ధరాభారం

దేశ వ్యాప్తంగా ప్రజానీకం ఎన్నికల హడావిడిలో మునిగిఉన్న వేళ కేంద్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా భారీ భారాన్ని మోపింది. కౌంటింగ్‌ కూడా జరగక ముందే కేంద్రం మోపిన ఈ భారాన్ని అత్యధికమంది ప్రజానీకం గుర్తించనే లేదు. జేబులు ఖాళీ కావడం ప్రారంభమైన తరువాతే అత్యధికులు ఈ భారాన్ని గుర్తించారు. ఇటువంటి వంచనా విన్యాసాలు నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వానికి కొత్తేమీ కాదు. గతంలో కూడా ఈ తరహా అనుభవాలు ముఖ్యంగా పెట్రో ఉత్పత్తుల ధరల విషయలో దేశ ప్రజానీకానికి ఉన్నాయి. ఎప్పటికప్పుడు మోసపు మాటలతో ప్రజానీకాన్ని మభ్య పెట్టే మోడీ ప్రభుత్వం ఈ సారి కూడా అటువంటి పనికే తెగబడింది. లోక్‌సభకు ఏడు విడతల పోలింగ్‌ ప్రక్రియ జూన్‌ ఒకటవ తేదీన ముగిసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే (జూన్‌ 2) దేశ వ్యాప్తంగా టోల్‌ ఛార్జీలను పెంచింది. అదే రోజు దేశ వ్యాప్తంగా అమూల్‌, మదర్‌ డెయిరీ సంస్థలు పాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ రెండూ ప్రభుత్వ నియంత్రణలో ఉండే సంస్థలే కావడం గమనార్హం. ఈ సంస్థలు ధరల పెంపునకు సంబంధించి ప్రతిపాదనలు ఇచ్చి కొన్ని నెలలైనట్లు సమాచారం. ఇంత కాలం ఆ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు పక్కన పెట్టిందో, పోలింగ్‌ ప్రక్రియ ముగిసీ, ముగియగానే ఎందుకు అనుమతించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
టోల్‌ ఫీజుల సవరణకు సంబంధించిన నిర్ణయం వార్షిక ప్రాతిపదికన జరుగుతుంది. ఈ ఏడాది కూడా దానికి సంబంధించిన ప్రతిపాదనలను గత డిసెంబర్‌, జనవరి నెలల్లోనే నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఎఐ) కేంద్ర ప్రభుత్వానికి అందచేసింది. నూతన ఆర్థిక సంవత్సరంలో మొదటిరోజైన ఏప్రిల్‌ ఒకటి నుండి ఈ ప్రతిపాదనలు అమలులోకి రావాల్సి ఉంది. ఎన్నికల సమయం కావడంతో ఆ ప్రతిపాదనలకు తాత్కాలికంగా నిలుపుదల చేసిన కేంద్ర ప్రభుత్వం పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన మరుసటి రోజు నుండే పెంపునకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న 855 టోల్‌ప్లాజాల్లో సగటున 5 శాతం టోల్‌ఫీజు పెరిగింది. ఈ పెంపునకు సంబంధించిన ముందస్తు సమాచారం ఏమాత్రం లేకపోవడంతో అనేక చోట్ల వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కున్నట్లు వార్తలు వచ్చాయి. కనీసం 5 రూపాయల నుండి 20 రూపాయల వరకు రోజువారీ ప్రయాణీకులపైనా, నెల పాస్‌లున్న వారికి రూ100 నుండి 400 రూపాయల వరకు భారం పడినట్లు వార్తలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ చేపట్టిన ఏడు పనుల్లో 7.50 లక్షల కోట్ల రూపాయల మేర అవకతవకలు చోటుచేసుకున్నట్లు గత ఏడాది కాగ్‌ ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ఆ నివేదికలోని అంశాలపై ఇంతవరకు నామమాత్రపు చర్యలు కూడా తీసుకోని కేంద్ర ప్రభుత్వం టోల్‌ ఫీజుల పెంపునకు మాత్రం అనుమతిచ్చింది.
పాల ధరల పెంపు విషయంలోనూ ఇంతే. అన్ని రకాల పాలపై లీటరకు రెండు రూపాయల వంతున పెంచుకోవడానికి అమూల్‌, మదర్‌ డెయిరీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో ఉత్పత్తి ఖర్చు పెరగుతోందని, ఫలితంగా ధరలు పెంచాల్సి వస్తోందని ఈ సంస్థలు ప్రభుత్వానికి నివేదించాయి. నెలల తరబడి దేశవ్యాప్తంగా చేసిన ఎన్నికల ప్రచారంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచామని, ధరలను నియంత్రించామని కేంద్ర మంత్రులు చేసిన ప్రచారానికి ఇది విరుద్ధం కావడం గమనార్హం. పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన వెంటనే ధరల పెంపునకు అనుమతివ్వడంతో కేంద్ర ప్రభుత్వ పెద్దల మాటల్లోని అసలు నిజం బట్టబయలైంది. 2022లో అమూల్‌ సంస్థ మూడు సార్లు ధరలను పెంచింది. అదే సంవత్సరం మార్చి డిసెంబర్‌ నెలల మధ్య మదర్‌ డెయిరీ దఫ దఫాలుగా లీటర్‌కు పది రూపాయాలు పెంచింది. ఎన్నికల ఏడాది కావడంతో 2023లో ఎటువంటి పెంపు చేయని కేంద్ర ప్రభుత్వం ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే బాదుడు ప్రారంభించింది. ఏరు దాటాక తెప్ప తగలేయడం మోడీ సర్కారుకు కొత్తేమీ కాదు. అందుకే ప్రజలు ఎన్నికల్లో కర్ర కాల్చి వాతపెట్టినట్టు తీర్పిచ్చారు. దీని నుంచైనా బిజెపి ప్రభుత్వం ఏమైనా నేర్చుకుంటుందేమో చూడాలి. లేని పక్షంలో ప్రతిఘటనకు సిద్ధం కావడమే ప్రజానీకం ముందున్న మార్గం.

➡️