ఎన్నికల బాండ్లు : ఎస్‌బిఐ హాస్యాస్పద వైఖరి

ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమైనదని, ఏకపక్షంగా వుందని పేర్కొంటూ భారత అత్యున్నత న్యాయస్థానం ఆ పథకాన్ని రద్దు చేసింది. రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేసేందుకే బిజెపి ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని రూపొందించిన వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ తీర్పు మోడీ ప్రభుత్వానికి రుచించదు.
ఈ తీర్పు అమలును దెబ్బ తీసేందుకు ఎస్‌బిఐ ద్వారా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2019 ఏప్రిల్‌ నుండి కొనుగోలు చేసిన ఎన్నికల బాండ్ల వివరాలన్నింటినీ తప్పనిసరిగా బహిర్గతం చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. బాండ్లను కొనుగోలు చేసిన వివరాలు, కొనుగోలు చేసిన వ్యక్తి పేరు, బాండ్ల విలువ వంటి వివరాలను అందచేయాలని కోరింది. ఇందుకు గానూ, మార్చి 6వ తేదీకల్లా ఎన్నికల కమిషన్‌కు సంబంధిత వివరాలను అందచేయాలని ఎన్నికల బాండ్ల లావాదేవీలకు సంబంధించిన ఏకైక సంస్థ అయిన ఎస్‌బిఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత ఆ వివరాలన్నింటినీ మార్చి 13కల్లా ఎన్నికల కమిషన్‌కు వెల్లడించాలని కోరింది.
అయితే ఈ ఎన్నికల బాండ్ల లావాదేవీలకు సంబంధించిన వివరాలను వెల్లడించడానికి మరికొంత సమయం కావాలంటూ ఎస్‌బిఐ మార్చి 4వ తేదీన సుప్రీంను ఆశ్రయించింది. జూన్‌ 30 వరకు గడువు కావాలని కోరింది. అంటే చెప్పిన పని పూర్తి చేయాలంటే ఎస్‌బిఐకి సుప్రీంకోర్టు ఇచ్చిన 21 రోజుల గడువుకు బదులుగా మరో 116 రోజులు కావాలని పేర్కొంది. అంటే… లోక్‌సభ ఎన్నికలయ్యే వరకు ప్రజలు ఎన్నికల బాండ్ల వివరాలను తెలుసుకోకుండా చేయాలన్నదే దాని ఉద్దేశం.
ఎస్‌బిఐ చేసిన విజ్ఞప్తిపై సర్వత్రా విమర్శలు, ఖండనలు వెల్లువెత్తాయి. ఎస్‌బిఐ కార్యకలాపాలన్నింటినీ డిజిటలైజ్‌ చేసింది. ఎస్‌బిఐ ఇచ్చిన ఆర్‌టిఐ సమాధానం ప్రకారం చూస్తే, ఎన్నికల బాండ్ల లావాదేవీలను చేపట్టేందుకే రూ.1,50,15,33 ఖర్చు చేయగా అందులో ఐ.టి వ్యవస్థల అభివృద్ధి కోసమే రూ.60,43,005 ఖర్చు చేసింది. ఎన్నికల బాండ్ల పథకం కోసం ఐ.టి వ్యవస్థ అభివృద్ధికి రూ.60 లక్షలను ఖర్చు పెట్టినట్లైతే ఎన్నికల బాండ్లకు సంబంధించిన కొన్ని రికార్డులను డిజిటలైజ్‌ చేయలేదని, వాటిని రాతపూర్వకంగా సీల్డ్‌ కవర్లలో ముంబయి హెడ్‌క్వార్టర్స్‌లో భద్రపరిచామని ఎస్‌బిఐ ఎలా చెబుతోంది?
ఎస్‌బిఐ డిజిటలైజ్‌ చేయబడిన బ్రాంచిలో ఏ వ్యక్తి లేదా సంస్థ బాండ్‌ను కొనుగోలు చేసినా వెంటనే అది డిజిటల్‌గానే నమోదవుతుంది. బేరర్‌ బాండ్‌ను మరే ఇతర ఎస్‌బిఐ బ్రాంచీల్లోనైనా డిపాజిట్‌ చేయవచ్చు. దానికి కూడా డిజిటల్‌ రికార్డు వుంటుంది. ఎస్‌బిఐ జారీ చేసే బాండ్‌కు రహస్య ఆల్ఫా న్యూమరిక్‌ కోడ్‌ ఎలా వుంటుందో చూపించేలా 2019 లోనే ‘హఫ్‌ పోస్ట్‌-ఇండియా’లో నితిన్‌ సేథీ రాశారు. బాండ్‌ను ఎవరు కొనుగోలు చేశారు, ఏ పార్టీకి విరాళంగా ఇచ్చారో వివరాలు తెలుసుకునేందుకు ఈ కోడ్‌ను ఉపయోగించవచ్చు.
