అయోధ్య సంకేతాలు-అవకాశవాద స్తోత్రాలు

ayodya rama mandir open communal politics bjp govt modi telakapalli

ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత సహా ప్రధాని మోడీ అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట నిర్వహించడంతో భారత రాజకీయాల్లో నవశకం మొదలైందని మీడియా అభివర్ణిస్తున్నది. మరో వైపున బిబిసి, అల్‌జజీరా, ఎకనామిస్ట్‌ వంటి విదేశీ మీడియా సంస్థలు బాబ్రీ మసీదు కూలగొట్టిన చోటనే రామమందిరాన్ని ప్రధాని స్వయంగా ప్రారంభించడం మత రాజకీయాల్లో మరో కొత్త మలుపు అని పతాక శీర్షికలిచ్చాయి. తాము లౌకిక వాదులమైనప్పటికీ మతతత్వ రాజకీయాలను సూటిగా ఎదర్కొనలేని వ్యాఖ్యాతలు, మేధావులు కూడా అటూ ఇటూ తిప్పి మాట్లాడుతూ బిజెపికి కోపం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రముఖ నటులు చిరంజీవి వంటి వారు ఆ వేడుకలో కనిపించారు. అక్కడ ప్రత్యక్షమైన బిజెపి యేతర రాజకీయ నేత చంద్రబాబు ఒక్కరేనని మీడియా గమనించింది. పవన్‌ కళ్యాణ్‌ కూడా వెళ్లడమే గాక అయోధ్య కోసం ఏదైనా చేస్తానని ప్రకటించారు. ఇక ఎ.పి ముఖ్యమంత్రి జగన్‌ రాజకీయంగా బిజెపిని బలపర్చేవారైనా అక్కడకు వెళ్లలేదు. ఆయనను పిలిచినట్టు కూడా కనిపించలేదు. ఏమైనా మూడు పార్టీలు బిజెపితో వున్న రాష్ట్రంగా ఎ.పి మాత్రమే కనిపిస్తుంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాలు అధికారికంగానే ఆహ్వానం తిరస్క రించారు గనక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా అక్కడకు వెళ్లలేదు. భద్రాచలంలో రామాలయానికి అయోధ్య రామాలయానికి తేడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు. రాముడిపై భక్తి విషయమే అయితే రేవంత్‌ మాటలు పూర్తిగా వాస్తవమని చెప్పాలి. కానీ అయోధ్యలో అంతకు మించి జరిగింది.

కేవలం హిందూ విశ్వాసమేనా?

