అసమర్ధ పాలకులు-ఆగని కుంభకోణాలు

Jun 28,2024 05:05 #editpage

నూతన జాతీయ విద్యా విధానం ద్వారా ప్రపంచ స్థాయి విద్యను అందిస్తామంటున్న బిజెపి ప్రభుత్వం విద్యార్ధుల పట్ల తన ప్రాథమిక బాధ్యతను మరిచిపోతున్నది. భారత దేశంలో కాలేజి అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల సాధన అనేది 12 సంవత్సరాల పాటు విద్యార్ధులు చదివిన చదువు, సాధించుకున్న గ్రేడ్లు, వారి అనుభవాల ప్రకారం జరగడం లేదు. మూడు గంటల వ్యవధిలో సాగుతున్న తప్పుదారి పట్టించే ప్రయత్నాలపై ఆధారపడి ఉంటున్నది. దీనిని బిజెపి పెంచి పోషిస్తున్నది. అందుకే ఈ కుంభకోణాలన్నీ బిజెపి పాలిత రాష్ట్రాలైన గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, బీహార్‌లలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్‌ పోలీసు నియామకాల్లో కూడా స్కాములు జరిగాయి.
నీట్‌, నెట్‌, మెయిన్స్‌ వంటి ప్రవేశ పరీక్షలకు పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. భారత దేశంలో పాఠశాల వ్యవస్థ బలహీనంగా ఉంది. నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ శాంపిల్‌ సర్వే ఆఫీస్‌ ప్రకారం దీని మూలంగా ప్రతి నలుగురు విద్యార్ధుల్లో ఒకరు కోచింగ్‌ నిమిత్తం ట్యూషన్‌ సెంటర్లలో చేరుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇది 90 శాతంగా ఉంది. ఈ కోచింగ్‌ సెంటర్లు 2008 నుండి 2013 మధ్య కాలంలో బాగా పెరిగాయి. ఇప్పుడు మరింతగా పెరుగుతున్నది. 2020 నుండి 2024 వరకు నీట్‌ పరీక్షలో పాల్గొన్న వారి సంఖ్యను చూస్తే ప్రతీ ఏడాది ఇవి ఎంతగా పెరుగుతున్నాయో తెలుస్తుంది. 2020లో 15,97,435 మంది నీట్‌ పరీక్ష రాయగా, 2024లో 23,33,297 మంది రాశారు. పెరుగుతున్న ఈ పోటీని ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లు ఉపయోగించు కుంటున్నాయి. విద్యార్ధుల మధ్య పెరుగుత్ను పోటీ కోచింగ్‌ సెంటర్ల మధ్య పోటీని పెంచుతుంది. ఈ మార్కెట్‌ ను అందిపుచ్చుకోవడంలో ఉత్తరాది రాష్ట్రాలు ముందున్నాయి. అందులో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్‌, గోరఖ్‌పూర్‌ వంటి ప్రాంతాలు దీనిని హస్తగతం చేసుకున్నాయి. అందుకే ప్రతి సంవత్సరం ఈ పరీక్షలలో ఉత్తరప్రదేశ్‌ నుండి ఎక్కువ మంది విద్యార్ధులు పాల్గొంటారు. ఈ సంవత్సరం నీట్‌ కు కూడా ఉత్తరప్రదేశ్‌ నుండే అత్యధికంగా 3,39,125 మంది పాల్గొన్నారు. అక్కడ విద్యార్ధులు ఇరుకు గదుల్లో చాలీచాలని తిండి తింటూ అహర్నిశలు కష్టపడి చదువుతుంటారు. పెరుగుతున్న ఈ పోటీ, ఉద్యోగాల కొరత కోచింగ్‌ సెంటర్లకు అధిక ఫీజులు అందిస్తుంటే రాజకీయ నాయకులు స్కాములు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. దీనికి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం తోడవుతున్నది.