ఒకవేళ కొన్ని రికార్డులను రాతపూర్వకంగా భద్రపరిచారనుకున్నా 21 రోజుల వ్యవధిలో 22,217 ఎన్నికల బాండ్లను లెక్కించలేకపోయారని నమ్మడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదు. దీనికోసం ఎస్‌బిఐ చేయాల్సిందల్లా అదనపు సిబ్బందిని నియమించుకోవడమే.
అందువల్ల, ఎస్‌బిఐ కేవలం కుంటి సాకులు, బూటకపు కారణాలు చెప్పిందన్న విషయం స్పష్టమవుతోంది. పైగా ఇదంతా కూడా సుప్రీం కోర్టు వివేకాన్ని అవమానపరచడమే కాగలదు. పైగా మార్చి 6కి కేవలం ఒకే ఒక్క రోజు ముందుగా ఎస్‌బిఐ కోర్టును ఆశ్రయించిందంటేనే కచ్చితంగా గడువు ముగిసిపోతుందనడంలో దాని దురుద్దేశ్యం స్పష్టమవుతోంది.
ఇప్పటివరకు జారీ చేసిన, ఉపయోగించుకున్న ఎన్నికల బాండ్ల వివరాలు ప్రచురితం కాకుండా అడ్డుకోవడానికి మోడీ ప్రభుత్వానికి, పాలక బిజెపికి అనేక కారణాలు వున్నాయి. పైగా పరస్పరం ఇచ్చి పుచ్చుకునేందుకు వెసులుబాటు కల్పించేలా ఈ పథకాన్ని రూపొందించారంటూ కోర్టే స్వయంగా వ్యాఖ్యానించింది కూడా. బిజెపి అందుకున్న రూ.6565 కోట్ల విలువ చేసే బాండ్ల వివరాలు బయటకు వస్తే, ఏ పెట్టుబడిదారుడు లేదా కంపెనీ ఆ బాండ్లను విరాళంగా ఇచ్చిందో తెలిసిపోతుంది. విరాళానికి ఫలితంగా ఆ సంస్థ లేదా వ్యక్తికి లబ్ధి చేకూర్చేలా చేసిన పనులు లేదా విధానాలేంటో కూడా వెల్లడైపోతాయి.
బిజెపి అందుకున్న ఎన్నికల బాండ్ల వివరాలను ప్రచురించడం వల్ల బహిర్గతమయ్యే కోణం మరొకటి వుంటుంది. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బిజెపికి దాదాపు రూ.335 కోట్లు కార్పొరేట్‌ విరాళంగా (ఎన్నికల బాండ్ల ద్వారా కాదు) ఇచ్చిన కంపెనీలు కనీసం 30 వున్నాయని న్యూస్‌ లాండ్రీ, ది న్యూస్‌ మినిట్‌లు ఇటీవల జరిపిన అధ్యయనం వెల్లడించింది. ఇదే కాలంలో ఈ 30 కంపెనీలు కేంద్ర దర్యాప్తు సంస్థల నుండి దర్యాప్తులను, చర్యలను ఎదుర్కొన్నాయి. వీటిల్లో, 23 కంపెనీలు 2014 నుండి ఇ.డి లేదా ఐ.టి విభాగాలు చర్యలు తీసుకున్న సంవత్సరం వరకు ఏనాడూ బిజెపికి ఒక్క పైసా కూడా విరాళమివ్వలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఒకసారి వచ్చి వెళ్ళిన నాలుగు మాసాల వ్యవధిలోనే నాలుగు కంపెనీలు రూ.9.05 కోట్లు విరాళంగా ఇచ్చాయి. బిజెపికి అప్పటికే విరాళమిచ్చిన ఆరు సంస్థలు తమ కంపెనీలపై దర్యాప్తుల నేపథ్యంలో మరింత పెద్ద మొత్తాలు అందచేశాయని ఆ వార్తా సంస్థల అధ్యయనంలో వెల్లడైంది.
బిజెపి కోసం నిధులను బలవంతంగా వసూలు చేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఏ రీతిన ఉపయోగించు కుంటున్నారో చెప్పడానికి ఇదొక స్పష్టమైన రుజువు. ఒకసారి ఎన్నికల బాండ్ల వివరాలు బయటకు వస్తే, ముడుపులు తీసుకుని అవినీతికి పాల్పడినందుకు ప్రతిగా ఏమిచ్చారో నిర్ధారణ అవుతుంది. కేంద్ర దర్యాప్తు సంస్థల బలవంతపు చర్యలు, బ్లాక్‌మెయిలింగ్‌ ఎత్తుగడల ద్వారా నిధులు ఎలా వసూలు చేస్తున్నారో తెలిసిపోతుంది.
మార్చి 6 వరకు సుప్రీం కోర్టు, ఎస్‌బిఐ పిటిషన్‌ను విచారణ నిమిత్తం స్వీకరించలేదు. గడువును ఎగవేసే ఇటువంటి ఎత్తుగడలు, ఉపాయాలను కోర్టు అనుమతించరాదు. ఎస్‌బిఐ అభ్యర్ధనపై ఎప్పుడు విచారణ చేపట్టినా స్వల్ప వ్యవధి ఇచ్చి, వెంటనే దాన్ని పాటించడానికి తక్షణమే గడువు విధించాలి.

(‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

➡️