వరుసగా చూసినప్పుడు ఈ పరిణామాలు పూర్తిగా బిజెపి దిశలో వున్నట్టు, అయోధ్యతో అవి తిరుగు లేనివిగా మారినట్టు ఎవరైనా భావిస్తే ఆశ్చర్యంలేదు. వాస్తవానికి మీడియాలో చాలా మంది ఆ విధమైన చిత్రణే ఇస్తున్నారు. మోడీని అజేయుడని రాసిన, చెప్పిన వాళ్ల పేర్లు చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ప్రజాస్వామ్యవాదులుగా ఉదారవాదులుగా పేరున్నవారు కూడా హిందూత్వను వ్యతిరేకిస్తే తమను దూరం పెడతారనీ ముద్ర వేస్తారనీ వెనకడుగు వేస్తున్న స్థితి చూస్తాం. విద్యాధికులు ఉన్నత స్థానాల్లోవారు కూడా పథకం ప్రకారం ముందుకు తెచ్చిన ఈ రాజకీయాలకు తల వంచుతున్నారు. తలపడటానికి నిరాకరిస్తున్నారు. వాస్తవంలో లౌకికవాదులు లేదా వామపక్షాలు ఏనాడూ రామభక్తిని గానీ ఆలయాలను గానీ అవహేళన చేయలేదు. భక్తి విశ్వాసాలు వారి వారి వ్యక్తిగత అంశాలుగా మాత్రమే వుండాలన్నది ఇక్కడ కీలకాంశం. అలాగే భిన్న మతాలతో కూడిన ఈ దేశంలో అన్ని మతాలకు సమాన గౌరవం వుండాలనీ, అల్ప సంఖ్యాక మైనార్టీ మతాలకు ప్రత్యేక సదుపాయాలు, రక్షణ కూడా వుండాలనీ రాజ్యాంగంలోని 25-30వ అధికరణాలు స్పష్టంగా చెబుతున్నాయి. లౌకికతత్వం, మత సామరస్యం వుండాలంటే మతతత్వంపై పోరాడవలసిందే, ఖండించవలసిందే. మతానికి మతతత్వానికి మధ్య వుండే పెద్ద తేడాను కప్పి పుచ్చి ఇదేదో రామభక్తికి సంబంధించిన సమస్యగా చూపించడం సంఘ పరివార్‌ పాచికే. హిందూ మతం పేరిట హిందూత్వ చలామణి కావడానికి మీడియా ప్రచారాలు కూడా తోడైనాయి. హిందూత్వ వీరసావర్కార్‌ సృష్టించిన పదం మాత్రమే తప్ప ప్రాచీన సంప్రదాయం కాదు. నిజానికి రామభక్తిలోనూ కృష్ణతత్వంలోనూ కూడా ఉత్తర దక్షిణ భారతీయుల విశ్వాసాల్లో చాలా తేడాలున్నాయి. ఈ విద్వేషాలను తొలగించడానికే తిక్కన హరిహర దేవుణ్ని సృష్టించాల్సి వచ్చింది. కనక ఒకసారి మతాల మధ్య తేడాలను, రాజకీయాలను అనుమితిస్తే తర్వాత ఆయా మతాలు, కులాల మధ్య కూడా వివాదాలు రావడం అనివార్యం. ముస్లిం దేశాలలో షియాలు సున్నీల మధ్య, క్రైస్తవులలో ప్రొటెస్టంట్లు, క్యాథలిక్కుల మధ్య వివాదాలు చూస్తాం. కనుక కేవలం మతం ప్రాతిపదికన ఎవరూ ఒక దేశాన్ని ఐక్యం చేయలేరు. మత ప్రాతిపదికన విడదీయబడిన పాకిస్తాన్‌ నుంచి భాష ప్రాతిపదికన బంగ్లాదేశ్‌ విడిపోవడం దీనికో ఉదాహరణ. యాభై ఏళ్ల స్వతంత్ర భారతంలో 1998లో బిజెపి అధికారం చేపట్టిన తర్వాత హిందూత్వ పునరుద్ధరణ వాదం పెంచిన ఫలితంగానే ఈ గుళ్లూ గోపురాల చుట్టూ రాజకీయాలు తిరగాల్సి వస్తోంది. పి.వి నరసింహారావు ఎంతో తెలివైన వారు గనక బాబ్రీ తొలగించబడితే ఆ సమస్యే వుండదని కొందరు ఇప్పటికీ చెబుతుంటారు. కానీ వారణాసి జ్ఞానవాపి మసీదు కింద ఆలయ శిథిలాలు దొరికాయంటూ తాజాగా మొదలైన అలజడి చూస్తే వారి వాదన ఎంత తప్పో తెలుస్తుంది. ఈ తరుణంలోనే మధుర కృష్ణ జన్మస్థాన్‌ కేసు కూడా అలహాబాద్‌ హైకోర్టు విచారణకు చేపట్టింది. మత చిచ్చులకు మొదలే గానీ ముగింపు వుండదు. ఈ క్రమంలో మతాల గురించి, వాటిని అనుసరించే మనుషుల గురించి ఇష్టానుసారం ప్రచారాలు చేస్తూ విద్వేషాలు పెంచుకోవడం విశాల భారతావనికి విపత్కరమే. మత చిచ్చులకు మొదలే గానీ ముగింపు వుండదు.

