ఫ్యామిలీ మ్యాన్‌

Apr 19,2024 05:20 #Articles, #edit page

పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైనుంచి శవాన్ని తీసి భుజాన వేసుకుని స్మశానం వైపు నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు, ఒక్కసారిగా ఒళ్లు విరుచుకుని చుట్టూ తేరిపారజూసి, ‘రాజా, నీ పట్టుదల నాకెంతో ముచ్చటగా వుంది. ఒక్కోసారి మనం చేసే మాయలన్నీ జనాలకు ఇట్టే తెలిసిపోతుంటాయి. దొంగ పిల్లి పాలు తాగుతూ… తననెవరూ చూడట్లేదనుకుంటుందిట. అలాంటి కథ ఒకటి చెప్తా… విను’ అంటూ మొదలు పెట్టాడు.
”సింధియా అనే దేశాన్ని కాషాయం పార్టీ ఏలుతోంది. సింధియాని హిందియాగా మార్చేయాలన్న టార్గెట్‌తో పుట్టిన పార్టీ అది. అయితే ఈ విషయం జనాలకు తెలీకుండా మేనేజ్‌ చేయడానికి జేడీ అనే బ్రహ్మచారిని ఆ పార్టీ రంగంలోకి దింపింది. ఆయన ‘అసలు పేదలకు సేవ చేయడానికే తాను పుట్టానని, తాను బ్రహ్మచారినని, ఆస్తులు, అంతస్తులు తనకక్కరలేదని’ సొంత మైక్‌తో జనాల బుర్రల్లోకి బలవంతానా చొప్పించే ప్రయత్నం చేస్తుంటాడు.
అందులో భాగంగానే పేద ప్రజలందరికీ ఉచితంగా రేషన్‌ అన్నాడు. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే కార్పొరేట్ల మీద పన్నులు తగ్గించి, వాళ్ల కోట్లాది రూపాయల బకాయిలన్నీ ఎత్తేశాడు. తనకు తాను అభినవ శ్రీరాముడిలా భావిస్తుంటారు.
పేదలేమో ఉచిత బియ్యం మోజులో పడితే, కార్పొరేట్లేమో దోచుకునే పనిలో పడ్డారు. జేడీతో చెట్టా పట్టాలేసుకు తిరుగుతున్నారు. ఈయనేమో కాషాయం కట్టుకొని గుళ్లూ గోపురాలంటూ తిరుగుతున్నాడు. జెడీగారి సొంత మైక్‌లో కోట్ల విలువ చేసే ఆయన డ్రెస్‌ల గురించి, ఆయన తినే ఖరీదైన తిండి గురించి, ఆయన సింప్లిసిటీ గురించి కథలు కథలుగా ప్రచారం చేస్తున్నారు.
అయితే, జేడీ గారు మాత్రం…తన మనసులో మాట కార్యక్రమంలో ‘తనకసలు ఫ్యామీలీయే లేదని, తాను ఒంటరివాడినని, బ్రహ్మచారినని… ఈ డబ్బూ, విలాసాలు నాకెందుకు, నేను చారు అమ్ముకుని పైకొచ్చినవాడిని’ కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశాడు. ఇంతకీ నిజమేంటి? నువ్వేమనుకుంటున్నావు?’ అన్నాడు బేతాళుడు.
‘నేను మాట్లాడను’ అన్నట్టుగా తన నోటికేసి వేలు పెట్టి చూపించాడు విక్రమార్కుడు.
‘ఓకె ఓకె. సమాధానం కూడా నేనే చెప్తా విను. పూట గడపడానికే అష్టకష్టాలు పడే పేదలకు జేడీని పట్టించుకునే తీరిక లేదు. డబ్బున్నోళ్ళు ప్రభుత్వంతో అసలు సున్నం పెట్టుకోరు. వచ్చిన చిక్కల్లా తనను ప్రశ్నించేవారితోనే. వీళ్లపైకి సిబిఐ, ఈడీలను ప్రయోగిస్తున్నాడు. ప్రజల దృష్టిని మళ్లించి మరోసారి గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు’ అంటూ ఒక్క క్షణం ఊపిరి పీల్చుకున్నాడు బేతాళుడు.
డబ్బాలో రాళ్లేసి గిలకొట్టినట్టుగా వున్న బేతాళుడి కంఠధ్వనికి విక్రమార్కుడి చెవి దిబ్బడ వేసినట్లయింది. భుజమ్మీదున్న బేతాళుడిని జాగ్రత్తగా మరో భుజం మీదికి మార్చుకుని, దిమ్మెక్కిన చెవిని కాస్త రుద్దుకున్నాడు విక్రమార్కుడు.
‘రాజా… ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్‌ జాగ్రత్తగా విను. నిజానికి ‘నేను బ్రహ్మచారిని, నాకు ఫ్యామిలీ లేదు’ అని చెప్తున్న జేడీ మాటలు శుద్ధ అబద్దాలు. అతనికి పెళ్లయింది. భార్య వుంది. అంతేకాదు… ఆయనకు చాలా పెద్ద ఫ్యామిలీ కూడా వుంది. ఈ విషయం ఎవరికీ తెలియదని ఆయన అనుకుంటాడుగానీ… దేశమంతా తెలుసు.’
‘అవునా?’ అన్నట్టుగా చూశాడు విక్రమార్కుడు ఆశ్చర్యంగా…
‘అంత ఆశ్చర్యపోవడానికి ఏముంది రాజా…. కాస్త బుర్రపెట్టి ఆలోచించే ఎవరికైనా ఆయనో పెద్ద ఫ్యామిలీ మ్యాన్‌ తెలిసిపోతుంది. ఆయన చుట్టూ తిరిగే పెద్దపెద్ద కార్పొరేట్లతో పాటు…. మరీ ముఖ్యంగా అందానీ, అబానీలు ఆయన సొంత ఫ్యామిలీనే. అందుకే వాళ్లకు దేశ సంపదను దోచిపెడుతుంటాడు. రాజా… ఇప్పుడు చెప్పు. మన జేడీ గారికి ఫ్యామిలీ వుందా? లేదా? ఆయన ఫ్యామిలీమ్యాన్‌ అవునా? కాదా?… నిజం చెప్పు. నీకు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల వెయ్యి ముక్కలవుతుంది’ అన్నాడు బేతాళుడు.
‘ఓరి ఈడి శాడిజం తగలెయ్యా! ఇందులో పెద్ద తెలియకపోవడమేముంది. ఇది జగమెరిగిన సత్యం కదా… అయినా వీడితో ఏం చెబితే ఏం తంటానో అని తటపటాయిస్తూనే… ఈ విషయం నాకే కాదు… దేశమంతా తెలుసు’ అన్నాడు విక్రమార్కుడు.
విక్రమార్కుడు చెప్పిన సమాధానంతో… అతని భుజమ్మీద నుంచి మాయమై మళ్ళీ చెట్టెక్కాడు బేతాళుడు. దీంతో మళ్లీ తలపట్టుకుని కూర్చున్నాడు విక్రమార్కుడు.

– రాజాబాబు కంచర్ల
9490099231

➡️