చెంపపెట్టు

editorial on supreme court verdict on electoral bonds

ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, వాటి జారీని తక్షణం నిలిపివేయాలని బ్యాంకులను ఆదేశిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు మోడీ ప్రభుత్వానికి, బిజెపికి చెంపపెట్టు. కార్పొరేట్లకు దోచిపెట్టి అందుకు ప్రతిఫలంగా వారి నుంచి భారీగా నిధులు సమకూర్చుకొని రాజకీయాలను శాసించాలనుకున్న బిజెపికి సుప్రీం తీర్పుతో కొంతైనా అడ్డుకట్ట పడుతుంది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, నిష్కళంక, పారదర్శక రాజకీయాలు కోరుకునే ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిన తీర్పిది. పాలక పార్టీ, కార్పొరేట్ల నడుమ ‘నీకిది నాకిది’ తరహాలో క్విడ్‌ప్రోకోకు ఎలక్టోరల్‌ బాండ్ల స్కీం దారి తీస్తుందన్నవారి ఆందోళనలను, వాదనలను సుప్రీం సమర్ధించింది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. ఎటువంటి వివరాలూ తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడమంటే సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనంది. నల్లధనాన్ని అరికట్టేందుకు, పారదర్శకత కోసం ఈ స్కీం తెచ్చామన్న బిజెపి ప్రభుత్వ కుతర్కాన్ని తోసిపారేసింది. రాజకీయ పార్టీలకు రహస్యంగా అపరిమిత విరాళాలకు అనుమతిస్తూ కంపెనీల చట్టంలో చేసిన సవరణ ఏకపక్షమనీ తప్పుబట్టింది. బాండ్ల ద్వారా సేకరించే విరాళాల వివరాలను బహిర్గతం చేయాల్సిందేనని సుప్రీం నొక్కి వక్కాణించింది. ఇప్పటి వరకు జారీ చేసిన బాండ్ల వివరాలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) మార్చి 6 లోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని, ఆ వివరాలను 13 లోగా వెబ్‌సైట్‌లో ఇ.సి ప్రచురించాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఆర్‌టిఐ, ఐ.టి చట్టాలకు విరుద్ధంగా, కంపెనీల చట్టంలో ఏకపక్ష సవరణలతో ఎన్నికల బాండ్ల పథకాన్ని మోడీ సర్కారు ఎందుకు తీసుకొచ్చిందో ఈ కాలంలో బిజెపి జేబులోకి చేరిన అజ్ఞాత కార్పొరేట్ల విరాళాల వరదే చెబుతుంది. 2018 జనవరి నుంచి స్కీంను అమల్లోకి తెచ్చారు. ఎన్నికల బాండ్‌ అంటే ఒక విధంగా ప్రాంసరీ నోటు వంటిది. నిర్దిష్ట సమయాల్లో వాటిని బ్యాంకులు జారీ చేస్తాయి. బాండ్లను వ్యక్తులు, కంపెనీలు కొనుగోలు చేసి తమకు నచ్చిన రాజకీయపార్టీలకు విరాళంగా అందిస్తాయి. వాటిని పార్టీలు నగదుగా మార్చుకొని ఎన్నికలకు, పార్టీ కార్యకలాపాలకు ఉపయోగపెట్టుకుంటాయి. అయితే ఎవరు విరాళాలిచ్చారో బహిర్గతపర్చనవసరం లేదు. 2017-18 నుంచి 2022-23 వరకు దాదాపు 30 తడవల్లో 28 వేల బాండ్లను ఎస్‌బిఐ జారీ చేసింది. వాటి విలువ రూ.16,500 కోట్లకు పైమాటే. వాటిలో రూ.6,500 కోట్లు బిజెపి గల్లాపెట్టెలో పడ్డాయి. 2018-19, 2019-20 లలో 70-80 శాతం విరాళాలు బిజెపి ఖాతాకు చేరాయంటే, కార్పొరేట్లకు ఆ పార్టీకి మధ్య పెనవేసుకున్న మైత్రి బంధం తీవ్రత అవగతమవుతుంది.

ఎలక్టోరల్‌ బాండ్లు రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేసేందుకేనని పర్యవసానాలబట్టి తెలుస్తోంది. ఎన్నికల నిధి సేకరణలో పెద్ద ఎత్తున గోప్యతతో కూడిన, పారదర్శకత లేని పద్ధతులకు బిజెపి ప్రభుత్వం తెరతీసిందని స్కీం వచ్చినప్పుడే సిపిఎం, పలు ప్రతిపక్ష పార్టీలు, ఎ.డి.ఆర్‌ వంటి సంస్థలు నిరసించాయి. సుప్రీం కోర్టులో సవాల్‌ చేశాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ముంగిట బాండ్ల జారీ ప్రారంభానికి లోపే విచారణ పూర్తి చేయాలని విన్నవించిన మీదట కోర్టు గతేడాది అక్టోబర్‌లో విచారణ ముగించి తీర్పు రిజర్వ్‌ చేసింది. గురువారం తీర్పు వెలువరించింది. కార్పొరేట్లు అందించిన రాజకీయ నిధులకు బదులుగా రాయితీలు కట్టబెట్టడం మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం. ఇది ఆశ్రిత పెట్టుబడిదారీ లక్షణం. తొమ్మిదిన్నరేళ్లలో కార్పొరేట్లు బ్యాంకుల్లో తీసుకున్న రూ.14 లక్షల కోట్ల రుణాలను మోడీ సర్కారు రద్దు చేసింది. కార్పొరేట్‌ పన్నులో రూ.లక్షల కోట్ల సబ్సిడీలిచ్చింది. సహజ వనరులను, ప్రభుత్వరంగ సంస్థలను అప్పనంగా అప్పగించింది. స్వేచ్ఛాయుతమైన న్యాయబద్ధమైన ఎన్నికలకు హామీ కల్పించే విధంగా అభ్యర్ధులందరూ సమాన స్థాయిలో పోటీ పడాలనే సూత్రాన్ని ఈ విధంగా లభించిన ధనబలంతో బిజెపి వమ్ము చేస్తోంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఎన్నికల సంస్కరణలు అవశ్యమన్న డిమాండ్‌ బలంగా ముందుకొస్తోంది. ఎన్నికల సంస్కరణలే ప్రజాస్వామ్యానికి రక్ష.

➡️