మోడిఫికేషన్‌- రామిఫికేషన్‌

గత చరిత్రలో జరిగిందని చెబుతున్న తప్పును చక్కదిద్దడం పేరిట ఒక మత కట్టడాన్ని కూల్చి మరొకటి నిర్మించడం అదేదో అయిపోయిందిలే అనుకునే వాళ్లకు కనువిప్పు. ప్రాణ ప్రతిష్టకు ముందు మోడీ పదకొండు రోజుల నుంచి ఉపవాస దీక్ష చేయడం మీడియాలో సవివరంగా ప్రసారమైంది. ఎ.పి లో లేపాక్షి, తమిళనాడులో రామేశ్వరం సహా దక్షిణాదిలో రామాయణ కథలతో ముడిపడిన ప్రదేశాలను ప్రధాని అధికార హోదాలోనే సందర్శించి వివరాలు విడుదల చేశారు. ఆ విధంగా ఉత్తర దక్షిణ భారతాల మధ్య బిజెపి ఒక మత సేతువును కట్టే వ్యూహాత్మక ప్రయత్నం చేసింది. వీటన్నిటి తర్వాత రిపబ్లిక్‌ దినోత్సవ పెరేడ్‌లో ఉత్తర ప్రదేశ్‌ శకటం రామమందిర ఇతివృత్తంతో సాగింది. మోడీ రాజకీయాలను గతంలో మోడిఫికేషన్‌ అనటం కద్దు. ఆయన మొదటి దఫాలో అయోధ్య ప్రధాన అస్త్రంగా తీసుకోలేదు. రెండవసారి గెలిచాక కొన్నాళ్లకే సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు రావడం, తర్వాత కొన్నాళ్లకే కాశ్మీర్‌లో 370 అధికరణం రద్దు చేయడం కీలకాంశాలయ్యాయి. ఈ నాటికి రామమందిరం 2024 ఎన్నికల ఎజెండాగా మార్చబడుతున్నది. ఇదంతా ఒక క్రమపద్ధతిలో వ్యూహాత్మకంగా నడుస్తున్న రాజకీయమే తప్ప యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే సమాంతరంగా బిజెపి ఎన్నికల సన్నాహాలు నడుస్తున్నాయి. హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం తెలంగాణ సందర్శనకు వస్తున్నారు. ఎ.పి లోనూ టిడిపి, జనసేన కూటమిలోకి బిజెపి వస్తుందనే కథనాలు బలంగా వున్నాయి. తాజాగా పవన్‌ టిడిపిపై చేసిన వ్యాఖ్యానాల వెనక కూడా బిజెపి హస్తం వుందని ఆ పార్టీల వారే చెబుతున్నారు. వీటన్నిటి వెనక వ్యూహం ఎటు పోతున్నదో త్వరలోనే స్పష్టం అవుతుంది. దీన్ని ఇంగ్లీషు పదంతో రామిఫికేషన్‌ అంటున్నారు. అంటే ఒక విధాన ప్రతిధ్వనులు.

పోస్ట్‌ పోల్‌ అవగాహనే…

జాతీయ రాజకీయాలకు వస్తే బిజెపికి వ్యతిరేకంగా ఏర్పడిన ‘ఇండియా’ వేదిక ఈ వారం అనేక ఒడుదుడుకులు చూసింది. ఎన్నికల తర్వాత మాత్రమే (పోస్ట్‌ పోల్‌) అవగాహన సాధ్యమని సీతారాం ఏచూరి వంటి సీనియర్‌ నాయకులు ముందే చెప్పిన మాటల సత్యం ఎంతో అందరికీ అనుభవంలోకి వస్తున్నది. బెంగాల్‌ ముఖ్యమంత్రి, టిఎంసి నేత మమతా బెనర్జీ కాంగ్రెస్‌కు తలుపులు మూయడం కూడా సిపిఎం వైఖరి సరైందని నిరూపించింది. ఎందుకంటే టిఎంసితో పొత్తు ప్రసక్తి వుండదని సిపిఎం ఎప్పుడూ చెబుతూనే వచ్చింది. పంజాబ్‌లో ఆప్‌ కూడా అన్ని సీట్లు తనే పోటీ చేస్తానని ప్రకటించింది. యు.పి లో సమాజ్‌వాది పార్టీకి, కాంగ్రెస్‌కు గతంలోనే కుదిరింది లేకపోగా ఇప్పుడు దూరం పెరిగింది. బిఎస్‌పి మాయావతి ఎటూ ఒంటరిగానే అంటున్న స్థితి. బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ రాజకీయ పిల్లిమొగ్గలు వీటన్నిటినీ మించి పోయాయి. అయిదోసారి ఆయన యూ టర్న్‌ తీసుకుని బిజెపితో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే సూచనలు బలంగా వున్నాయి. మహారాష్ట్ర శివసేన కూడా ముక్కలైపోయి ప్రధాన భాగం బిజెపితో కలిసి ప్రయాణిస్తున్నది. ఈ పరిణామాలు లౌకిక శిబిరానికి నష్టం చేసేవి. అయితే దక్షిణాదిన మాత్రం బిజెపి పెరిగే సూచనలు ఆ స్థాయిలో కనిపించడం లేదు. అంత మాత్రాన ఆ మతోన్మాద రాజకీయాల ప్రభావాన్ని ఉపేక్షించడం కూడా పొరబాటే అవుతుంది. తెలుగు నాట ప్రాంతీయ పార్టీలన్నీ బిజెపి పట్ల అనుకూలత పాటిస్తున్న రీత్యా ఇది మరింత అవసరం. కానీ దాన్ని మరో కొసకు తీసుకెళ్లి బిజెపికి తిరుగేలేదు గనక లోబడిపోవడమే మేలని అనేక పాలక పార్టీలూ మీడియా సంస్థలూ వాదించడం అర్థరహితం.