దేశాన్ని కుదిపివేసిన ‘వ్యాపమ్‌’ కుంభకోణం
బొగ్గు గనుల కుంభకోణం, మైనింగ్‌ కుంభకోణం కంటే ఘోరమైనది, మోసపూరితమైనది వ్యాపమ్‌ కుంభకోణం. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ స్కామ్‌ 2013లో బహిర్గతం అయింది. ప్రభుత్వం పోలీసులతో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. ఈ కుంభకోణంలో అభ్యర్ధుల నుండి 2,00,000 వరకు వసూలు చేసే లాభదాయకమైన వ్యాపారాన్ని సాగించిన ఘనత ఇండోర్‌ వైద్యుడు జగదీప్‌ సాగర్‌ది. ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ లోని తన కోచింగ్‌ సెంటర్‌ అడ్డాగా ఇటువంటి దారుణాలకు పాల్పడి కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇతగాడు 13,00,000 రూపాయలతో నింపిన పరుపుపై నిద్రించాడని ‘హిందుస్తాన్‌ టైమ్స్‌’లో ‘వింటేజ్‌ వైన్‌-బెడ్‌ ఆఫ్‌ క్యాష్‌’ అనే శీర్షికతో వచ్చిన నివేదిక తెలిపింది. ఈ స్కామ్‌ ద్వారా భూమి, విలాసవంతమైన కార్లు, ఆభరణాలను కూడబెట్టాడని పోలీసులు పేర్కొన్నారు. కానీ సాగర్‌ లాంటి వాళ్లు ఈ కుంభకోణంలో కోకొల్లలు. 2013 నుండి 2015 మధ్య కాలంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ 2,235 మందిని అరెస్టు చేసింది. 1860 మందిని ప్రశ్నించిన తరువాత బెయిల్‌పై విడుదల చేసింది. తీగ కదిపితే డొంకంతా కదిలినట్లు ఒక్కర్ని అరెస్టు చేసి ప్రశ్నిస్తే మొత్తం రాజకీయ నాయకుల గుట్టంతా బయట పడింది. ఈ స్కామ్‌లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కుటుంబ సభ్యులు, ఆరోగ్య, విద్య, మైనింగ్‌ శాఖలను నిర్వహించిన సీనియర్‌ మంత్రి లక్ష్మీకాంత్‌ శర్మ, ఆయన మాజీ సహాయకుడు సందీప్‌ శర్మ, అప్పటి గవర్నర్‌తో పాటు ఆయన కుమారుడు శైలేష్‌ యాదవ్‌తో సహా పై నుండి కింది వరకు అందరికి సంబంధాలున్నాయని టాస్క్‌ఫోర్స్‌ కనిపెట్టింది. దీనిని కప్పిపుచ్చడం కోసం సాక్షులనేవారు లేకుండా చేయడానికి హత్యల పరంపర కొనసాగింది. 2010 నుండి ‘వ్యాపమ్‌’ స్కామ్‌తో సంబంధం ఉన్న 40 మందికి పైగా వైద్యులు, వైద్య విద్యార్ధులు, పోలీసులు, సివిల్‌ సర్వెంట్లు అనుమానాస్పద స్థితిలో హత్యలు చేయబడ్డారు. ఇంతటి ఘోరం జరుగుతుంటే…పుట్టిన వారు ఏదో ఒక రోజు చనిపోవాల్సిందేనని, చనిపోయిన వారెవరూ హత్య చేయబడలేదని బిజెపి కప్పిపుచ్చుకుంది.
