రవేశం చేసింది. ఇందులో భాగంగా డిజైన్లను రూపొందించేందుకు అంతర్జాతీయ డిజైన్‌ ఏజెన్సీ అఫ్రి సాయం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టులో సవాళ్లకు సంబంధించిన కీలక అంశాల్లో వీరంతా నిపుణులు. అంతర్జాతీయ డ్యామ్‌ భద్రత నైపుణ్యం, స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌, స్ట్రక్చరల్‌ సొల్యూషన్స్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, హైడ్రాలిక్‌ నిర్మాణాలు, జియో టెక్నికల్‌ ఇంజినీరింగ్‌ వంటి అంశాలపై అవగాహన ఉన్న ఈ నిపుణులకు అంతర్జాతీయస్థాయి నైపుణ్యం ఉండటంతో వీరిని ఎంచుకున్నట్లు తెలిసింది. ఈ పర్యటనలో పోలవరం ప్రాజెక్టు సిఇ నరసింహమూర్తి, ఇఇ మల్లికార్జునరావు, ప్రాజెక్టు గౌరవ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, సిడబ్ల్యూసి డిప్యూటీ డైరెక్టర్‌ అశ్విన్‌కుమార్‌ ఉన్నారు.

➡️