బిజెపికీ సందేహాలు

నిజానికి అయోధ్య లేకుండా తను నెట్టుకు రాలేనని బిజెపి భావించడం, భయపడటం వల్లనే దాన్ని త్వరగా పూర్తి చేసి ప్రారంభించారు. మోడీ గొప్పను చెబుతూనే రాముణ్ని ఎన్నికల సాధనంగా వాడుకోవాలనుకుంటున్నారు. ఇందులో వ్యూహంతో పాటు బలహీనతా కనిపిస్తుంది. బిజెపి ఎంత ఆరాటపడినా దేశంలో చాలా పార్టీలు దాని నాయకత్వంలో జరిగే ఈ ఉత్సవానికి హాజరవడానికి నిరాకరించాయి. ఇది మన మీడియా రాజకీయంగా చూపిస్తుందే గాని సానుకూల కోణాన్ని చెప్పదు. వామపక్షేతర పార్టీలు కూడా రామాలయం మీ స్వంత వ్యవహారం కాదని చెప్పగలిగాయంటే ఈ దేశంలో బలమైన లౌకిక సంప్రదాయాల పునాది తెలుస్తుంది. గుళ్లూ యజ్ఞయాగాదులతో గెలవగలమనుకున్న ప్రాంతీయ పార్టీల నేతలూ దెబ్బతిన్నారు. బిజెపితో అనుకూలంగా వున్నారనే ఆరోపణలకు ఆస్కారమిచ్చిన బిఆర్‌ఎస్‌ కూడా ఓడిపోయింది. దక్షిణాన ఇతర చోట్ల కన్నా మతాల, మఠాల ప్రభావం ఎక్కువగా వుండే కర్ణాటకలోనూ గెలవలేకపోయింది. గతంలోనూ మొన్న ఎన్నికల్లోనూ గెలిచిన రాష్ట్రాలలో కూడా బిజెపి బలం క్షీణించింది. ఉదాహరణకు మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో బిజెపికి 59, కాంగ్రెస్‌కు 5 స్థానాలుండేవి. మొన్నటి సారి కాంగ్రెస్‌ ఓడిపోయినా సరే ఆ ఓట్ల లెక్కన చూస్తే బిజెపికి 35, కాంగ్రెస్‌కు 29 రావచ్చని అంచనా. అచ్చగా ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ జరిగే రాష్ట్రాలలోనూ పరిస్థితి వేరుగా వుంటుంది. ఈ కారణంగానే బిజెపి ఒకటికి పదిసార్లు సమావేశాలు జరుపుతూ సన్నాహాలంటూ హడావుడి చేస్తున్నది. చిన్న చిన్న పార్టీల నుంచి కూడా సీట్లు లేనివారిని కూడా వెంటపడి చేర్చుకుంటున్నది. మొత్తంపైన 2019తో పోలిస్తే బిజెపికి 90 స్థానాల దాకా కొరత రావచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే చివరగా చెప్పాలంటే బిజెపి మతోన్మాద రాజకీయాలను గట్టిగా ఎదుర్కొని నిలవరించాలనడంలో సందేహం లేదు. కానీ దాని విజయమేదో ఖాయమైనట్టు ఎవరైనా తలవంచక తప్పదన్నట్టు టిడిపి, వైసిపి వంటి పార్టీలు కాని మీడియా సంస్థలు, వ్యక్తులు గాని చెబితే తప్పక తోసిపుచ్చాలి. లౌకికతత్వం కోసం, మత సామరస్యం కోసం విస్తారమైన కృషిని నిరంతరాయంగా కొనసాగించాలి.

  • తెలకపల్లి రవి
➡️