‘వ్యాపమ్‌’ను మించిన ‘డిమ్యాట్‌’ కుంభకోణం
‘వ్యాపమ్‌’ కుంభకోణం బయటపడిన రెండు సంవత్సరాల తరువాత 2015లో మళ్లీ మధ్యప్రదేశ్‌ లోనే (డి.ఎం.ఎ.టి) కుంభకోణం బయట పడింది. డెంటల్‌ అండ్‌ మెడికల్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (డి.ఎం.ఎ.టి) అనేది మధ్యప్రదేశ్‌లోని ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష. ఈ పరీక్షను అసోసియేషన్‌ ఫర్‌ ప్రైవేట్‌ మెడికల్‌ అండ్‌ డెంటల్‌ కాలేజెస్‌ (ఎ.పి.డి.ఎం.సి) నిర్వహించేది. ఇందులో అడ్మిషన్ల స్కామ్‌ 2006 నుండి జరుగుతున్నదని నిర్ధారణ అయ్యింది. ఇందులో ఒక్కొక్క అభ్యర్ధి నుండి 15 లక్షల నుండి కోటి రూపాయల వరకు వసూలు చేశారు. సుమారు రూ.10,000 కోట్ల వరకు స్కామ్‌ జరిగింది. వ్యాపమ్‌ కుంభకోణం, డిమ్యాట్‌ కుంభకోణం ఒకే పద్ధతిలో జరిగాయని మధ్యప్రదేశ్‌ ప్రొఫెషనల్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు (ఎం.పి.పి.ఇ.బి) మాజీ డైరెక్టర్‌ యోగేష్‌ దర్యాప్తు అధికారులకు చెప్పారు. విచారణ అనంతరం సుప్రీంకోర్టు డిమ్యాట్‌ కుంభకోణం వ్యాపమ్‌ కుంభకోణం కంటే అద్వాన్నంగా ఉందని పేర్కొంది. ఈ కుంభకోణాలన్నింటిలో బిజెపి పాత్ర ఉండటంతో ప్రజల్లో బిజెపిపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దీనిని తప్పుదోవ పట్టించడానికి కేంద్ర ప్రభుత్వం మెడికిల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఎం.సి.ఐ నిర్వహించే ప్రీ-మెడికల్‌ టెస్ట్‌ను ఒకే దేశం-ఒకే పరీక్ష అంటూ నేషనల్‌ ఎలిజిబిలిటి కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌కు (నీట్‌) మార్చింది. 2013 నుండి నీట్‌-యుజి , నీట్‌-పిజి ని నిర్వహించే బాధ్యత నేష్‌నల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఎన్‌టిఏ కు అప్పగించింది. ఎన్‌టిఏకు దీన్ని అప్పగించడంపై అనేక విమర్శలు ఎదురయ్యాయి. ముఖ్యంగా తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు ముక్త కంఠరతో వ్యతిరేకించాయి. అనంతరం కేవలం 2 భాషల్లోనే నిర్వహించే ఈ పరీక్షను 13 భాషల్లో నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఎన్‌టిఏ దీన్ని నిర్వహించడంలో పూర్తిగా విఫలమైంది. పరీక్ష నిర్వహణ మొదలుకొని ఫలితాల విడుదల వరకు అనేక అవకతవకలు జరుగుతున్నాయి. 2020లో మధ్యప్రదేశ్‌లో చింద్వారా జిల్లాకు చెందిన ఒక యువతి కేవలం ఆరు మార్కులు వచ్చాయని ఆత్మహత్య చేసుకుంది. అదే సంవత్సరం మృదుల్‌ రావత్‌కు 720 మార్కులకు 329 వచ్చాయి. అతను ఎన్‌టిఏ అధికారులను సంప్రదించగా 650 మార్కులతో ఎస్‌టి విభాగంలో ఆలిండియా టాపర్‌గా నిలిచాడు. ఒక సంవత్సరం తెలంగాణలో సాంకేతిక లోపం వలన విద్యార్ధులు చివరి 40 ప్రశ్నలు కోల్పోయారు. ఇప్పుడు ఏకంగా పేపర్‌ లీకేజికి పాల్పడింది. విమర్శలు వస్తున్న సందర్భంలో ఎటువంటి లోపాలు జరగవని, పరీక్షా పత్రాలు అత్యంత గోప్యంగా ఉంచ బడతాయని చెప్పిన ప్రధాని ఇప్పుడు స్పందించడమే లేదు.
