మూర్ఖత్వం ఆవహిస్తే ఇలాగే !

Dec 8,2023 07:17 #Editorial

ఖుద్‌ గలత్‌ హోకర్‌ ఖుద్‌ కొ నహీ..!

సాబిత్‌ కర్‌నా ఇతనా ముష్కిల్‌ నహీ హోతా

జిత్‌నా సహీ, హోకర్‌, ఖుద్‌కొ సహీ.., సాబిత్‌ కర్‌నా-

             తప్పు చేసి, చేసిన పని సరైనదేనని నిరూపించుకోవడం ఏమంత కష్టమైన పనికాదు. సరైన పని చేసి, చేసింది సరైనదే అని నిరూపించుకోవడం. ఈ రోజుల్లో చాలా కష్టం!

‘ఇది భారత్‌! ఇండియా కాదు’ అని అంటాడొకడు. తాజ్‌మహల్‌ను తేజోమహల్‌ అని అంటానంటాడొకడు. అసలు యహుదీ..అనే పదమే తప్పు, దాన్ని యాదవ అని అనాలని అంటాడు ఇంకొకడు. ఇక భార్యను హత్య చేసి తత్త్వవేత్తగా మారిన వాడొకడు ఆస్ట్రేలియాను అస్త్రాలయా అని పిలవాలంటాడు. ఇంతమంది అపర మేథావులు ఈ దేశంలో పుట్టుకు రావడానికి మూల కారణం ఆరెస్సెస్‌ సంస్థ. అది ఎలాంటిదో, అది ఎన్నెన్ని ఘనకార్యాలు వెలగబెట్టిందో చూడండి. 1925లో ఆరెస్సెస్‌ స్థాపన జరిగింది.

1930 మార్చిలో ఉప్పు సత్యాగ్రహం జరిగినప్పుడు. అందులో ఆరెస్సెస్‌ పాల్గొనదని తేల్చి చెప్పాడు హెడ్గేవార్‌! పైగా 1940 డిసెంబర్‌లో బ్రిటీష్‌ వారి ‘ఇంపీరియల్‌ సివిల్‌ గార్డ్‌’లో చేరిన ఆరెస్సెస్‌…. వారికి భజన చేసింది. 1942 ఆగస్టులో క్విట్‌ ఇండియా ఉద్యమం ఊపందుకున్న ప్పుడు తాము అందులో పాల్గొనమని ఆరెస్సెస్‌ ప్రకటించింది. 1947 ఆగస్టులో దేశానికి స్వాతంత్య్రం లభించిన ప్పుడు, మువ్వన్నెల త్రివర్ణ పతాకాన్ని తాము జాతీయ జెండాగా గౌరవించేందుకు తిరస్కరించింది. చాలా కాలం వారు దాన్ని ఎగురేయలేదు. అదీ వారి దేశభక్తి! 1948 జనవరిలో గాంధీని చంపిందెవరు? ఆరెస్సెస్‌ కార్యకర్త గాడ్సేనే కదా? 1948 ఫిబ్రవరిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న సంస్థగా గుర్తించబడి ఆరెస్సెస్‌, భారత ప్రభుత్వ నిషేధానికి గురైంది. 1949 నవంబర్‌లో మనుస్మృతిని తప్పించి, అంబేద్కర్‌ రాసిన భారత రాజ్యాంగాన్ని ఒప్పుకోబోమని ఆరెస్సెస్‌ బహిరంగంగా ప్రకటించింది. 1951 ఫిబ్రవరిలో మహిళలకు సమాన హక్కులు ప్రసాదించే ‘హిందూ కోడ్‌ బిల్‌’ను ఆరెస్సెస్‌ వ్యతిరెేకించి దేశవ్యాప్త్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ఇవన్నీ నిశితంగా పరిశీలిస్తే ఏమనిపిస్తుంది?

