రాజ్యాంగ నిర్దేశానికి విరుద్ధం !

Feb 9,2024 07:20 #Editorial

                 దేశంలో ఏకరూప పౌర స్మ ృతిని తెచ్చిన మొదటి రాష్ట్రంగా బిజెపి ఏలుబడిలోని ఉత్తరాఖండ్‌ నిలిచింది. మంగళవారం నాడు ఈ అంశాన్ని శాసనసభలో ప్రవేశపెట్టడం, బుధవారం నాడు ఆమోదించేయడం…అంతా ఆగమేఘాల మీద జరిగిపోయింది! ఇందులోని అనేక అంశాలపై చర్చించాలని, సెలక్షన్‌ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు చేసిన విజ్ఞప్తిని పాలకపక్షం పెడచెవిన పెట్టింది. వాస్తవానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం యుసిసిని తీసుకురావటానికి చాలా ఏళ్లుగా ప్రయత్నం చేస్తోంది. మతపరమైన ఎజెండాతో ముడిపడి ఉన్న మూడు అంశాలు దానికి తొలినుంచీ ఉన్నాయి. అవి : అయోధ్య, జమ్ము కాశ్మీర్‌ స్వయంప్రతిపత్తికి సంబంధించిన 370 ఆర్టికల్‌ రద్దు, దేశంలో ఏకరూప పౌరస్మ ృతిని తేవడం. ఏకాభిప్రాయ సాధన కన్నా బలవంతపు రుద్దుడే తన బాణీగా పెట్టుకున్న బిజెపి, మొదటి రెంటినీ సాధించి, ఇప్పుడు యుసిసిపై దృష్టిని సారించింది.

దేశంలోని ప్రజలందరికీ ఒకే రకమైన చట్టం ఉండాలని, కానీ, ముస్లిములకు వేరేగా ఉందని విద్వేషపూరిత ప్రచారాన్ని కాషాయ పరివారం కుమ్మరిస్తూ ఉంటుంది. వాస్తవానికి దేశంలో ఏ పౌరుడికైనా నేరశిక్షాస్మ ృతి ఒక్కటే! కులంతో, మతంతో, లింగంతో, ప్రాంతంలో సంబంధం లేకుండా నేరస్తులు ఎవరికైనా ఒకే రకమైన శిక్షను విధించే ఉమ్మడి చట్టాలు ఉన్నాయి. అందులో ఏ మతానికీ, కులానికీ మినహాయింపులు ఉండవు. కానీ, వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం వంటి వ్యక్తిగత అంశాల్లో ఆయా తరగతుల నేపథ్యాలను, విశ్వాసాలను అనుసరించి ‘పర్సనల్‌ లా’లు ఉన్నాయి. ఇవి ముస్లిములకు మాత్రమే కాదు; హిందువులకూ వారి సంప్రదాయాలను బట్టి నిర్మితమయ్యాయి. వీటిపై రాజ్యాంగ నిర్మాణ సమయంలోనే విస్తారమైన చర్చ జరిగింది. వ్యక్తుల విశ్వాసాల్లోకి, జీవిత సంబంధాల్లోకి రాజ్యం దూరకూడదని, బలవంతంగా ‘ఒక మూస పద్ధతి’ని అమలు చేయకూడదని రాజ్యాంగ నిర్మాణకర్తలు అభిప్రాయపడ్డారు. యుసిసిని తేవటానికి ముందు ఆయా తరగతుల ప్రజల్లో ఆర్థిక, సామాజిక, లింగ సమానత్వాన్ని సాధించాలని, ఏకాభిప్రాయాన్ని నిర్మించాలని సూచించారు. కానీ, అటువంటి ప్రజాతంత్ర ప్రక్రియ ఏదీ చేపట్టకుండానే హడావిడిగా యుసిసిని ముందుకు తేవడం వెనుక ఉద్దేశం- మైనార్టీల పట్ల విద్వేషం రెచ్చగొట్టడం, మెజార్టీల ఓట్లను కొల్లగొట్టటం తప్ప మరొకటి కాదు.

2018లో మోడీ ప్రభుత్వం నియమించిన 21వ లా కమిషన్‌ రాజ్యాంగ కర్తల నిర్దేశానికి అనుగుణంగానే నివేదిక ఇచ్చింది. ”ఐక్యంగా ఉండటానికి యుసిసి మాత్రమే పరిష్కారం కాదు..” అని పేర్కొంటూ- ఇప్పటికిప్పుడు దేశంలో ఏకరూప పౌరస్మ ృతిని అమలు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. అంతకన్నా ముందు ఏమేమి చేయాలో స్పష్టమైన సిఫార్సులు చేసింది. అయితే, ఆ సిఫార్సులు తమ లక్ష్యానికి భిన్నంగా ఉన్నాయి కాబట్టి, మోడీ ప్రభుత్వం వాటిని కాలం గడిచిపోయేదాకా మురగబెట్టి, తరువాత బుట్టదాఖలు చేసింది. యుసిసి అంశంపైనే 2020లో 22వ లా కమిషన్‌ని నియమించింది. ఆ కమిషన్‌ అధ్యయనం, అభిప్రాయ సేకరణ పనిలో ఉండగానే ఉత్తరాఖండ్‌ బిజెపి ప్రభుత్వం యుసిసిపై హడావిడి నిర్ణయం చేసింది !

అందరినీ సమానంగా చూడ్డానికే ఈ చట్టమని వాక్రుచ్చుతున్న ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం- తన పాలనలో దిగజారిన మహిళా హక్కులు, బాలల విద్య వంటి విషయాల గురించి సెలవిస్తే బాగుండేది! మానవ హక్కులు, ఆరోగ్యం, తలసరి ఆదాయం వంటి అనేక కొలమానాల్లో ఆ రాష్ట్రం దారుణంగా వెనకబడటానికి కారణం బిజెపి కాదా? దైనందిన జీవన సమస్యలను పరిష్కరించకుండా వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించటం, భావోద్వేగ అంశాల వైపు ఉసిగొల్పడం ఆ పార్టీ సహజ క్రీడ. ఇంకో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు రానున్న తరుణంలో నిరుద్యోగం, రైతాంగ సమస్యలు, ప్రభుత్వ రంగాన్ని అమ్మివేయడం, ప్రజలపై భారాలు వంటివి చర్చనీయాంశాలు కాకుండా చేయాలని మోడీ ప్రభుత్వం తలపోస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా బిజెపి పాలిత రాష్ట్రాలు ఒక్కొక్కటి యుసిసిని తెర పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశ సమైక్యతకు, సమగ్రతకూ కీలకమైన బహుళత్వాన్ని నాశనం చేయాలని చూసే ఈ విద్వేష విన్యాసాన్ని ప్రజలు అర్థం చేసుకొని, తగిన గుణపాఠం చెప్పాలి!

➡️