‘నీట్‌’గా స్కామ్‌
కుంభకోణాలను అరికట్టడానికి తీసుకు వచ్చిన ‘నీట్‌’ ఇప్పుడు అతి పెద్ద కుంభకోణంగా మారింది. ఈ సంవత్సరం నీట్‌-యుజి పరీక్ష మే 5న 4750 సెంటర్లలో నిర్వహించబడింది. దీనికి దేశవ్యాప్తంగా 23,33,297 మంది విద్యార్ధులు హాజరయ్యారు. పరీక్షలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వచ్చాయి. కానీ విద్యా శాఖామంత్రి ధర్మేందర్‌ ప్రధాన్‌ మొదట ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్పుకొచ్చారు. తరువాత అక్షయ అనే విద్యార్ధిని నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌ అయిందని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అదేవిధంగా పరీక్ష ముందు రోజు బీహార్‌లో పేపర్‌ లీక్‌ చేశారని 14 మందిని అరెస్టు చేయడం జరిగింది. 30 మంది అభ్యర్ధుల నుండి 30 నుండి 40 లక్షల రూపాయలు వసూలు చేశారని కనుగొన్నారు. గుజరాత్‌ లోని ఫారిన్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీ అధినేత పురుషోత్తమ్‌ రారు, అధ్యాపకుడు తుషార్‌ భట్‌ సహకారంతో అభ్యర్ధుల నుండి రూ. 10 లక్షలు వసులు చేసి పేపర్‌ లీక్‌ చేశాడని వార్తలు వినిపించాయి. చివరికి ఫలితాల్లో ఎన్నడూ లేని విధంగా 69 మందికి 720/720 వచ్చాయి. అందులో ఒకే సెంటర్‌లో 8 మంది టాప్‌ ర్యాంక్‌తో నిలిచారు. చాలా మందికి అసాధారణంగా 718, 719 మార్కులు వచ్చాయి. దీనితో ఈ ఆరోపణలన్నీ నిజమయ్యాయి. తప్పని పరిస్థితిలో మొదట ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్పిన విద్యా శాఖా మంత్రి రెండు చోట్ల అవకతవకలు జరిగాయని ఒప్పుకున్నారు. సుప్రీంకోర్టు జోక్యంతో గ్రేస్‌ మార్కులు వచ్చిన 1563 మందికి మరలా జూన్‌ 23న పరీక్ష నిర్వహించారు. కానీ ఈ పరీక్షకు కేవలం 813 మందే హాజరయ్యారు. నీట్‌ కౌన్సిలింగ్‌ జులై 6న ఉంటుందనగా సుప్రీంకోర్టు ఈ స్కామ్‌పై విచారణను జులై 8కి వాయిదా వేసింది. దీనితో కొంత మంది కౌన్సిలింగ్‌ రెండు రోజులు పొడిగించాలని కోరినప్పటికీ వారి పిటిషన్లు తోసిపుచ్చింది. నీట్‌-యుజి స్కామ్‌ నుండి బయట పడక ముందే నీట్‌-పిజి పేపర్‌ లీక్‌ అయ్యిందని చెప్పి 24 గంటల్లోనే నీట్‌-పిజి పరీక్షను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ కుంభకోణాల వలన దేశంలో నీట్‌కు ప్రిపేర్‌ అవుతున్న విద్యార్ధులు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల విద్యార్ధులు ఎక్కువగా నష్టపోతున్నారు. దేశవ్యాప్తంగా విద్యార్ధులు ఆందోళనలు చేస్తున్నారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు నీట్‌ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభత్వంపైనా న్యాయ వ్యవస్థపైనా ఒత్తిడి చేస్తున్నాయి. కానీ మన రాష్ట్రంలోని రాజకీయ నాయకులకు కనీసం చీమ కుట్టినట్లు కూడా అనిపించడం లేదు. ఈ ఏడాది ఎ.పి లో 140 సెంటర్లలో 68,022 మంది విద్యార్ధులు నీట్‌-యుజి పరీక్ష రాశారు. వారి గురించి ఒక్క నాయకుడూ మాట్లాడటం లేదు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు, ఆ యా పార్టీల నుండి ఎన్నికైన పార్లమెంటు సభ్యులు ఈ నీట్‌ స్కామ్‌పై స్పందించాలి. ఎన్‌టిఏ రద్దు చెయ్యాలనే డిమాండ్‌ను బలపరచాలి. ప్రవేశ పరీక్షలు పాత పద్ధతిలోనే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహించుకొనేలా రాష్ట్రాల హక్కుల రక్షణకై విద్యార్ధులంతా ఐక్యంగా మరిన్ని పోరాటాలు నిర్వహించాలి.

డి. రాము
( వ్యాసకర్త ఎస్‌.ఎఫ్‌.ఐ విజయనగరం జిల్లా అధ్యక్షులు, సెల్‌ : 9705545164)

➡️