చంద్రుడి ఉపరితలాన్ని ఇస్రో ఫొటోలు తీయగలుగుతుంది. కానీ మెదళ్లలోని మూర్ఖత్వాన్ని ఇంకా మనం ఫొటో తీయలేకపోతున్నాం. చంద్రయాన్‌-3 విజయవంతమైంది గనక, అక్కణ్ణించి దేవుణ్ణడిగి మాకు వర్షాలు ఎప్పుడు కురుస్తాయో అడిగి చెప్పాలని బీహార్‌కు చెందిన ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నాడు. సామాన్యుల్లో మూర్ఖత్వం ఉంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రముఖుల్లో ఉంటే దాన్ని ఏమనాలి? ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో ఒక డిజిపి రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేశాడు. హిందూ పంచాంగాన్ని అనుసరించి విధులు నిర్వహించాలన్న ఆదేశాలతో పాటు రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లకు పంచాంగాలు పంపిణీ చేశాడు. పోలీసులు పంచాంగాలు చూసుకుంటారు సరే. మరి దొంగలు, నేరగాళ్లు పంచాంగాల ప్రకారం నేరాలు చేయరు కదా? చంద్రయాన్‌-3 విజయవంతం కాగానే చంద్రుణ్ణి ‘హిందూదేశ్‌’గా ప్రకటించాలని చక్రపాణి అనే స్వామి ప్రకటించాడు. లోగడ చంద్రయాన్‌-2 కూలిపోయిన చోటుకు ‘తిరంగా పాయింట్‌’ అనీ, చంద్రయాన్‌-3 ల్యాండర్‌ విజయవంతంగా దిగిన చోటును ‘శివశక్తి’ అని మోడీ ప్రభుత్వం పేర్లు పెట్టింది. తొలిసారి చంద్రుడి మీదికి మతాన్ని చేర్చగలిగామని చంకలు గుద్దుకుంది. అలా ఇష్టం వచ్చిన పేర్లు పెట్టడానికి వీలుండదు. దానికి అంతర్జాతీయ ప్లానిటరీ బాడీ విధించిన నియమాలు, నిబంధనలూ కొన్ని ఉంటాయి. మూర్ఖత్వం వదులుకున్న వారికి మాత్రమే కదా విషయాలు అర్థమయ్యేదీ? చంద్రయాన్‌-3లో వెళ్లిన యాత్రికులకు సెల్యూట్‌ చేస్తున్నానని ప్రకటించాడొక బిజెపి మంత్రి. ఆస్ట్రనాట్స్‌ ఎవరూ వెళ్లలేదన్న విషయం కూడా ఆ మహాపురుషుడికి తెలియదన్నమాట !

కాంగ్రెస్‌ పాలనలో చైనా మన దేశపు 43,000 కి.మీ. భూమిని ఆక్రమించింది అని అన్నాడు బిజెపి అధ్యక్షుడు జె.పి.నడ్డా. భూమి చుట్టు కొలతే 40,075 కి.మీ. అయితే, అంత కన్నా ఎక్కువ భారత భూభాగాన్ని చైనా ఎలా ఆక్రమించిందీ? మన దేశపు మొత్తం భూ భాగం ఉన్నదే 32,87,263 చ.కి.మీ.లు చుట్టు కొలత కిలో మీటర్లలో చెపుతాం. విస్తీర్ణం చదరపు కిలో మీటర్లలో చెపుతాం. బిజెపి మేధావులు మెదళ్లుమూసుకుని, తమ కళ్లు తెరిచే ఉన్నాయని అనుకుంటారు. మహిళలు బట్టల్లేకపోయినా అందంగానే ఉంటారంటూ పతంజలి బాబా రామ్‌దేవ్‌ వ్యాఖ్యానించాడు. మహారాష్ట్ర మాజీ సిఎం ఫడ్నవీస్‌ భార్య పైన కూడా కామెంట్‌ చేశాడు. ఆమెకు వందేళ్ల వరకు ముసలితనం రాదని సర్టిఫికేట్‌ ఇచ్చాడు.

చంద్రయాన్‌-3ని కూడా కొందరు మోసగాళ్లు తమ స్వార్థానికి వాడుకుంటున్నారు. ఆ ప్రాజెక్ట్‌ విజయవంతం కావడానికి ‘రైస్‌ పుల్లింగ్‌’ కారణమనీ, అందుకు ఉపయోగించిన పాత్ర తమ వద్ద ఉందంటూ కొందరు ఓ హైదరాబాదు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నుంచి ఇరవై కోట్ల రూపాయలు కొట్టేశారు. అతను లబోదిబోమని మొత్తుకుని… పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేసి, నలుగురు నిందితుల్ని పట్టుకున్నారు. అణ్వాయుధాల్లోను,శాటిలైట్లలోనూ ఉపయోగించే రాగి చెంబు తమ వద్ద ఉందంటూ వారు జనాన్ని మోసం చేస్తున్నారని పోలీసులు స్కామ్‌ బయట పెట్టారు. మోసగాళ్లు చెప్పారు సరే మరి… అంత ధనవంతుడైన ఆ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి మెదడెందుకు పనిచేయలేదు ?

భార్య, భర్తకు కాళ్లు ఎందుకు నొక్కాలి? అనే విషయం మీద ఓ ప్రబుద్ధుడు ఇలా వివరణ ఇచ్చాడు. సంప్రదాయబద్దమైన ఆ వివరణ విని దైవభక్తులంతా ముచ్చట పడ్డారు. ”పురుషులకు కాలి వేళ్ల నుండి మోకాళ్ల వరకు ఉన్న భాగం శనిది. స్త్రీల చేతి వేళ్ల కొసల నుండి అరచేయి వరకు ఉన్నభాగం శుక్రుడిది. భార్య, భర్త కాళ్లు పట్టడం ద్వారా శనిపై శుక్రుడి ప్రభావం పడి ఆ ఇంట ధన ప్రాప్తి కలుగుతుంది!” చాలా పకడ్భందీగా సమాధానం కూర్చుకున్నారు గానీ, శనినీ, శుక్రుణ్ణీ నమ్మేదెవరు? అందుకే ఎవరో సరిగ్గానే చెప్పారు. ”పురుషులు పురుషులకోసం ఏర్పరచుకున్నవే ఈ మతాలన్నీ” అని! ఈ మధ్య మహిళా ప్రవచనకారిణులు కూడా పెరిగిపోయారు. అలాంటావిడ ఇలా చెప్పింది. భర్త, భార్యను ‘ఒసేరు’ అని పిలవడంలో ఎంతో గౌరవ ముందట! ఒసేరు అంటే.. ఇంటి యజమానురాలా అని అర్థమట. అలాగైతే.. ఆ వీధిలో పోయేవాళ్లంతా ఈ విషయం చెప్పిన వారిని ఒసేరు …అని పిలుచుకుంటూ పోతే సరి! ఆమెకు బోలెడంత గౌరవం దక్కుతుంది కదా ?

న్యూయార్క్‌ స్టేట్‌లో జరిగిన ఒక సంఘటన ఇలా ఉంది. 1820లో ఉత్తర న్యూయార్క్‌ స్టేట్‌లోని ఒక సరస్సు పక్కన ఒక మత బోధకురాలు ఉండేది. ఆమెకు అసంఖ్యాకంగా అనుచరగణం ఉండేది. ఆమె మీద వారికి ఎంతో విశ్వాసం. ఒకసారి ఆమె నీటి మీద నడుస్తానని ప్రకటించింది. నడవబోయే రోజూ, సమయం కూడా ప్రకటించింది. అంతే! ఆరోజుకు, ఆ సమయానికి లెక్కలేనంతమంది ఆ సరస్సు చుట్టూ చేరారు. ప్రకటించిన సమయానికి ఆ మత ప్రచారకురాలు అక్కడికి వచ్చింది. అనుచరుల్ని సంతృప్తిగా చూసుకుంది. నవ్వుతూ నాలుగు వైపులా చెయ్యి ఊపింది. అనుచర గణం ఉత్సాహంగా కేకలేసింది.మత ప్రచారకురాలు అక్కడి జనాన్ని ఉద్దేశించి బిగ్గరగా ఇలా అడిగింది. ”నేను ఈ సరస్సులోని నీటి మీద నడుస్తానని మీరు నమ్ముతున్నారా?” అని అంది. అనుచరులంతా ఏకకంఠంతో ‘అవునూ, అవునూ’ అని అరిచారు. ఉత్సాహంగా చప్పట్లు చరిచారు. ”అయితే సరే – మీకు ఆ నమ్మకం ఉండడమే ముఖ్యం! మీకు అంత నమ్మకం ఉన్నప్పుడు ఇక నేను నడవకపోయినా ఫరవాలేదు” అని మత ప్రచారకురాలు వెనక్కి తిరిగి వెళ్లిపోయింది! అనుచరులు కూడా నిరుత్సాహంగా వెళ్లిపోయారు. ఈ సంఘటన వల్ల మనకేం తెలుస్తోంది? విశ్వాసాన్ని బలపరుచుకోవడానికే మత ప్రచారకులు ప్రాధాన్యమిస్తారు తప్పించి, చెప్పింది చేసి చూపలేరు. ఇక నిజనిర్ధారణకు నిలదీయనివారే మత విశ్వాసకులవుతారు! పైగా తమకు తాము భక్తులమని మురిసిపోతుంటారు. మెదడు గుడ్డిదయినప్పుడు…ఇక అంతే!!

  • సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త (మెల్బోర్న్‌ నుంచి) డాక్టర్‌ దేవరాజు మహారాజు
    సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త (మెల్బోర్న్‌ నుంచి) డాక్టర్‌ దేవరాజు మహారాజు
➡️